నిషేధిత పొగాకు ఉత్పత్తులపై పోలీసుల దాడి..
వడ్డేపల్లి, ఆంధ్రప్రభ : వరంగల్ పోలీస్ కమిషనర్ ఆదేశాల మేరకు సుబేదారి పోలీస్ స్టేషన్ పరిధిలో నిషేధిత పొగాకు ఉత్పత్తుల విక్రయాలపై ప్రత్యేక తనిఖీలు నిర్వహించారు.
సోమవారం బాలసముద్రం ప్రాంతంలోని ఏకశిలా పార్క్ వెనుక ఉన్న ఆకుల శ్రీనివాస్‌కు చెందిన కిరాణా దుకాణంలో పోలీసులు తనిఖీలు చేపట్టారు. ఈ తనిఖీల్లో సుమారు రూ.23,000 విలువైన నిషేధిత అంబర్ ప్యాకెట్లు, గుట్కా ప్యాకెట్లు అక్రమంగా నిల్వ చేసి విక్రయిస్తున్నట్లు గుర్తించారు.
వెంటనే వాటిని స్వాధీనం చేసుకుని సంబంధిత వ్యక్తిపై కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు. సుబేదారి పోలీస్ స్టేషన్ ఇన్‌స్పెక్టర్ ఎం. రంజిత్ కుమార్ మాట్లాడుతూ, ప్రజల ఆరోగ్యానికి హానికరమైన, ప్రభుత్వ నిషేధిత గుట్కా, అంబర్ వంటి పొగాకు ఉత్పత్తుల నిల్వ, విక్రయం, రవాణాపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. అక్రమ కార్యకలాపాలపై ప్రజలు సమాచారం అందించాలని ఆయన కోరారు. ఈ తనిఖీల్లో ఎస్‌ఐ పాణి, కానిస్టేబుల్ సత్యనారాయణ పాల్గొన్నారు.
