వృద్ధుల సమస్యలపై మానవీయంగా స్పందించిన కలెక్టర్

వృద్ధుల సమస్యలపై మానవీయంగా స్పందించిన కలెక్టర్
- ప్రజావాణిలో 35 దరఖాస్తుల స్వీకరణ
నాగర్ కర్నూల్, ఆంధ్రప్రభ: బాధిత వృద్ధుల పట్ల నాగర్ కర్నూల్ జిల్లా కలెక్టర్ హేమంత కేశవ్ పాటీల్ మానవీయ కోణంలో స్పందించారు. సోమవారం నాడు కలెక్టరేట్‌లోని సమావేశ మందిరంలో అదనపు కలెక్టర్ పి. అమరేందర్‌తో కలిసి ఆయన ‘ప్రజావాణి’ కార్యక్రమాన్ని నిర్వహించారు. జిల్లా నలుమూలల నుంచి వచ్చిన ప్రజల నుంచి మొత్తం 35 దరఖాస్తులను స్వీకరించారు. ఈ సందర్భంగా తమ పిల్లలు ఆస్తులను రాగించుకుని, ఇప్పుడు తమ్ముడిని పట్టించుకోవడం లేదంటూ ఆవేదనతో ప్రజావాణికి వచ్చిన కొందరు వృద్ధులను చూసి కలెక్టర్ స్వయంగా వారి వద్దకే వెళ్లారు. వారి సమస్యలను ఎంతో ఓపిగ్గా, శ్రద్ధగా విని, ధైర్యం చెప్పారు. వృద్ధుల పట్ల కలెక్టర్ చూపిన ఈ ఆప్యాయత, తక్షణ స్పందన అక్కడ ఉన్న వారందరినీ ఎంతగానో కదిలించింది. ప్రజల సమస్యల పరిష్కారంలో అధికారులు ఎల్లప్పుడూ మానవీయ దృక్పథంతో వ్యవహరించాలని ఆయన ఈ సందర్భంగా సూచించారు.
ప్రజావాణి ప్రాముఖ్యత గురించి కలెక్టర్ హేమంత కేశవ్ పాటీల్ మాట్లాడుతూ.. జిల్లా స్థాయి అధికారులు ప్రతి సోమవారం తప్పకుండా ఈ కార్యక్రమానికి హాజరు కావాలని ఆదేశించారు. సుదూర ప్రాంతాల నుంచి జిల్లా కేంద్రానికి వచ్చే ప్రజలకు ప్రజావాణిపై నమ్మకం కల్పించే బాధ్యత అధికారులపైనే ఉందన్నారు. ఒకవేళ ఏవైనా దరఖాస్తులను తిరస్కరించాల్సి వస్తే, అందుకు గల స్పష్టమైన కారణాలను (రిమార్కులు) తప్పనిసరిగా నమోదు చేయాలని స్పష్టం చేశారు. ప్రజావాణిలో అందిన ప్రతి దరఖాస్తుపై ఎండార్స్‌మెంట్ చేసి, సంబంధిత శాఖలకు పంపించామని, ఎలాంటి జాప్యం లేకుండా వీటిని క్షుణ్ణంగా పరిశీలించాలని అధికారులను ఆదేశించారు.
ముఖ్యంగా పెండింగ్‌లో ఉన్న ఆర్జీలపై ప్రత్యేక దృష్టి సారించి, వేగంగా పరిష్కార చర్యలు చేపట్టాలని కలెక్టర్ సూచించారు. పరిష్కరించిన దరఖాస్తుల వివరాలను ఎప్పటికప్పుడు ఆన్‌లైన్‌లో అప్‌లోడ్ చేయాలని, రాష్ట్ర స్థాయి నుంచి వచ్చే ఫిర్యాదులకు అత్యంత ప్రాధాన్యతనిస్తూ వెనువెంటనే పరిష్కరించాలని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో కలెక్టరేట్ ఏవో చంద్రశేఖర్, వివిధ విభాగాల సూపరింటెండెంట్లు, జిల్లా అధికారులు పాల్గొన్నారు.

