ఎస్‌ఐఆర్ ఆన్‌లైన్ నమోదు సమర్థవంతంగా చేపట్టాలి

ఊట్కూర్, ఆంధ్రప్రభ: రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ (ఎస్‌ఐఆర్) కార్యక్రమంలో భాగంగా ఓటరు జాబితా ఆన్‌లైన్ నమోదు ప్రక్రియను బీఎల్‌వోలు సమర్థవంతంగా నిర్వహించాలని ఊట్కూర్ తహసీల్దార్ అశోక్ కుమార్ ఆదేశించారు. గురువారం నారాయణపేట జిల్లా ఊట్కూర్ మండల కేంద్రంలో ఎస్‌ఐఆర్ నమోదు ప్రక్రియను ఆయన పరిశీలించి బీఎల్‌వోలకు పలు సూచనలు చేశారు. అర్హత కలిగిన ప్రతి పౌరుడికి ఓటు హక్కు కల్పించడమే ఈ కార్యక్రమం ప్రధాన ఉద్దేశమని పేర్కొన్నారు.

బీఎల్‌వోలు ఇంటింటికీ వెళ్లి ఓటర్ల వివరాలను క్షుణ్ణంగా పరిశీలించి కొత్తగా అర్హులైన వారి పేర్లను నమోదు చేయడంతో పాటు మరణించినవారు, శాశ్వతంగా ఇతర ప్రాంతాలకు వెళ్లిన వారి వివరాలను నిబంధనల ప్రకారం సవరించాలని సూచించారు. ఆన్‌లైన్ నమోదు సమయంలో సాంకేతిక లోపాలు తలెత్తకుండా జాగ్రత్తలు తీసుకోవడంతో పాటు ప్రతి దరఖాస్తును పూర్తిస్థాయిలో పరిశీలించిన తర్వాతే అప్‌లోడ్ చేయాలని తెలిపారు. ప్రభుత్వ నిర్దేశించిన గడువులోపు నమోదు ప్రక్రియ పూర్తి చేసి, తప్పులు లేని ఓటరు జాబితా రూపొందించేందుకు ప్రతి బీఎల్‌వో బాధ్యతాయుతంగా పనిచేయాలని సూచించారు. కార్యక్రమంలో ఆర్ఐ కృష్ణారెడ్డి, మండల కాంగ్రెస్ అధ్యక్షులు యగ్నేశ్వర్ రెడ్డి, మండల మైనార్టీ అధ్యక్షులు జలాల్, నాయకులు కొక్కు శంకర్, రవికుమార్ తదితరులు పాల్గొన్నారు.