గ్రామీణ విద్యార్థులకు సైకిళ్ల పంపిణీ

గ్రామీణ విద్యార్థులకు సైకిళ్ల పంపిణీ

నాగర్‌కర్నూల్ జిల్లా ప్రతినిధి, ఆంధ్రప్రభ:
గ్రామీణ ప్రాంత విద్యార్థుల విద్యాభివృద్ధి, రవాణా సమస్యల పరిష్కారం లక్ష్యంగా నాగర్‌కర్నూల్ పార్లమెంట్ సభ్యుడు డాక్టర్ మల్లు రవి ప్రత్యేక చొరవ తీసుకున్నారు. సోమవారం నాగర్‌కర్నూల్ ఐడీఓసీ కార్యాలయ ఆవరణలో 80 మంది ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు సైకిళ్లు పంపిణీ చేశారు.

జిందాల్ స్టీల్ పవర్ సంస్థ సౌజన్యంతో సీఎస్‌ఆర్ నిధుల ద్వారా ఈ కార్యక్రమం నిర్వహించారు. నాగర్‌కర్నూల్ నియోజకవర్గంలోని వివిధ గ్రామాల నుంచి నాగర్‌కర్నూల్ ప్రభుత్వ పాఠశాలలో 8వ తరగతి చదువుతున్న 74 మంది విద్యార్థులు, నార్లాపూర్ పాఠశాలకు చెందిన 6 మంది విద్యార్థులకు సైకిళ్లు అందజేశారు.

ఈ కార్యక్రమాన్ని అచ్చంపేట ఎమ్మెల్యే డాక్టర్ వంశీకృష్ణ, నాగర్‌కర్నూల్ ఎమ్మెల్యే డాక్టర్ కూచుకుళ్ళ రాజేష్ రెడ్డి, జిల్లా అటవీశాఖ అధికారి రేవంత్ చంద్ర, అదనపు కలెక్టర్ అమరేందర్, డీఈఓ రమేష్ కుమార్‌లతో కలిసి ఎంపీ మల్లు రవి ప్రారంభించారు.

ఈ సందర్భంగా ఎంపీ మల్లు రవి మాట్లాడుతూ, తన విద్యార్థి దశలో పేదరికం కారణంగా ప్రతిరోజూ ఐదు కిలోమీటర్లు నడుచుకుంటూ పాఠశాలకు వెళ్లిన రోజులను గుర్తు చేసుకున్నారు. ప్రస్తుతం విద్యార్థులు అలాంటి ఇబ్బందులు ఎదుర్కోకూడదనే ఉద్దేశంతో సీఎస్‌ఆర్ నిధుల ద్వారా సైకిళ్ల పంపిణీ కార్యక్రమాన్ని చేపట్టినట్లు తెలిపారు.

గ్రామీణ ప్రాంతాల్లో విద్యార్థులు ఎదుర్కొనే ప్రధాన సమస్యల్లో రవాణా ఒకటని అన్నారు. సైకిళ్లు అందించడం ద్వారా విద్యార్థులు సమయానికి పాఠశాలకు చేరుకోవడంతో పాటు చదువుపై మరింత దృష్టి సారించగలరని పేర్కొన్నారు.

ఈ విద్యా సంవత్సరంలో పదో తరగతి ఫలితాల్లో జిల్లా విద్యార్థులు రాష్ట్రస్థాయిలో ఉత్తమ ప్రతిభ కనబర్చారని ఎంపీ మల్లు రవి అభినందించారు. ఇందుకు కృషి చేసిన విద్యార్థులు, ఉపాధ్యాయులు, అధికారులను ప్రశంసించారు.

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలో రాష్ట్ర ప్రభుత్వం విద్యారంగానికి అధిక ప్రాధాన్యత ఇస్తోందని చెప్పారు. వచ్చే విద్యా సంవత్సరం నుంచి అంగన్‌వాడీ నుంచి ఇంటర్మీడియట్ వరకు విద్యార్థులకు మధ్యాహ్న భోజనంతో పాటు అల్పాహారం అందించే దిశగా చర్యలు తీసుకుంటున్నట్లు వెల్లడించారు.

