దివిస్‌లో ‘ఏక్ పేడ్ మా కే నామ్’ కార్యక్రమం
దివిస్‌లో ‘ఏక్ పేడ్ మా కే నామ్’ కార్యక్రమం
దివిస్ లాబొరేటరీస్‌లో ప్రపంచ పర్యావరణ దినోత్సవ వేడుకలు
చౌటుప్పల్, ఆంధ్రప్రభ: భూగోళాన్ని కాపాడుకోవడానికి పర్యావరణ పరిరక్షణ, వాతావరణ మార్పుల నియంత్రణపై ప్రతి ఒక్కరూ అవగాహన కలిగి ఉండాలని దివిస్ లాబొరేటరీస్ ఉపాధ్యక్షుడు ఎస్. రామకృష్ణ పిలుపునిచ్చారు. 53వ ప్రపంచ పర్యావరణ దినోత్సవాన్ని పురస్కరించుకొని చౌటుప్పల్‌లోని దివిస్ లాబొరేటరీస్‌లో శుక్రవారం వివిధ కార్యక్రమాలు నిర్వహించారు. పర్యావరణ పరిరక్షణ, వాతావరణ మార్పుల నియంత్రణపై అవగాహన కల్పించే ఉద్దేశంతో ఈ కార్యక్రమాలను చేపట్టారు.
ఈ వేడుకలకు సంస్థ ఉపాధ్యక్షులు ఎస్. రామకృష్ణ, జె. హేమంత్‌కుమార్ అధ్యక్షత వహించారు. ఈ సందర్భంగా ఉద్యోగులు “వాతావరణ మార్పుల నియంత్రణకు మన చర్యలు” అనే అంశంపై ప్రతిజ్ఞ చేశారు. పర్యావరణ పరిరక్షణకు కట్టుబడి ఉంటామని తెలిపారు. అనంతరం పర్యావరణ హిత జీవన విధానాలను ప్రోత్సహించేలా రూపొందించిన “10 ఎకో లైఫ్ స్టైల్స్” అవగాహన కరపత్రాలను సంస్థ ఉపాధ్యక్షులు ఆవిష్కరించారు.
ఈ సందర్భంగా ఎస్. రామకృష్ణ మాట్లాడుతూ.. ప్రతి ఒక్కరూ పర్యావరణ హిత జీవన శైలిని అలవర్చుకోవాలని కోరారు. విస్తృత స్థాయిలో మొక్కలు నాటే కార్యక్రమాల్లో భాగస్వాములు కావాలని సూచించారు. కేంద్ర పర్యావరణ, అడవులు మరియు వాతావరణ మార్పుల మంత్రిత్వ శాఖ సూచనల మేరకు “ఏక్ పేడ్ మా కే నామ్” కార్యక్రమంలో భాగంగా సంస్థ ఆవరణలో పెద్ద ఎత్తున మొక్కలు నాటారు.
సంస్థ పర్యావరణ పరిరక్షణ విభాగానికి చెందిన అసిస్టెంట్ జనరల్ మేనేజర్ డి.వి. రాఘవేంద్రరావు ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన పర్యావరణ అవగాహన ప్రదర్శన స్టాల్ ఆకట్టుకుంది. ఈ స్టాల్‌లో దివిస్ ఉద్యోగులు రూపొందించిన పర్యావరణ పరిరక్షణకు సంబంధించిన నమూనాలు, ప్రదర్శనలు సందర్శకులను ఆకర్షించాయి.
ఈ కార్యక్రమంలో దివిస్ సంస్థ ఉపాధ్యక్షులు ఎస్. రామకృష్ణ, జె. హేమంత్‌కుమార్, జనరల్ మేనేజర్లు జి. బాలకిషోర్, పెండ్యాల సుధాకర్, అసిస్టెంట్ జనరల్ మేనేజర్ డి.వి. రాఘవేంద్రరావు, ఇతర ఉన్నతాధికారులు, ఉద్యోగులు పాల్గొన్నారు.

