ప్రజా సమస్యలకు నెల రోజుల్లో పరిష్కారం చూపాలి

ప్రజా సమస్యలకు నెల రోజుల్లో పరిష్కారం చూపాలి

తొర్రూరు, ఆంధ్రప్రభ:
ప్రజా సమస్యల సత్వర పరిష్కారం కోసమే ప్రజావాణి కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు తొర్రూరు ఆర్డీవో గణేష్ తెలిపారు. డివిజన్ కేంద్రంలోని ఆర్డీవో కార్యాలయంలో సోమవారం ప్రజావాణి కార్యక్రమం నిర్వహించారు.

రెవెన్యూ డివిజన్ కార్యాలయంలో నిర్వహించిన ప్రజావాణిలో స్థానికుల నుంచి మొత్తం 21 దరఖాస్తులు అందాయి. వాటిలో 14 దరఖాస్తులు రెవెన్యూ శాఖకు, 4 పంచాయతీరాజ్ శాఖకు, 1 కార్మిక శాఖకు, 2 పురపాలక శాఖకు సంబంధించినవిగా అధికారులు తెలిపారు.

వచ్చిన దరఖాస్తుల్లో భూ సంబంధిత సమస్యలు, వ్యక్తిగత సమస్యలే ఎక్కువగా ఉన్నట్లు పేర్కొన్నారు. తొర్రూరు, పెద్దవంగర, నెల్లికుదురు, దంతాలపల్లి, మరిపెడ, చిన్నగూడూరు, నరసింహులపేట మండలాలకు సంబంధించిన ప్రజా సమస్యల పరిష్కారం కోసం ప్రతి సోమవారం ప్రజావాణి నిర్వహించాలని అధికారులు నిర్ణయించారు.

ఈ సందర్భంగా ఆర్డీవో గణేష్ మాట్లాడుతూ, గ్రీవెన్స్ దరఖాస్తులను పరిష్కరించడంలో వివిధ శాఖల అధికారులు బాధ్యతాయుతంగా పనిచేయాలని సూచించారు. ప్రతి వారం వచ్చే వినతులను ఎప్పటికప్పుడు ప్రాధాన్యత క్రమంలో పరిశీలించి, ప్రజల సమస్యలను పరిష్కరించాలని అన్నారు.

క్షేత్రస్థాయిలో అర్జీదారుల సమస్యలు పరిష్కారం అయ్యేలా చూడాలని అధికారులకు సూచించారు. పరిష్కరించలేని సమస్యలు ఉంటే దరఖాస్తుదారులకు సమాచారం అందించాలని చెప్పారు. ప్రజావాణిలో వచ్చిన దరఖాస్తులకు నెల రోజుల్లో పరిష్కారం చూపాలని ఆదేశించారు.

ప్రజావాణి కార్యక్రమానికి అన్ని శాఖల అధికారులు తప్పనిసరిగా హాజరు కావాలని ఆర్డీవో గణేష్ స్పష్టం చేశారు.

విధుల్లోకి తీసుకోవడం లేదని ఫిర్యాదు

తొర్రూరు పట్టణంలోని అంబేద్కర్ నగర్‌కు చెందిన మంగళపల్లి ప్రసాద్ ప్రజావాణిలో ఆర్డీవో గణేష్‌కు ఫిర్యాదు చేశారు. తాను 2015 నుంచి స్థానిక మున్సిపాలిటీలో ఔట్‌సోర్సింగ్ ప్రాతిపదికన కార్మికునిగా పనిచేస్తున్నట్లు తెలిపారు.

తన తండ్రి వృద్ధాప్యంలో ఉండటంతో తాను ఆ పనిని కొనసాగించానని, ఇటీవల తన తండ్రి మరణించినట్లు చెప్పారు. తండ్రి మరణం తర్వాత కుటుంబ తగాదాలను ఆసరాగా చేసుకుని మున్సిపల్ కమిషనర్ ఉద్దేశపూర్వకంగా తనను విధుల్లోకి రాకుండా అడ్డుకుంటున్నారని ప్రసాద్ ఆవేదన వ్యక్తం చేశారు.

2025 జూన్, జూలై నెలల్లో తాను పనిచేసిన వేతనాలను కూడా నిలిపివేశారని ఫిర్యాదులో పేర్కొన్నారు. తన తల్లిని మున్సిపాలిటీ కార్యాలయానికి పిలిచి మాట్లాడినప్పటికీ సమస్యను పరిష్కరించకుండా, తనను విధుల్లోకి రాకుండా అడ్డుకుంటున్న కమిషనర్‌పై చర్యలు తీసుకోవాలని ఆర్డీవోను కోరారు.

ఈ కార్యక్రమంలో డీఎల్పీవో పుల్లారావు, డిప్యూటీ డీఎంహెచ్‌వో సుధీర్ రెడ్డి, లేబర్ ఆఫీసర్ రవి, ఏడీఏ విజయ్ చంద్ర, ఏటీడబ్ల్యూవో ఉపేందర్, డిప్యూటీ ఈఈ రంజిత్ నాయక్, ఐసీడీఎస్ విజయలక్ష్మి, మిషన్ భగీరథ డిప్యూటీ ఈఈ మోహన్, ఏవో రాంనర్సయ్య, పలు శాఖల అధికారులు పాల్గొన్నారు.