పర్యావరణ పరిరక్షణ చర్యలకు గుర్తింపు

పర్యావరణ పరిరక్షణ చర్యలకు గుర్తింపు

  • మంత్రి కొండా సురేఖ చేతుల మీదుగా అవార్డు

క్యాతన్‌పల్లి, ఆంధ్రప్రభ : ప్రపంచ పర్యావరణ దినోత్సవం–2026 సందర్భంగా తెలంగాణ కాలుష్య నియంత్రణ మండలి ఆధ్వర్యంలో నిర్వహించిన రాష్ట్ర స్థాయి పోటీల్లో సింగరేణి రామకృష్ణాపూర్ ఏరియా ఆసుపత్రి ప్రభుత్వ రంగ ఆసుపత్రుల విభాగంలో ప్రథమ స్థానం సాధించింది.

హెల్త్‌కేర్, పరిశుభ్రత, ఎకో-ఫ్రెండ్లీ విభాగాల్లో విశిష్ట పనితీరు కనబర్చినందుకు ఆసుపత్రికి ఈ రాష్ట్ర స్థాయి పురస్కారం లభించింది. పర్యావరణ పరిరక్షణ, హరిత కార్యక్రమాల అమలు, వైద్య వ్యర్థాల సమర్థ నిర్వహణ, ప్లాస్టిక్ నియంత్రణ, ఆసుపత్రి పరిసరాల అభివృద్ధి, పర్యావరణహిత చర్యలను విజయవంతంగా చేపట్టినందుకు ఈ అవార్డును ప్రదానం చేశారు.

శుక్రవారం హైదరాబాద్‌లో నిర్వహించిన కార్యక్రమంలో రాష్ట్ర అటవీ, పర్యావరణ శాఖ మంత్రి కొండా సురేఖ చేతుల మీదుగా ఆసుపత్రి ప్రతినిధులు ఈ పురస్కారాన్ని అందుకున్నారు.

ఈ సందర్భంగా ఏరియా ఆసుపత్రి వైద్యులు, నర్సింగ్ సిబ్బంది, పారామెడికల్ సిబ్బంది మరియు ఇతర ఉద్యోగులను అడ్మిన్ డిప్యూటీ చీఫ్ మెడికల్ ఆఫీసర్ (డీసీఎంఓ) ఎం. మధుకుమార్ అభినందించారు. భవిష్యత్తులో కూడా పర్యావరణ పరిరక్షణకు అత్యంత ప్రాధాన్యత ఇస్తూ ఆదర్శవంతమైన వైద్య సేవలను అందిస్తామని ఆయన తెలిపారు. ఈ ఘనత సాధించడంలో సహకరించిన ప్రతి ఉద్యోగి, అధికారికి ఆయన ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు.