ట్రాఫిక్ పోలీసులకు రూ.1.90 లక్షల సమ్మర్ కిట్లు..
ట్రాఫిక్ పోలీసులకు రూ.1.90 లక్షల సమ్మర్ కిట్లు..
హోంగార్డు కుటుంబానికి ఆర్థిక సాయం
కర్నూలు బ్యూరో, ఆంధ్రప్రభ : ఎండాకాలంలో విధులు నిర్వహిస్తున్న ట్రాఫిక్ పోలీసుల సంక్షేమాన్ని దృష్టిలో ఉంచుకుని కర్నూలు జిల్లా పోలీసు శాఖ ప్రత్యేక చర్యలు చేపట్టింది. ట్రాఫిక్ పోలీసు సిబ్బందికి రూ.1.90 లక్షల విలువైన సమ్మర్ కిట్ బ్యాగులను జిల్లా ఎస్పీ Vikrant Patil శనివారం పంపిణీ చేశారు.

కర్నూలు ట్రాఫిక్ పోలీస్ స్టేషన్‌లో నిర్వహించిన కార్యక్రమంలో ఎస్పీ విక్రాంత్ పాటిల్ పాల్గొని టోపీలు, స్టీల్ వాటర్ బాటిల్స్, ఎలక్ట్రాల్ బాక్స్‌లు, మాస్కులు, కళ్లద్దాలు తదితర వస్తువులతో కూడిన సమ్మర్ కిట్లను సిబ్బందికి అందజేశారు.

అంతకుముందు ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ ఆవరణలో ఏర్పాటు చేసిన Gautama Buddha విగ్రహాన్ని ఆవిష్కరించారు. అనంతరం పునర్నిర్మాణం చేసిన గదులను ప్రారంభించారు.
ఈ సందర్భంగా ఇటీవల విధి నిర్వహణలో ఉండగా మృతి చెందిన హోంగార్డు కృష్ణ కుటుంబానికి పోలీసు సిబ్బంది తరఫున సేకరించిన రూ.50,800 ఆర్థిక సహాయాన్ని అందజేశారు.
మీడియాతో మాట్లాడిన ఎస్పీ విక్రాంత్ పాటిల్, డీజీపీ చీఫ్ ఆఫీస్ నుంచి అందిన నిధులతో రూ.1,90,500 విలువైన సమ్మర్ కిట్లను పంపిణీ చేసినట్లు తెలిపారు. కర్నూలు నగరంతో పాటు ఆదోని, ఎమ్మిగనూరు ట్రాఫిక్ విభాగాల్లో పనిచేస్తున్న మొత్తం 127 మంది ట్రాఫిక్ పోలీసు సిబ్బందికి ఈ కిట్లు అందజేసినట్లు చెప్పారు.
తీవ్ర ఎండలను లెక్కచేయకుండా ప్రజలకు సేవలందిస్తూ, ట్రాఫిక్ నియంత్రణ బాధ్యతలను సమర్థంగా నిర్వహిస్తున్న ట్రాఫిక్ పోలీసుల సేవలను ఎస్పీ అభినందించారు. వారి ఆరోగ్యం, సంక్షేమం కోసం పోలీసు శాఖ ఎల్లప్పుడూ కట్టుబడి ఉంటుందని పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో అదనపు ఎస్పీ జె. బాబు ప్రసాద్, ట్రాఫిక్ సీఐ మన్సురుద్దీన్, స్పెషల్ బ్రాంచ్ సీఐ మధుసూదన్ రావు, టూ టౌన్ సీఐ శ్రీధర్, సీసీఎస్ సీఐ రామకృష్ణ, ఆర్‌ఎస్‌ఐలు, ట్రాఫిక్ పోలీసు సిబ్బంది పాల్గొన్నారు.
