Thorrur 25 క్వింటాళ్ల నల్ల బెల్లం పట్టివేత

Thorrur 25 క్వింటాళ్ల నల్ల బెల్లం పట్టివేత

  • 200 కిలోల పటిక, 20 లీటర్ల గుడుంబా స్వాధీనం

తొర్రూరు (Thorrur), ఆంధ్రప్రభ: గుడుంబా తయారీకి వినియోగించే నిషేధిత నల్లబెల్లం అక్రమంగా తరలిస్తుండగా ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంట్ పోలీసులు పట్టుకున్నారు. ఈ ఘటనపై వివరాలను ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంట్ సీఐ కే. నాగయ్య ఆదివారం తొర్రూరు డివిజన్ కేంద్రంలోని ఎక్సైజ్ పోలీస్ స్టేషన్‌లో వెల్లడించారు.

విశ్వసనీయ సమాచారం మేరకు పెద్ద వంగర మండలం చిన్న వంగర గ్రామ శివారులో ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంట్ పోలీసులు వాహన తనిఖీలు చేపట్టారు. ఈ క్రమంలో అనుమానాస్పదంగా కనిపించిన ట్రాలీ వాహనాన్ని ఆపి తనిఖీ చేయగా పెద్ద మొత్తంలో నిషేధిత పదార్థాలు లభ్యమయ్యాయి.

వాహనంలో 50 సంచుల్లో 25 క్వింటాళ్ల (2500 కిలోలు) నల్ల బెల్లం, 4 సంచుల్లో 200 కిలోల పటిక, అలాగే 20 లీటర్ల నాటు సారా స్వాధీనం చేసుకున్నారు. రవాణాకు వినియోగించిన ట్రాలీని పోలీసులు సీజ్ చేశారు.

ఈ కేసులో మరిపెడ మండలం దాస్య తండాకు చెందిన ట్రాలీ డ్రైవర్ గుగులోతు ప్రవీణ్‌ను అదుపులోకి తీసుకున్నారు. ఈ రవాణాకు సంబంధం ఉన్న మరో వ్యక్తి పరారీలో ఉన్నట్లు అధికారులు తెలిపారు. ఇద్దరిపై కేసు నమోదు చేసినట్లు వెల్లడించారు.

ఈ సందర్భంగా సీఐ నాగయ్య మాట్లాడుతూ గుడుంబా తయారీకి ఉపయోగించే బెల్లం, ముడి పదార్థాల క్రయవిక్రయాలు, రవాణాపై కఠిన చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. గుడుంబా కేసుల్లో పట్టుబడితే పీడీ యాక్టు నమోదు చేస్తామని, సంక్షేమ పథకాలు రాకుండా చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. జరిమానాతో పాటు జైలు శిక్ష తప్పదని స్పష్టం చేశారు. గుడుంబా నిర్మూలన లక్ష్యంగా ప్రజలంతా సహకరించాలని ఆయన కోరారు.

ఈ దాడుల్లో ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంట్ ఎస్సై ఎన్. రజిత, సిబ్బంది శ్రీనివాస్ కుమార్, శరత్, బాబు తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply