వైసీపీ నాయకులు అవగాహన పెంచుకోవాలి

వైసీపీ నాయకులు అవగాహన పెంచుకోవాలి

కౌన్సిల్‌లో ఆమోదించి ఇప్పుడు అడ్డుకోవడం ఏమిటి?: ఎమ్మెల్యే గద్దె రామమోహన్‌

పటమట, ఆంధ్రప్రభ: నీటి సరఫరా వ్యవస్థపై వైఎస్సార్‌సీపీ నాయకులు అవగాహన పెంచుకుని మాట్లాడితే బాగుంటుందని తూర్పు నియోజకవర్గ ఎమ్మెల్యే గద్దె రామమోహన్‌ అన్నారు. బుధవారం తూర్పు నియోజకవర్గ పరిధిలోని 3వ డివిజన్‌ గణేష్‌నగర్‌లోని కె.ఎస్‌. గ్రాండ్‌లో ఆయన విలేకరుల సమావేశం నిర్వహించారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే గద్దె రామమోహన్‌ మాట్లాడుతూ.. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత తాగునీటి సరఫరాకు అధిక ప్రాధాన్యత ఇస్తోందని తెలిపారు. కొండ ప్రాంతాల్లో వాటర్‌ ట్యాంకులు నిర్మించి, అక్కడ నివసించే ప్రజలకు కూడా తాగునీటిని అందిస్తున్నామని చెప్పారు.

మధురానగర్‌లో వాటర్‌ ట్యాంక్‌ నిర్మాణ సమయంలోనే గంగిరెద్దుల దిబ్బ వద్ద ఉన్న ట్యాంక్‌ మెయిన్‌ పైప్‌లైన్‌ నుంచి మధురానగర్‌ ట్యాంక్‌కు నీటిని అందించాలని కౌన్సిల్‌లో నిర్ణయించారని గుర్తుచేశారు. ఆ నిర్ణయం ప్రకారమే ఏలూరు రోడ్డులోని మెయిన్‌ లైన్‌కు పైప్‌లైన్‌ను అనుసంధానిస్తున్నారని తెలిపారు. కౌన్సిల్‌లో ఆమోదించిన వైఎస్సార్‌సీపీ నాయకులు, కార్పొరేటర్లు ఇప్పుడు దాన్ని అడ్డుకోవడం ఏమిటని ప్రశ్నించారు.

ఏలూరు రోడ్డులో ప్రధాన పైప్‌లైన్‌ నిర్మాణం జరుగుతున్నప్పుడు వైఎస్సార్‌సీపీ నాయకులు ఎందుకు స్పందించలేదని ఆయన ప్రశ్నించారు. భవానీపురంలోని హెడ్‌ వాటర్‌ వర్క్స్‌ నుంచి అన్ని నియోజకవర్గాలకు నీరు సరఫరా అవుతుందని, పశ్చిమ నియోజకవర్గం నుంచి నీరు ఇవ్వమని అక్కడి వారు అంటే పరిస్థితి ఏమిటని వ్యాఖ్యానించారు.

క్రీస్తురాజపురంలో నిర్మించనున్న ట్యాంక్‌కు కూడా గంగిరెద్దుల దిబ్బ ట్యాంక్‌ నుంచే నీరు అందించనున్నట్లు తెలిపారు. నగర ప్రజలకు నిరంతరాయంగా తాగునీరు సరఫరా చేయాలనే లక్ష్యంతో ట్యాంకుల నిర్మాణం జరుగుతోందన్నారు. వైఎస్సార్‌సీపీ నాయకులు టీడీపీపై బురద జల్లే ప్రయత్నం చేస్తున్నారని విమర్శించారు.

మెయిన్‌ లైన్‌కు, కొండ ప్రాంతాలకు నీటి సరఫరా చేసే పైప్‌లైన్‌కు వేర్వేరు వ్యవస్థలు ఉంటాయని, ఈ విషయంపై కనీస అవగాహన లేకుండా వైసీపీ నాయకులు మాట్లాడుతున్నారని అన్నారు. కొండ ప్రాంత ప్రజలకు మెరుగైన నీటి సరఫరా అందించేందుకు కూటమి ప్రభుత్వం చర్యలు చేపట్టిందని చెప్పారు. నగరంలోని వాటర్‌ ట్రీట్‌మెంట్‌ ప్లాంట్‌ను అప్‌గ్రేడ్‌ చేసేందుకు కూడా తమ ప్రభుత్వం నిధులు మంజూరు చేసిందని తెలిపారు.

ప్రజలను ఇబ్బంది పెట్టే రాజకీయాలు వైఎస్సార్‌సీపీ నాయకులు చేయవద్దని, అవగాహన పెంచుకుని మాట్లాడితే మంచిదని ఎమ్మెల్యే గద్దె రామమోహన్‌ సూచించారు.

జనసేన నాయకుడు కృష్ణమోహన్‌ మాట్లాడుతూ.. కూటమి ప్రభుత్వంపై కావాలనే వైఎస్సార్‌సీపీ నాయకులు అవాస్తవాలు ప్రచారం చేస్తున్నారని విమర్శించారు. కొండ ప్రాంతాల ప్రజల దాహార్తిని తీర్చేందుకు ఎమ్మెల్యే గద్దె రామమోహన్‌ ట్యాంకుల ద్వారా నీటి సరఫరా చేశారని, అలాంటి నాయకుడిపై లేనిపోని ఆరోపణలు చేస్తే సహించబోమని అన్నారు.

ఈ కార్యక్రమంలో తాడి బాబూరావు, దాసరి గాబ్రియేల్‌, పడాల గంగాధర్‌, గద్దె రమేష్‌, పేరేపి ఈశ్వర్‌, సుగసాని రత్నశ్రీ, గుత్తికొండ కృష్ణమోహన్‌, యలమంచిలి పండు, ముత్యాల కృష్ణ, బండి సాయి కోమలి తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply