డీలిమిటేషన్, మహిళా రిజర్వేషన్ల అనిశ్చితి

నాగర్‌కర్నూల్ జిల్లా ప్రతినిధి, ఆంధ్రప్రభ : దేశవ్యాప్తంగా డీలిమిటేషన్, మహిళా రిజర్వేషన్ల అమలు అంశాలపై కొనసాగుతున్న చర్చల నేపథ్యంలో ఇటీవల పార్లమెంట్‌లో ఈ బిల్లులు ఆమోదం పొందకపోవడంతో అసెంబ్లీ స్థానాల పెంపుదలపై అనిశ్చితి నెలకొంది. మహిళా రిజర్వేషన్లు కూడా అమలు కాకపోవడంతో వివిధ నియోజకవర్గాల్లో పోటీ చేయాలని ఆశించిన కొత్త ఆశావాహుల్లో నిరాశ వ్యక్తమవుతోంది.

ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాలో ప్రస్తుతం 14 అసెంబ్లీ నియోజకవర్గాలు, రెండు పార్లమెంట్ స్థానాలు ఉన్నాయి. జనాభా ప్రాతిపదికన నియోజకవర్గాల పెంపు జరిగితే అసెంబ్లీ స్థానాలు 21కు పెరిగే అవకాశముందని, అలాగే పార్లమెంట్ స్థానాలు కూడా పెరిగే అవకాశముందని గతంలో అంచనాలు వినిపించాయి. అయితే మహిళలకు 33 శాతం రిజర్వేషన్ అమలు చేస్తే పెరిగే స్థానాల్లో చాలా వరకు మహిళలకు కేటాయించాల్సి ఉంటుందని రాజకీయ వర్గాలు భావిస్తున్నాయి.

ఈ నేపథ్యంలో అన్ని రాజకీయ పార్టీలు మహిళా అభ్యర్థులను ప్రోత్సహించేందుకు, తమ కుటుంబ సభ్యులను కూడా రాజకీయాల్లోకి తీసుకురావాలనే ఆలోచనలో ఉన్నట్లు సమాచారం. ఇప్పటికే రాజకీయాల్లో ఉన్న మహిళా నాయకులు కూడా అసెంబ్లీ పోటీకి సిద్ధమవుతున్నారని తెలుస్తోంది.

రిజర్వేషన్లు, నియోజకవర్గాల మార్పులు ఎలా ఉంటాయన్న దానిపై స్పష్టత లేకపోవడంతో రాజకీయ పార్టీల్లో సమాలోచనలు కొనసాగుతున్నాయి. అసెంబ్లీ స్థానాల పెంపు జరిగితే కొత్త అభ్యర్థులకు అవకాశాలు లభిస్తాయని, అలాగే కుల సమీకరణాలు, ఆర్థిక సామర్థ్యాలు వంటి అంశాల ఆధారంగా కొత్త నాయకులు రాజకీయాల్లోకి వచ్చే అవకాశముందని చర్చ జరుగుతోంది.

నాగర్‌కర్నూల్ పార్లమెంట్ పరిధిలో కొత్తకోట, పెబ్బేరు, బిజినపల్లి, పెద్దకొత్తపల్లి, ఆమనగల్లు వంటి ప్రాంతాలు భవిష్యత్తులో అసెంబ్లీ నియోజకవర్గాలుగా మారే అవకాశమున్నట్లు ప్రచారం జరుగుతోంది. దీంతో ఆయా ప్రాంతాల నాయకులు కూడా ముందుగానే ఎమ్మెల్యే అభ్యర్థిత్వానికి సిద్ధమవుతున్నారు.

ఇక 2028లో కాకుండా 2029లో అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికలు ఒకేసారి జరిగే అవకాశమున్నట్లు కూడా రాజకీయ వర్గాల్లో చర్చ నడుస్తోంది. ఈ నేపథ్యంలో రాజకీయ సమీకరణాలు మారే అవకాశం ఉందని భావిస్తున్నారు.

డీలిమిటేషన్ ప్రక్రియ తక్షణం అమలు అయ్యే పరిస్థితి లేకపోవడంతో ఆశావాహులు నిరాశ చెందినప్పటికీ, ప్రజల్లోనే ఉండి పార్టీ కార్యక్రమాలు, ప్రజా సమస్యలపై పోరాటాలు కొనసాగించాలని భావిస్తున్నారు. అదే సమయంలో ప్రస్తుత ఎమ్మెల్యేలు, ఎంపీలు అభివృద్ధి కార్యక్రమాలను వేగవంతం చేసి రాబోయే ఎన్నికలకు సిద్ధమవుతున్నట్లు సమాచారం.

డీలిమిటేషన్, మహిళా రిజర్వేషన్ బిల్లులు మళ్లీ ఎప్పుడు ముందుకు వస్తాయన్న దానిపై ఇంకా స్పష్టత లేకపోవడంతో రాజకీయ వర్గాల్లో ఆసక్తికర చర్చలు కొనసాగుతున్నాయి.