వైభవంగా పడమటి అంజన్న ప్రభోత్సవం..

మక్తల్, ఆంధ్రప్రభ : మక్తల్ పట్టణంలో వెలసిన శ్రీ పడమటి ఆంజనేయ స్వామి వారి బ్రహ్మోత్సవాల భాగంగా బుధవారం స్వామివారి ప్రభోత్సవ వేడుకలు వైభవంగా నిర్వహించారు. స్వామివారి బ్రహ్మోత్సవాల్లో ప్రధానమైన పాలప్రభోత్సవ కార్యక్రమానికి భక్తులు భారీగా తరలివచ్చారు. దీంతో ఆలయ ప్రాంగణంలోని రాంలీలా మైదానం కిటకిటలాడింది.
పోలీసులు, వివిధ ధార్మిక సంస్థల సభ్యులు నిర్వహణ, నియంత్రణకు అవసరమైన చర్యలు తీసుకున్నారు. కోరిన కోరికలను తీర్చే స్వామిగా పేరుగాంచిన పడమటి ఆంజనేయ స్వామి బ్రహ్మోత్సవాలకు వేలాదిగా భక్తులు తరలివచ్చి కార్యక్రమంలో పాల్గొన్నారు. ఆలయ ధర్మకర్త పి. ప్రాణేశాచార్య, విధ్వాన్ రాఘవేంద్రాచార్య స్వామివారికి దేవాలయంలో విశేష పూజలు నిర్వహించారు.
తరువాత స్వామివారి ఉత్సవ విగ్రహాలను పల్లకిలో ప్రతిష్టించి పట్టణంలోని మెయిన్ రోడ్‌లో ఉన్న గోధా ఆంజనేయ స్వామి దేవాలయం వరకు భజన బృందాల మధుర నినాదాల మధ్య పల్లకి యాత్ర జరిగింది. తిరిగి పల్లకి సేవ ఆలయానికి చేరుకున్నాక స్వామివారి ఉత్సవ మూర్తిని ప్రభోత్సవం పై ప్రతిష్టించారు.
ఈ సందర్భంగా అర్చకులు, వేడుకలకు తరలివచ్చిన భక్తులు, ప్రముఖులు ప్రభోత్సవానికి హారతులు పట్టి కొబ్బరికాయలు కొట్టారు. “రామలక్ష్మణ జానకి జై”, “బోలో హనుమానుకీ జై”, “శ్రీరామ్ జై జై శ్రీరామ్” అంటూ నినాదాలు మార్మోగాయి. భక్తులు భక్తిశ్రద్ధలతో ప్రభోత్సవాన్ని పడమర దిక్కున ఉన్న చిన్న ఆంజనేయ స్వామి దేవాలయం వరకు లాగారు.
అక్కడ విశేష పూజలు నిర్వహించిన అనంతరం తిరిగి దేవాలయ వద్దకు ప్రభోత్సవాన్ని తీసుకువచ్చారు. ఈ సందర్భంగా భక్తుల గోవింద నామస్మరణలతో ఆలయ ప్రాంగణం మారుమోగిపోయింది.
ఈ కార్యక్రమంలో ఆలయ ధర్మకర్త పి. ప్రాణేశాచార్య, ఈవో కవిత, మాజీ ఎంపీపీ–బీజేపీ రాష్ట్ర నాయకుడు కొండయ్య, దేవరింటి నర్సింహారెడ్డి, బి. రాజశేఖర్ రెడ్డి, బ్యాటరీ రాజు, కురువ లింగం, కాంగ్రెస్ నాయకులు జి. లక్ష్మారెడ్డి, బోయ రవికుమార్, కావలి తాయప్ప, వల్లంపల్లి లక్ష్మణ్, బిఆర్ఎస్ నాయకులు రాజుల ఆశిరెడ్డి, బ్రాహ్మణ పరిషత్ సభ్యులు మాన్వి రామారావు, కరణం గోవిందరావు, హన్మేశాచార్య తదితరులు పాల్గొన్నారు.
