అచ్చంపేటలో కలెక్టర్ విస్తృత పర్యటన
అచ్చంపేటలో కలెక్టర్ విస్తృత పర్యటన
- రైతు నుంచి రోగి వరకు… సేవలపై కలెక్టర్ సమీక్ష
- పట్టణ పరిశుభ్రత, వైద్య సేవలు, ఇందిరమ్మ ఇళ్ల పురోగతిపైనా సమీక్ష
అచ్చంపేట, ఆంధ్రప్రభ ; రైతులు కష్టపడి పండించిన ధాన్యాన్ని ఎలాంటి జాప్యం లేకుండా కొనుగోలు చేయాలని, పట్టణ పరిశుభ్రత, వైద్య సేవలు, ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలను వేగవంతం చేయాలని నాగర్‌కర్నూల్ జిల్లా కలెక్టర్ హేమంత్ కేశవ్ పాటిల్ అధికారులను ఆదేశించారు. శనివారం అచ్చంపేట పట్టణంలో విస్తృతంగా పర్యటించిన ఆయన వరి కొనుగోలు కేంద్రాలు, శానిటేషన్ పనులు, ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలు, ప్రభుత్వ ఆసుపత్రి, ఎన్టీఆర్ స్టేడియంను పరిశీలించి అధికారులతో సమీక్ష నిర్వహించారు.
అచ్చంపేట వ్యవసాయ మార్కెట్ యార్డులో మెప్మా ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వరి కొనుగోలు కేంద్రాన్ని సందర్శించిన కలెక్టర్, రైతులతో నేరుగా మాట్లాడి కొనుగోలు ప్రక్రియపై వారి అభిప్రాయాలను తెలుసుకున్నారు. ధాన్యం తూకం, నాణ్యత పరీక్షలు, చెల్లింపుల ప్రక్రియ, రికార్డుల నిర్వహణను పరిశీలించి రైతులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా చర్యలు తీసుకోవాలని సూచించారు. ఇప్పటివరకు సేకరించిన ధాన్యం నిల్వలు, మిల్లులకు తరలింపు, ఇంకా కొనుగోలు చేయాల్సిన ధాన్యం వివరాలను అధికారులను అడిగి తెలుసుకున్నారు.

కొనుగోలు కేంద్రాల వద్ద అధికారులు అందుబాటులో ఉండి ధాన్యం సేకరణను నిశితంగా పర్యవేక్షించాలని ఆదేశించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం రైతులు, పేద ప్రజల సంక్షేమానికి అత్యంత ప్రాధాన్యత ఇస్తోందన్నారు. ధాన్యం కొనుగోళ్లను పారదర్శకంగా, సత్వరంగా పూర్తి చేసి రైతులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చూడాలని సూచించారు. అనంతరం పట్టణంలోని పలు వార్డుల్లో జరుగుతున్న శానిటేషన్ పనులను పరిశీలించిన కలెక్టర్, రహదారుల పరిశుభ్రత, చెత్త సేకరణ, డ్రైనేజీల నిర్వహణపై అధికారులకు సూచనలు చేశారు.
వర్షాకాలాన్ని దృష్టిలో ఉంచుకుని ఎక్కడా మురుగు నీరు నిల్వ ఉండకుండా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణ పనులను పరిశీలించిన కలెక్టర్, లబ్ధిదారులు త్వరగా గృహప్రవేశం చేసేలా పనులను వేగవంతం చేయాలని సూచించారు. నిర్మాణ నాణ్యతలో రాజీ పడొద్దని, అవసరమైన సాంకేతిక సహాయం అందించాలని అధికారులకు సూచించారు.

అచ్చంపేట ప్రభుత్వ ఆసుపత్రిని సందర్శించిన కలెక్టర్, రోగులకు అందుతున్న వైద్య సేవలు, మందుల లభ్యత, సిబ్బంది హాజరు, ఆసుపత్రి పరిశుభ్రతను పరిశీలించారు. పాముకాటు, కుక్కకాటు మందులతో పాటు అవసరమైన అన్ని ఔషధాలు అందుబాటులో ఉంచాలని, వైద్యులు సమయపాలన పాటిస్తూ రోగులకు మెరుగైన సేవలు అందించాలని ఆదేశించారు. తదనంతరం ఎన్టీఆర్ స్టేడియంను పరిశీలించిన కలెక్టర్, పార్కింగ్, నిర్వహణ, అభివృద్ధి అవకాశాలపై అధికారులతో సమీక్ష నిర్వహించారు. యువతకు మరింత మెరుగైన క్రీడా సదుపాయాలు కల్పించేలా చర్యలు చేపట్టాలని సూచించారు.
