AP | ప్రజల్లోకి ఎన్డీఏ.. మూడు నగరాల్లో భారీ సభలు

AP | ప్రజల్లోకి ఎన్డీఏ.. మూడు నగరాల్లో భారీ సభలు

  • రాజ్యసభ సీట్లపై క్లారిటీ.. టీడీపీకి 3, జనసేనకు 1
  • ఎన్డీఏ ఉమ్మడి కార్యాచరణ ఖరారు..
  • రెండేళ్ల పాలనపై సంయుక్త ప్రచారం..
  • సంక్షేమం, సుపరిపాలన, అభివృద్ధే ఎన్డీఏ అజెండా..

అమరావతి: ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధ్యక్షతన జరిగిన ఎన్డీఏ పక్షాల సమన్వయ సమావేశం ముగిసింది. సమావేశం అనంతరం టీడీపీ, జనసేన, బీజేపీ నేతలు మీడియాతో మాట్లాడారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల రెండేళ్ల పాలనలో చేపట్టిన అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు ఉమ్మడి కార్యాచరణను ఖరారు చేసినట్లు వెల్లడించారు.

టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు మాట్లాడుతూ… కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల రెండేళ్ల పాలనపై సంయుక్త ప్రచార కార్యక్రమాలను నిర్వహించాలని నిర్ణయించినట్లు తెలిపారు. ఈ నెల 9న తిరుపతి, 12న అమరావతి, 15న విశాఖపట్నంలో భారీ బహిరంగ సభలు నిర్వహించనున్నట్లు వెల్లడించారు. తిరుపతిలో సంక్షేమం, అమరావతిలో సుపరిపాలన, విశాఖలో అభివృద్ధి అంశాలను ప్రధానంగా ప్రజలకు వివరించనున్నట్లు చెప్పారు.

అలాగే ఈ నెల 13, 16, 17, 18, 19, 20 తేదీల్లో జిల్లాల వారీగా ప్రజల్లోకి వెళ్లి ప్రభుత్వ పనితీరును వివరించే కార్యక్రమాలు చేపట్టనున్నట్లు తెలిపారు. ఈ ప్రచార కార్యక్రమాలకు సంబంధించిన పూర్తి షెడ్యూల్‌ను త్వరలో విడుదల చేస్తామని చెప్పారు. సమావేశంలో ఎస్‌ఐఆర్ అంశంపై కూడా చర్చించినట్లు వెల్లడించారు.

రాజ్యసభ స్థానాల కేటాయింపుపై కూడా కీలక నిర్ణయం తీసుకున్నట్లు పల్లా శ్రీనివాసరావు తెలిపారు. నాలుగు రాజ్యసభ స్థానాల్లో మూడు సీట్లను టీడీపీ, ఒక సీటును జనసేన తీసుకోవాలని ఎన్డీఏ సమావేశంలో నిర్ణయించినట్లు పేర్కొన్నారు.

మంత్రి నాదెండ్ల మనోహర్ మాట్లాడుతూ… కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అమలు చేసిన అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను ప్రజలకు చేరవేయడమే ఈ ఉమ్మడి కార్యాచరణ ప్రధాన లక్ష్యమన్నారు. ఎన్డీఏ భాగస్వామ్య పక్షాలు నిర్వహించే సభలు, కార్యక్రమాల్లో కేంద్ర మంత్రులు కూడా పాల్గొంటారని తెలిపారు. గత 24 నెలల్లో చేపట్టిన 24 ప్రధాన కార్యక్రమాలు, పథకాలపై ప్రత్యేక ప్రచారం నిర్వహిస్తామని చెప్పారు.

ఈ కార్యాచరణ ద్వారా మరోసారి ప్రజల ఆశీస్సులు పొందేందుకు ప్రయత్నిస్తామని నాదెండ్ల పేర్కొన్నారు. జనసేన రాజ్యసభ అభ్యర్థి ఎవరనేది పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ త్వ‌ర‌లోనే ప్రకటిస్తారని స్పష్టం చేశారు.

బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు మాధవ్ మాట్లాడుతూ… కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల రెండేళ్ల పాలనతో పాటు ప్రధాని నరేంద్ర మోదీ 12 ఏళ్ల పాలనలో దేశానికి, రాష్ట్రానికి జరిగిన మేలును ప్రజలకు వివరిస్తామని చెప్పారు. ఎన్డీఏ ప్రభుత్వ హయాంలో రాష్ట్రానికి వచ్చిన పరిశ్రమలు, పోలవరం ప్రాజెక్టు, అమరావతి నిర్మాణం, విశాఖ రైల్వే జోన్ వంటి అంశాలను ప్రజల్లోకి తీసుకెళ్తామని తెలిపారు.

టీడీపీ, జనసేనకు వచ్చిన రాజ్యసభ స్థానాలు బీజేపీకి వచ్చినట్లేనని పేర్కొన్న ఆయన, ఎన్డీఏ కూటమి ఐక్యతను దెబ్బతీయాలనే ప్రయత్నాలు జరుగుతున్నాయని విమర్శించారు. బీజేపీ, టీడీపీ, జనసేన కలిసి ఉంటే కొందరికి ఇబ్బందిగా మారిందని, ఎలాంటి విశ్లేషణలు వచ్చినా కూటమి పటిష్ఠంగానే కొనసాగుతుందని మాధవ్ స్పష్టం చేశారు.