మహిళా పారిశ్రామికవేత్తలకు మార్కెటింగ్ భరోసా

మహిళా పారిశ్రామికవేత్తలకు మార్కెటింగ్ భరోసా

రతన్ టాటా హబ్ ద్వారా ప్రత్యేక శిక్షణలు..

“ఒక కుటుంబం–ఒక పారిశ్రామికవేత్త” లక్ష్యంగా ముందుకు

విజయవాడ, ఆంధ్రప్రభ: పొదుపు సంఘాల మహిళలను ఆర్థికంగా బలోపేతం చేయడమే లక్ష్యంగా వారికి పారిశ్రామిక రంగంపై అవగాహన కల్పించి, వారు తయారు చేసే ఉత్పత్తులకు మార్కెటింగ్ సౌకర్యాలు కల్పించాలని జిల్లా కలెక్టర్ డా. జి. లక్ష్మీశ అధికారులను ఆదేశించారు. రతన్ టాటా హబ్ (ఆర్‌టిహెచ్) ద్వారా మహిళలకు శిక్షణ అందించి స్వయం ఉపాధి రంగంలో మరింత ముందుకు తీసుకెళ్లేందుకు చర్యలు చేపట్టాలని సూచించారు.

శనివారం కలెక్టరేట్‌లోని ఏవీఎస్ రెడ్డి సమావేశ మందిరంలో మెప్మా ఆధ్వర్యంలో నిర్వహించిన సమావేశంలో టౌన్ లెవల్ ఫెడరేషన్, ఏరియా లెవల్ ఫెడరేషన్ సభ్యులతో కలెక్టర్ సమీక్ష నిర్వహించారు.

మహిళల ఉత్పత్తులకు విస్తృత మార్కెట్ అవకాశాలు

ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో విజయవాడ, జగ్గయ్యపేట, నందిగామ, తిరువూరు ప్రాంతాల్లో 14 పట్టణ స్థాయి సమాఖ్యలు పనిచేస్తున్నాయని తెలిపారు. మహిళలు తయారు చేసే ఉత్పత్తులకు విస్తృత మార్కెట్ అవకాశాలు కల్పించడం ద్వారా వారి ఆదాయాన్ని పెంచేందుకు అధికారులు కృషి చేయాలని సూచించారు.

ఆర్‌టిహెచ్ ద్వారా ప్రత్యేక శిక్షణలు

మహిళా పారిశ్రామికవేత్తల నైపుణ్యాభివృద్ధి కోసం రతన్ టాటా హబ్ ద్వారా ప్రత్యేక శిక్షణ కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు తెలిపారు. ఉత్పత్తుల తయారీ, నాణ్యత ప్రమాణాలు, బ్రాండింగ్, ప్యాకేజింగ్, మార్కెటింగ్ వంటి అంశాలపై శిక్షణ ఇచ్చి మహిళలను విజయవంతమైన పారిశ్రామికవేత్తలుగా తీర్చిదిద్దడమే లక్ష్యమన్నారు.

రుణాలు స్వయం ఉపాధికే వినియోగించాలి

ప్రభుత్వం పొదుపు సంఘాల మహిళలకు ఒక్కో సభ్యురాలికి రూ.10 లక్షలు, గ్రూపు మొత్తానికి రూ.20 లక్షల వరకు ఆర్థిక సహాయం అందిస్తున్నప్పటికీ, కొందరు వాటిని వ్యక్తిగత అవసరాలకు వినియోగిస్తున్నారని కలెక్టర్ ఆందోళన వ్యక్తం చేశారు. రుణాలు, సబ్సిడీలను స్వయం ఉపాధి యూనిట్ల అభివృద్ధికే వినియోగించి విజయవంతమైన వ్యాపారవేత్తలుగా ఎదగాలని సూచించారు.

“ఒక కుటుంబం–ఒక పారిశ్రామికవేత్త” లక్ష్యం

రతన్ టాటా హబ్ ద్వారా శిక్షణ అందిస్తూ “ఒక కుటుంబం–ఒక పారిశ్రామికవేత్త” లక్ష్య సాధనలో మహిళలను భాగస్వాములుగా చేయాలని మెప్మా సమాఖ్య సభ్యులకు పిలుపునిచ్చారు. ఎన్టీఆర్ జిల్లాలో ప్రతి ఏడాది వెయ్యి కోట్ల రూపాయలకుపైగా జీవనోపాధి రుణాలు మహిళలకు అందుతున్నాయని, వాటిని సద్వినియోగం చేసుకుని స్వయం సమృద్ధితో ముందుకు సాగాలని కోరారు.

జీఎస్‌టీ, ఎఫ్‌ఎస్‌ఎస్‌ఏఐ రిజిస్ట్రేషన్లు తప్పనిసరి

వ్యాపార కార్యకలాపాలు నిర్వహించే ప్రతి యూనిట్ తప్పనిసరిగా జీఎస్‌టీ, ఎఫ్‌ఎస్‌ఎస్‌ఏఐ తదితర అవసరమైన రిజిస్ట్రేషన్లు పొందాలని కలెక్టర్ స్పష్టం చేశారు. చట్టబద్ధమైన విధానాలు పాటించడం ద్వారా వ్యాపార విస్తరణకు మరింత అవకాశాలు లభిస్తాయని తెలిపారు.

సమావేశంలో వీఎంసీ యూసీడీ ప్రాజెక్టు అధికారి చంద్రశేఖర్, మెప్మా ప్రాజెక్టు డైరెక్టర్ పి. మురళీకృష్ణ ప్రసాద్, జిల్లా సమాఖ్య అధ్యక్షురాలు మీనాక్షి, కార్యదర్శి నజీమున్నీసా, వివిధ పట్టణ సమాఖ్యల ప్రతినిధులు, మెప్మా సిబ్బంది పాల్గొన్నారు.