యోగా సాధనతో విద్యార్థుల సమగ్ర వికాసం

యోగా సాధనతో విద్యార్థుల సమగ్ర వికాసం

యోగా అభ్యాసంతో ఏకాగ్రత, ఆత్మవిశ్వాసం, వ్యక్తిత్వ వికాసం
ఒత్తిడిని జయించి విజయాలను సొంతం చేసుకునేందుకు యోగా ఉత్తమ మార్గం
ఘనంగా యోగాంధ్ర–2026 విద్యార్థుల థీమ్ యోగా కార్యక్రమం
జిల్లా కలెక్టర్ డా. జి.లక్ష్మీశ

భవానిపురం, ఆంధ్రప్రభ : విద్యార్థులు నిత్యం యోగా అభ్యసించడం ద్వారా ఏకాగ్రత, జ్ఞాపకశక్తి, ఆత్మవిశ్వాసం పెంపొందించుకోవచ్చని.. యోగా కేవలం శారీరక ఆరోగ్యానికే కాకుండా మానసిక ప్రశాంతత, క్రమశిక్షణ, వ్యక్తిత్వ వికాసానికి కూడా ఎంతో దోహదపడుతుందని జిల్లా కలెక్టర్ డా. జి.లక్ష్మీశ అన్నారు. యోగాంధ్ర–2026 కార్యక్రమంలో భాగంగా ఆదివారం విజయవాడ అర్బన్ పరిధిలోని బీఆర్‌టీఎస్ రోడ్డులో విద్యాశాఖ, వీఎంసీ ఆధ్వర్యంలో విద్యార్థుల థీమ్‌తో ప్రత్యేక యోగా అభ్యసన కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు.

ఈ కార్యక్రమంలో సుమారు 600 మంది విద్యార్థులు ఉత్సాహంగా పాల్గొని 45 నిమిషాల పాటు కామన్ యోగా ప్రోటోకాల్‌ను అభ్యసించారు. కార్యక్రమంలో కలెక్టర్ లక్ష్మీశ పాల్గొని విద్యార్థులతో కలిసి యోగా సాధన చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… ప్రస్తుతం విద్యార్థులు ఎదుర్కొంటున్న పోటీ ప్రపంచంలో ఒత్తిడిని అధిగమించి లక్ష్యాలను సాధించేందుకు యోగా ఒక ఉత్తమ సాధనమని పేర్కొన్నారు. విద్యార్థి దశలో యోగాను అలవాటు చేసుకుంటే ఆరోగ్యవంతమైన, బాధ్యతాయుతమైన పౌరులుగా ఎదగగలరన్నారు. ప్రస్తుత పోటీ ప్రపంచంలో విద్యార్థులు విద్యాపరమైన ఒత్తిడి, పరీక్షల ఆందోళన, సాంకేతికత ప్రభావం వంటి అనేక సవాళ్లను ఎదుర్కొంటున్నారు. ఇటువంటి పరిస్థితుల్లో యోగా సాధన విద్యార్థులకు ఎంతో ఉపయోగకరంగా ఉంటుందని.. చదువులో మెరుగైన ఫలితాలు సాధించేందుకు దోహదపడుతుందన్నారు.

అలాగే యోగా మానసిక ఒత్తిడిని తగ్గించి ప్రశాంతతను పెంపొందిస్తుందని.. క్రమశిక్షణ, ఆత్మనియంత్రణ, సానుకూల దృక్పథం వంటి లక్షణాలు అలవడటంతో పాటు శారీరకంగా దృఢంగా, మానసికంగా స్థిరంగా ఉండేందుకు తోడ్పడుతుందని పేర్కొన్నారు. పోటీ పరీక్షలలో విజయాన్ని అందుకోవడానికి అవసరమైన ఏకాగ్రత, సహనం, నిర్ణయ సామర్థ్యాలను పెంపొందించడంలో యోగా కీలక పాత్ర పోషిస్తుందని చెప్పవచ్చన్నారు. ప్రతిఒక్కరి జీవితంలో యోగాను భాగం చేయాలనే లక్ష్యంతో సుసంపన్న, ఆరోగ్య, ఆనంద ఆంధ్ర సాకారానికి యోగాంధ్ర కార్యక్రమాలను ప్రభుత్వం రాష్ట్రవ్యాప్తంగా నిర్వహిస్తున్నట్లు తెలిపారు.

ఇందులో భాగంగా జిల్లాలో పర్యాటక ప్రాంతాలు, ప్రభుత్వ కార్యాలయాలు, ఆసుపత్రులు, ఆలయాలు, పార్కులు, గ్రామాలు, వార్డులు, విద్యాసంస్థలు, ప్రజా ప్రదేశాల్లో నిరంతర యోగా కార్యక్రమాలు నిర్వహిస్తూ అన్ని వర్గాల ప్రజల్లో యోగా పట్ల అవగాహన కల్పిస్తున్నామని చెప్పారు. యోగాంధ్ర ద్వారా ఆరోగ్యవంతమైన సమాజ నిర్మాణమే లక్ష్యమని, ప్రతి ఒక్కరూ యోగాన్ని తమ దైనందిన జీవితంలో భాగం చేసుకోవాలని పిలుపునిచ్చారు.

డీఈవో చంద్రకళ మాట్లాడుతూ యోగా వల్ల ఉపాధ్యాయులు, విద్యార్థుల ఆరోగ్యం మరింత మెరుగవుతుందనీ, ఒత్తిడి తగ్గి ఏకాగ్రత పెరుగుతుందనీ, రోగనిరోధక శక్తి పెరిగి మానసిక ఆరోగ్యానికి తోడ్పడుతుందనీ తెలియజేశారు, యోగాను ప్రతి ఒక్కరు జీవనశైలి లో ఒక భాగంగా చేసుకోవాలని చెప్పారు.

కార్యక్రమంలో జిల్లా అడిషనల్ ప్రాజెక్ట్ కోఆర్డినేటర్ ఆర్. రమేష్ బాబు, విజయవాడ డీవైఈవో డి.సాంబశివరావు, జిల్లా ఆయుష్ అధికారి డా. వై.రత్న ప్రియదర్శిని, యువజన సంక్షేమ అధికారి డాక్టర్ కొల్లేటి రమేష్, సమగ్ర శిక్ష సెక్టోరియల్ అధికారులు, విజయవాడ అర్బన్ ,రూరల్ మండల విద్యాశాఖ అధికారులు, ఫిజికల్ డైరెక్టర్లు, మున్సిపల్ ఉపాధ్యాయులు, ఎన్సీసీ బృందం, వివిధ మునిసిపల్ పాఠశాలలు, జిల్లా పరిషత్ పాఠశాలలు, ప్రైవేట్ పాఠశాల విద్యార్థులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

Leave a Reply