Chandrababu | బ్లూ ఎకానమీదే భవిష్యత్..

Chandrababu | బ్లూ ఎకానమీదే భవిష్యత్..

  • సీఫుడ్ ఎగుమతుల్లో ఏపీ అగ్రగామి…
  • దేశ రొయ్యల ఉత్పత్తిలో 66% ఏపీ నుంచే…
  • దేశ సీఫుడ్ ఆదాయంలో 38% ఏపీ వాటా

విశాఖపట్నం, ఆంధ్రప్రభ: విశాఖపట్నంలో నిర్వహించిన ‘నేషనల్ సీఫుడ్ ఎక్స్‌పోర్ట్స్ వర్క్‌షాప్’లో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కీలక వ్యాఖ్యలు చేశారు. బ్లూ ఎకానమీ అభివృద్ధికి ప్రత్యేక మంత్రిత్వ శాఖను ఏర్పాటు చేసిన ప్రధాని నరేంద్ర మోదీకి ఆయన కృతజ్ఞతలు తెలిపారు. సముద్ర సంపద ఆధారంగా ఆర్థికాభివృద్ధి సాధించేందుకు కేంద్ర ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు దేశ భవిష్యత్తుకు దోహదపడతాయని పేర్కొన్నారు.

కేంద్ర మంత్రులు, విధాన రూపకర్తలు, శాస్త్రవేత్తలు, పరిశ్రమల ప్రతినిధులు, ఎగుమతిదారులు, పారిశ్రామికవేత్తలు, మత్స్యకార సంఘాల ప్రతినిధులు పాల్గొన్న ఈ జాతీయ వర్క్‌షాప్ దేశ సీఫుడ్ రంగ భవిష్యత్తును నిర్దేశించే వేదికగా నిలుస్తుందని చంద్రబాబు అన్నారు.

దేశంలో మత్స్య, ఆక్వాకల్చర్ రంగంలో ఆంధ్రప్రదేశ్ అగ్రగామిగా ఉందని సీఎం తెలిపారు. దేశ చేపల ఉత్పత్తిలో 28 శాతం, రొయ్యల ఉత్పత్తిలో 66 శాతం ఏపీ నుంచే వస్తోందని పేర్కొన్నారు. అలాగే దేశ సీఫుడ్ ఎగుమతుల ద్వారా లభించే ఆదాయంలో 38 శాతం ఆంధ్రప్రదేశ్ నుంచే వస్తోందని వెల్లడించారు. ప్రతి ఏడాది రూ.28 వేల కోట్లకు పైగా విలువైన సముద్ర ఆహార ఉత్పత్తులు రాష్ట్రం నుంచి ఎగుమతి అవుతున్నాయని చెప్పారు.

ప్రపంచ సీఫుడ్ వ్యాపారంలో భారత్ వాటా ప్రస్తుతం కేవలం 5 శాతం మాత్రమేనని, ఈ రంగంలో దేశానికి అపార అవకాశాలు ఉన్నాయని చంద్రబాబు అన్నారు. ఆక్వా రంగంలో ఆవిష్కరణలు, అంతర్జాతీయ ప్రమాణాలతో నాణ్యత పెంపు, విలువ ఆధారిత ఉత్పత్తుల అభివృద్ధి ద్వారా ఎగుమతులను మరింత పెంచవచ్చని తెలిపారు.

ఆంధ్రప్రదేశ్‌లో విశాఖపట్నం, కాకినాడ, భీమవరం, నెల్లూరు, కృష్ణపట్నం వంటి ప్రాంతాలు ఆక్వా ఉత్పత్తి కేంద్రాలుగా అభివృద్ధి చెందాయని పేర్కొన్నారు. రొయ్యల ఉత్పత్తి మరింత పెరిగేందుకు రాష్ట్రంలో అనుకూల పరిస్థితులు ఉన్నాయని తెలిపారు. ఈ సందర్భంగా కాకినాడ పోర్టు ఆధునికీకరణకు కేంద్రం ముందుకు రావడాన్ని సీఎం స్వాగతించారు. కేంద్ర మత్స్యశాఖ ప్రాంతీయ కార్యాలయానికి అవసరమైన భూమిని 15 రోజుల్లో కేటాయిస్తామని హామీ ఇచ్చారు.

పారిశ్రామికవేత్తలకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటుందని, పెట్టుబడులు పెట్టేందుకు రాష్ట్రంలో అనుకూల వాతావరణం కల్పిస్తామని చంద్రబాబు స్పష్టం చేశారు. కాలుష్య నియంత్రణతో పాటు స్థిరమైన అభివృద్ధికి ప్రాధాన్యం ఇస్తామని చెప్పారు. 21వ శతాబ్దం ప్రధాని మోదీది.. వచ్చే శతాబ్దం పూర్తిగా భారత్‌దే అని వ్యాఖ్యానించిన చంద్రబాబు, బ్లూ ఎకానమీ రంగంలో భారత్ ప్రపంచ నాయకత్వ స్థానానికి చేరుకునే సామర్థ్యం ఉందని అభిప్రాయపడ్డారు.