పొగాకు అలవాట్లకు దూరంగా ఉండాలి
పొగాకు అలవాట్లకు దూరంగా ఉండాలి
-డాక్టర్ కొప్పుల రాజశేఖర్ రెడ్డి
వికారాబాద్, ఆంధ్రప్రభ:
వరల్డ్ నో టొబాకో డే సందర్భంగా హైదరాబాద్‌లోని గోల్కొండ హోటల్‌లో IDEC 2026 (Indian Dental Expert Congress) ఆధ్వర్యంలో ప్రత్యేక కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భారతీయ జనతా పార్టీ తెలంగాణ రాష్ట్ర మెడికల్ సెల్ కన్వీనర్, ప్రముఖ జనరల్, లాపరోస్కోపిక్ సర్జన్ డాక్టర్ కొప్పుల రాజశేఖర్ రెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు.
ఈ సందర్భంగా దేశంలోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన ప్రముఖ వైద్యులు, దంత వైద్య నిపుణులు, ఆరోగ్య రంగ ప్రతినిధులతో కలిసి డాక్టర్ కొప్పుల రాజశేఖర్ రెడ్డి “వరల్డ్ నో టొబాకో డే” పోస్టర్‌ను ఆవిష్కరించారు.
ఈ కార్యక్రమానికి ఆహ్వానించిన ఇండియన్ డెంటల్ అసోసియేషన్ దక్కన్ బ్రాంచ్ రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ సూర్య ప్రసన్న, డాక్టర్ నిరంజన్ రెడ్డి, డాక్టర్ కరుణాకర్, వారి రాష్ట్ర కమిటీకి డాక్టర్ రాజశేఖర్ రెడ్డి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.
అనంతరం నిర్వహించిన సమావేశంలో వైద్య రంగ అభివృద్ధి, ఆధునిక చికిత్సా విధానాలు, నూతన సాంకేతిక పరిజ్ఞానం వినియోగం, ప్రజారోగ్య సేవల విస్తరణ, రోగులకు నాణ్యమైన వైద్య సేవలు అందించే మార్గాలపై చర్చించారు. దేశంలోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన వైద్య నిపుణులతో అభిప్రాయాలు పంచుకోవడం ద్వారా విలువైన అనుభవాలు, కొత్త విషయాలు తెలుసుకునే అవకాశం లభించిందని డాక్టర్ రాజశేఖర్ రెడ్డి పేర్కొన్నారు.
ప్రపంచ పొగాకు వ్యతిరేక దినోత్సవం ప్రాముఖ్యతను వివరిస్తూ ఆయన మాట్లాడుతూ, పొగాకు వినియోగం ప్రపంచవ్యాప్తంగా నివారించగలిగే మరణాలకు ప్రధాన కారణాలలో ఒకటని అన్నారు. సిగరెట్లు, బీడీలు, గుట్కా, ఖైనీ, పాన్ మసాలా వంటి పొగాకు ఉత్పత్తులు నోటి క్యాన్సర్, గొంతు క్యాన్సర్, ఊపిరితిత్తుల క్యాన్సర్, గుండె జబ్బులు, పక్షవాతం వంటి ప్రాణాంతక వ్యాధులకు కారణమవుతున్నాయని తెలిపారు.
యువత, విద్యార్థులు పొగాకు అలవాట్లకు దూరంగా ఉండాలని ఆయన సూచించారు. తల్లిదండ్రులు తమ పిల్లలపై ప్రత్యేక శ్రద్ధ వహించాలని కోరారు. పొగాకు వినియోగం వల్ల కేవలం వినియోగదారుడే కాకుండా, కుటుంబ సభ్యులు కూడా పరోక్ష ధూమపానం ద్వారా ఆరోగ్య సమస్యలకు గురయ్యే ప్రమాదం ఉందన్నారు.
సమాజాన్ని పొగాకు ప్రమాదాలపై చైతన్యవంతం చేస్తూ యాంటీ టొబాకో ఉద్యమాన్ని బలోపేతం చేయాలని డాక్టర్ రాజశేఖర్ రెడ్డి పిలుపునిచ్చారు. పొగాకు రహిత తెలంగాణ, పొగాకు రహిత భారతదేశ నిర్మాణానికి ప్రతి ఒక్కరూ తమ వంతు బాధ్యత నిర్వర్తించాలని అన్నారు.
“పొగాకును మానండి.. ఆరోగ్యాన్ని కాపాడండి, కుటుంబాన్ని రక్షించండి” అనే సందేశాన్ని ప్రతి ఇంటికీ తీసుకెళ్లాల్సిన అవసరం ఉందని డాక్టర్ కొప్పుల రాజశేఖర్ రెడ్డి పేర్కొన్నారు.
