దోమలపై యుద్ధం మొదలు..

మలేరియా రహిత సమాజమే లక్ష్యం: డాక్టర్ రమ్య

శావల్యాపురం, ఆంధ్రప్రభ: మలేరియా రహిత సమాజ నిర్మాణమే ప్రభుత్వ లక్ష్యమని మండల వైద్యాధికారిణి డాక్టర్ రావిపూడి రమ్య పేర్కొన్నారు.

ప్రపంచ మలేరియా నివారణ మాసోత్సవాల సందర్భంగా మండల కేంద్రం శావల్యాపురంలో సోమవారం డాక్టర్ రావిపూడి రమ్య ఆధ్వర్యంలో వైద్య సిబ్బందితో కలిసి అవగాహన ర్యాలీ నిర్వహించారు. ప్రభుత్వ ఆసుపత్రి నుంచి ప్రారంభమైన ఈ ర్యాలీ గ్రామంలోని ప్రధాన వీధుల గుండా సాగుతూ ప్రజలకు మలేరియా వ్యాధిపై అవగాహన కల్పించింది.

ఈ సందర్భంగా డాక్టర్ రమ్య మాట్లాడుతూ, వర్షాకాలం ప్రారంభమైన నేపథ్యంలో ప్రజలను అప్రమత్తం చేయడం, దోమల నియంత్రణ చర్యలను ప్రోత్సహించడం, మలేరియాపై అవగాహన పెంచడం లక్ష్యంగా జూన్ 1 నుంచి 30వ తేదీ వరకు మలేరియా నివారణ మాసోత్సవాలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు.

డ్రైనేజీలు, పరిసర ప్రాంతాల్లో నీరు నిల్వ ఉండకుండా చూసుకోవాలని సూచించారు. మురుగునీరు నిల్వ ఉండటం వల్ల దోమలు వేగంగా వ్యాప్తి చెంది మలేరియా వ్యాధికి కారణమవుతాయని హెచ్చరించారు. దోమకాటు ద్వారా మలేరియా ఒకరి నుంచి మరొకరికి వ్యాపిస్తుందని, ప్రతి ఒక్కరూ దోమతెరలు వినియోగించాలని సూచించారు.

జ్వరం, వాంతులు, చలి, తలనొప్పి, రోజు విడిచి రోజు జ్వరం రావడం వంటి లక్షణాలు కనిపిస్తే నిర్లక్ష్యం చేయకుండా వెంటనే వైద్యులను సంప్రదించాలని తెలిపారు. వ్యాధిని అశ్రద్ధ చేస్తే మెదడుకు వ్యాపించి ప్రాణాపాయం కలిగే ప్రమాదం ఉందని హెచ్చరించారు.

ప్రభుత్వ ఆసుపత్రుల్లో మలేరియా పరీక్షలు ఉచితంగా నిర్వహించడంతో పాటు అవసరమైన మందులను కూడా అందిస్తున్నట్లు డాక్టర్ రమ్య వెల్లడించారు.

ఈ కార్యక్రమంలో సూపర్వైజర్లు ఏడుకొండలు, నారాయణమ్మ, ఉమాదేవి, ల్యాబ్ టెక్నీషియన్ సతీష్, ఫార్మసిస్ట్ లక్ష్మీనారాయణ, ప్రమీల తదితర వైద్య సిబ్బంది పాల్గొన్నారు.

Leave a Reply