గ్రామాభివృద్ధికి పార్టీలకతీతంగా కృషి చేస్తా…

ఊట్కూర్, ఆంధ్రప్రభ : గ్రామాభివృద్ధికి ప్రతి ఒక్కరూ సహకరించాలని మల్లేపల్లి సర్పంచ్ సత్యారంకతలప్పఅన్నారు. శనివారం నారాయణపేట జిల్లా ఊట్కూర్ మండల పరిధిలోని మల్లేపల్లి గ్రామపంచాయతీ కార్యాలయం వద్ద గ్రామసభ నిర్వహించారు. గ్రామ సభలో పంచాయతీ కార్యదర్శి సుమన్ ఓటర్ జాబితా ప్రత్యేక సవరణ, జల సంరక్షణ, వనమహోత్సవం, సురక్షిత త్రాగునీరు, ప్లాస్టిక్ నిషేధం తదితర అంశాలను గ్రామసభలో చదివి వినిపించారు. ఈ సందర్భంగా సర్పంచ్ మాట్లాడుతూ వర్షాకాలంలో రహదారిపై వర్షపు నీటి ఉధృతికి రాకపోకలునిలిచి ప్రజలు ఇబ్బందులు పడుతుండగా మంత్రి డాక్టర్ వాకిటి శ్రీహరి దృష్టికి తీసుకువెళ్లగా రూ. 2 కోట్ల నిధులతో బ్రిడ్జి పనులు వర్షాకాలం ప్రారంభం నాటికి పూర్తి చేయనున్నట్లు తెలిపారు.

ప్రజలు ప్రభుత్వ సంక్షేమ పథకాలు సద్వినియోగం చేసుకోవాలని పరిసరాలు పరిశుభ్రంగా ఉంచుకోవడంతో పాటు ప్లాస్టిక్ వినియోగాన్ని నిర్మూలించి గన్నీ సంచులు వాడాలని అన్నారు. రైతులు ప్రజలు ఉపాధి హామీ పనులు సద్వినియోగం చేసుకోవాలని ప్రతి ఒక్కరూ మొక్కలు నాటి కాలుష్యాన్ని నివారించేందుకు ముందుకు రావాలన్నారు. ప్రభుత్వ సంక్షేమ పథకాలు పార్టీలకతీతంగా అర్హులైన పేదవారికి మంజూరు చేస్తానన్నారు. వర్షాకాలం ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సీజన్ వ్యాధులు సోకకుండా జాగ్రత్తలు పాటించాలన్నారు. ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ రాజు, పంచాయతీ కార్యదర్శి సుమన్, ఫీల్డ్ అసిస్టెంట్ గోపాల్ తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply