ఏడుగురిపై దాడి..
ఇద్దరికి తీవ్ర గాయాలు..
చర్యలు తీసుకోవాలని ప్రజల డిమాండ్
మక్తల్, ఆంధ్రప్రభ: నారాయణపేట జిల్లా మక్తల్ పట్టణంలో వీధి కుక్కల సమస్య రోజురోజుకూ తీవ్రంగా మారుతోంది. ప్రధాన రహదారులతో పాటు పలు కాలనీల్లో పదుల సంఖ్యలో వీధి కుక్కలు స్వైర విహారం చేస్తున్నప్పటికీ మున్సిపల్ అధికారులు తగిన చర్యలు తీసుకోకపోవడంతో ప్రజలు భయాందోళనలకు గురవుతున్నారు.
బుధవారం మక్తల్ మున్సిపాలిటీ పరిధిలోని 16వ వార్డు అనపల్లి వీధిలో మహేశ్వరి అనే మహిళపై వీధి కుక్క దాడి చేసి తీవ్రంగా గాయపరిచింది. ఆ సమయంలో ఆమెతో పాటు చిన్నారులు ఉండగా, వారిని ముందుగా సురక్షితంగా పక్కకు పంపించిన అనంతరం కుక్క ఆమెపై దాడి చేసినట్లు స్థానికులు తెలిపారు. లేకపోతే చిన్నారులు కూడా ప్రమాదానికి గురయ్యేవారని పేర్కొన్నారు.
కుక్క కాటుకు గురైన మహేశ్వరిని నారాయణపేట జిల్లా ఆస్పత్రికి తరలించగా, వైద్యులు ఆమెను మూడు రోజులపాటు ఆస్పత్రిలో ఉండాలని సూచించినట్లు సమాచారం.
మహేశ్వరిపై దాడి చేసిన అదే కుక్క అనంతరం పతంజలి దుకాణానికి చెందిన బాల్రాజ్పై కూడా దాడి చేసింది. ఆయన చేతి, కాలుపై మూడు చోట్ల కుక్క కరవడంతో చికిత్స కోసం నారాయణపేట జిల్లా ఆస్పత్రికి తరలించారు.
ప్రస్తుతం అందిన సమాచారం ప్రకారం మక్తల్ మున్సిపాలిటీ పరిధిలో ఏడుగురికి పైగా వీధి కుక్కల దాడికి గురైనట్లు తెలిసింది. ఈ ఘటనతో పట్టణ ప్రజలు తీవ్ర భయాందోళనలకు గురవుతున్నారు.
గత ఏడాది నుంచి పలుమార్లు వీధి కుక్కల సమస్యను మున్సిపల్ అధికారుల దృష్టికి తీసుకెళ్లినా శాశ్వత పరిష్కారం లభించలేదని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం ఉన్న మున్సిపల్ కమిషనర్, చైర్మన్ వెంటనే స్పందించి ప్రజల భద్రతకు చర్యలు చేపట్టాలని వారు కోరుతున్నారు.
ఈ ఘటనపై స్థానికులు మున్సిపల్ కమిషనర్ రాజయ్యకు ఫోన్ ద్వారా సమాచారం అందించారు. సమస్యపై స్పందించిన కమిషనర్ రాజయ్య, వీధి కుక్కల సమస్యను రానున్న మున్సిపల్ కౌన్సిల్ సమావేశంలో చర్చించి అవసరమైన చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చినట్లు తెలిపారు.
అయితే కుక్కల సమస్య రోజురోజుకూ పెరుగుతున్నప్పటికీ వాటిని పట్టుకుని పట్టణం వెలుపలకు తరలించేందుకు మున్సిపల్ యంత్రాంగం సమర్థవంతమైన చర్యలు చేపట్టడం లేదని స్థానికులు ఆరోపిస్తున్నారు. గతంలో కూడా ఇలాంటి ఘటనలు జరిగినప్పటికీ నామమాత్రపు చర్యలకే పరిమితమయ్యారని విమర్శిస్తున్నారు. ప్రస్తుతం పట్టణంలోని ప్రధాన రహదారుల వెంట వందకు పైగా వీధి కుక్కలు సంచరిస్తున్నాయని స్థానికులు చెబుతున్నారు.
కౌన్సిల్లో చర్చించి చర్యలు తీసుకుంటాం: మున్సిపల్ కమిషనర్
వీధి కుక్కల దాడిలో ఏడుగురు గాయపడిన ఘటనపై మున్సిపల్ కమిషనర్ రాజయ్యను ఆంధ్రప్రభ ప్రతినిధి వివరణ కోరగా, కుక్కల సమస్యను ఆగస్టులో జరగనున్న మున్సిపల్ కౌన్సిల్ సమావేశంలో చర్చించి తదుపరి చర్యలు తీసుకుంటామని తెలిపారు. ప్రజల భద్రతకు తక్షణ చర్యలు అవసరమని ప్రశ్నించగా, కౌన్సిల్లో చర్చించిన తర్వాతే నిర్ణయం తీసుకోగలమని సమాధానమిచ్చారు.
