నందికొట్కూరులో పరిశుభ్రతపై కఠిన చర్యలు

నందికొట్కూర్, ఆంధ్రప్రభ : నందికొట్కూరు పట్టణంలో పరిశుభ్రతపై కఠిన చర్యలు తీసుకోవాలని మున్సిపల్ కమిషనర్ వెంకట్రామిరెడ్డి శానిటేషన్ సిబ్బందికి సూచించారు. ఆదివారం ఆయన స్వయంగా ఫీల్డ్‌లోకి వెళ్లి చెత్త సేకరణ పనులను పర్యవేక్షించారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ, మున్సిపల్ పారిశుధ్య కార్మికులు మరియు సిబ్బంది సమన్వయంతో చెత్తను మున్సిపల్ ట్రాక్టర్లలో ఎక్కించి వెంటనే తరలించేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ఎక్కడైనా చెత్త పేరుకుపోకుండా ప్రత్యేక దృష్టి పెట్టాలని సూచించారు.
పట్టణంలో స్వచ్ఛతను కాపాడడం ప్రతి ఒక్కరి బాధ్యత అని పేర్కొన్న ఆయన, ప్రజలు చెత్తను ఎక్కడ పడితే అక్కడ వేయకుండా సహకరించాలని కోరారు. నియమాలను ఉల్లంఘిస్తే జరిమానాలు విధించడంలో వెనుకాడబోమని హెచ్చరించారు. శానిటేషన్ వ్యవస్థను మరింత బలోపేతం చేసి, ప్రతి ప్రాంతంలో సమయానికి చెత్త సేకరణ జరిగేలా చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. పట్టణాన్ని పరిశుభ్రంగా, ఆరోగ్యకరంగా ఉంచేందుకు మున్సిపాలిటీ ప్రత్యేక ప్రణాళికను అమలు చేస్తున్నట్లు వెల్లడించారు.
ప్రజలు తమ ఇల్లు మరియు పరిసరాలను శుభ్రంగా ఉంచుకోవాలని, చెత్తను డస్ట్‌బిన్‌లోనే వేయాలని సూచించారు. అలాగే పరిసరాల్లో నీరు నిల్వ ఉండకుండా జాగ్రత్తలు తీసుకోవాలని, లేదంటే దోమలు పెరిగి డెంగ్యూ, మలేరియా వంటి వ్యాధులు వ్యాపించే ప్రమాదం ఉందని హెచ్చరించారు.
పరిశుభ్రత పాటించడం అనేది కేవలం వ్యాధులను నివారించడం మాత్రమే కాకుండా, ఆరోగ్యకరమైన జీవన ప్రమాణాలను పెంపొందించుకోవడమే లక్ష్యమని అన్నారు. అదనంగా, ఎలక్ట్రానిక్ వ్యర్థాల సేకరణ కార్యక్రమాన్ని ప్రారంభించినట్లు తెలిపారు. ప్రజలు తమ ఇళ్లలోని ఈ-వేస్ట్‌ను బయట వేయకుండా, ఉదయం వచ్చే చెత్త బండిలోనే ఇవ్వాలని సూచించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ డీఈ నాసిర్, ఏఈ దినేష్ కుమార్, సచివాలయం సిబ్బంది మనోజ్ కుమార్, రెడ్డి సాగర్, సంజన్నతో పాటు శానిటేషన్ సిబ్బంది పాల్గొన్నారు.
