అంగరంగ వైభవంగా ప్రారంభమైన వర్చువల్ డిజిటల్ మహానాడు

అంగరంగ వైభవంగా ప్రారంభమైన వర్చువల్ డిజిటల్ మహానాడు
పార్టీకి మహానాడు ఒక పండుగ వంటిదని ఎమ్మెల్యే కందికుంట వెంకటప్రసాద్ వ్యాఖ్య
శ్రీ సత్యసాయి బ్యూరో, ఆంధ్రప్రభ : తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం నుంచి అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న మహానాడు ఈ ఏడాది వినూత్నంగా వర్చువల్ డిజిటల్ విధానంలో ఘనంగా ప్రారంభమైంది. ఇంధన పొదుపు, ఆధునిక సాంకేతిక వినియోగం లక్ష్యంగా రాష్ట్రవ్యాప్తంగా క్లస్టర్‌ల వారీగా ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు.
ఈ క్రమంలో కదిరి నియోజకవర్గం పరిధిలోని రూరల్ గట్లు వద్ద ఉన్న ఇంపీరియల్ గార్డెన్‌లో క్లస్టర్–3 మహానాడు అంగరంగ వైభవంగా జరిగింది. ఈ కార్యక్రమానికి కదిరి శాసనసభ్యులు కందికుంట వెంకటప్రసాద్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. మాజీ ఎంపీ నిమ్మల కిష్టప్ప, శ్రీకాళహస్తి మార్కెట్ యార్డ్ చైర్మన్ చెంచయ్య నాయుడు, పార్టీ పరిశీలకులు, స్థానిక నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
కార్యక్రమం ప్రారంభానికి ముందు తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకులు నందమూరి తారక రామారావు విగ్రహానికి ఎమ్మెల్యే కందికుంట వెంకటప్రసాద్, మాజీ ఎంపీ నిమ్మల కిష్టప్పతో కలిసి పూలమాలలు వేసి ఘన నివాళులర్పించారు. అనంతరం జ్యోతి ప్రజ్వలన చేసి పార్టీ జెండాను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా కార్యకర్తలు నినాదాలతో ప్రాంగణాన్ని మార్మోగించారు.
వర్చువల్ విధానంలో నిర్వహించిన మహానాడులో రాష్ట్ర, జాతీయ స్థాయి నాయకుల ప్రసంగాలను భారీ ఎల్ఈడి తెరల ద్వారా ప్రత్యక్ష ప్రసారంగా వీక్షించారు. పార్టీ భవిష్యత్ కార్యాచరణ, రాష్ట్ర అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు, గ్రామీణ స్థాయిలో పార్టీ బలోపేతంపై చేసిన ప్రసంగాలు కార్యకర్తలను ఆకట్టుకున్నాయి.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే కందికుంట వెంకటప్రసాద్ మాట్లాడుతూ మహానాడు తెలుగుదేశం పార్టీకి ఒక పండుగ వంటిదని అన్నారు. పసుపు సైనికులందరినీ ఒకే వేదికపైకి తీసుకువచ్చే మహత్తర కార్యక్రమమిదని పేర్కొన్నారు. ప్రతి కార్యకర్త పార్టీ బలోపేతానికి అంకితభావంతో పనిచేయాలని పిలుపునిచ్చారు. వర్చువల్ విధానంలోనూ మహానాడు ఉత్సాహం తగ్గలేదని తెలిపారు.
మాజీ ఎంపీ నిమ్మల కిష్టప్ప మాట్లాడుతూ తెలుగుదేశం పార్టీ ప్రజాసేవే లక్ష్యంగా పనిచేస్తోందని అన్నారు. మహానాడు ద్వారా కార్యకర్తల్లో మరింత ఉత్సాహం నింపేలా నాయకత్వం కార్యక్రమాలు చేపడుతోందని తెలిపారు.
పెద్ద సంఖ్యలో మహిళలు, యువత, పార్టీ కార్యకర్తలు పాల్గొని మహానాడును విజయవంతం చేశారు. పసుపు జెండాలు, పార్టీ నినాదాలతో ప్రాంగణం పండుగ వాతావరణాన్ని తలపించింది.