జిందాల్ స్టీల్ పవర్ సంస్థ సీఎస్‌ఆర్ కార్యక్రమాల ద్వారా సమాజానికి అందిస్తున్న సేవలు ప్రశంసనీయమని ఎంపీ పేర్కొన్నారు. భవిష్యత్తులో కూడా ఇలాంటి కార్యక్రమాలను మరింత విస్తరించాలని కోరారు. ప్రభుత్వ పాఠశాలల్లో చదివే పేద విద్యార్థులకు త్వరలో షూల పంపిణీ కార్యక్రమాన్ని కూడా చేపట్టనున్నట్లు తెలిపారు.

అచ్చంపేట ఎమ్మెల్యే డాక్టర్ వంశీకృష్ణ మాట్లాడుతూ, అభివృద్ధి చెందిన దేశాల్లో సైకిళ్ల వినియోగం అధికంగా ఉంటుందని అన్నారు. ప్రతిరోజూ సైకిల్ తొక్కడం వల్ల ఆరోగ్యంతో పాటు సమయపాలన అలవడుతుందని తెలిపారు. విద్యార్థులకు శారీరక, మానసిక దృఢత్వం పెంపొందించడంలో సైకిళ్లు ఉపయోగపడతాయని చెప్పారు.

రాష్ట్ర ప్రభుత్వం రూ.24 వేల కోట్లతో ఇంటిగ్రేటెడ్ పాఠశాలలను ఏర్పాటు చేసి ప్రభుత్వ విద్యను బలోపేతం చేస్తోందని వంశీకృష్ణ పేర్కొన్నారు. అచ్చంపేట నియోజకవర్గ పరిధిలోని ప్రభుత్వ పాఠశాలల్లో చదివే 1,000 మంది విద్యార్థులకు సైకిళ్లు పంపిణీ చేసేలా చర్యలు తీసుకోవాలని ఎంపీ మల్లు రవిని కోరారు.

నాగర్‌కర్నూల్ ఎమ్మెల్యే డాక్టర్ కూచుకుళ్ళ రాజేష్ రెడ్డి మాట్లాడుతూ, గ్రామీణ విద్యార్థుల చదువుకు ఈ కార్యక్రమం ఎంతో ఉపయోగపడుతుందని అన్నారు. సైకిళ్ల ద్వారా వారు సులభంగా పాఠశాలకు చేరుకుని, విద్యాభ్యాసాన్ని అంతరాయం లేకుండా కొనసాగించగలరని తెలిపారు.

విద్యార్థుల హాజరు శాతం పెరగడంతో పాటు చదువులో మెరుగైన ఫలితాలు సాధించేందుకు ఈ కార్యక్రమం దోహదపడుతుందని రాజేష్ రెడ్డి పేర్కొన్నారు.

సైకిళ్లు అందుకున్న విద్యార్థులు, వారి తల్లిదండ్రులు ఆనందం వ్యక్తం చేశారు. ఎంపీ మల్లు రవి, జిందాల్ స్టీల్ పవర్ సంస్థ ప్రతినిధులకు కృతజ్ఞతలు తెలిపారు. సైకిళ్లు తమ విద్యాభ్యాసానికి ఎంతో ఉపయోగపడతాయని, మరింత కష్టపడి చదివి మంచి ఫలితాలు సాధిస్తామని విద్యార్థులు హైమావతి, ఐశ్వర్య, సాదిక్ తెలిపారు.

ఈ కార్యక్రమంలో డీఈఓ రమేష్ కుమార్, కౌన్సిలర్ చంద్రకళ, జిందాల్ సంస్థ ప్రతినిధి రెడ్డి నాయక్, జిల్లా విద్యాశాఖ అధికారులు నాగేశ్వరరావు, వెంకటేశ్వర్లు శెట్టి, ప్రధానోపాధ్యాయులు రాంజీ, మధుసూదన్ రెడ్డి, స్థానిక ప్రజాప్రతినిధులు, అధికారులు పాల్గొన్నారు.