యువ మేధ‌కు వేదిక‌.. ఎంఎస్ఎంఈ ఉత్స‌వ్‌

ఆలోచ‌న నుంచి ఆవిష్క‌ర‌ణ వ‌ర‌కు చేయూత
సృజ‌నాత్మ‌క‌త‌కు అనుభ‌వాన్ని జోడించే అద్భుత కార్య‌క్ర‌మం
మొత్తం 80 స్టాళ్ల‌తో యువ కలలకు రెక్కలు తొడిగేలా ఉత్సవ్
ప‌రిశ్ర‌మ‌ల అభివృద్ధిలో ఆర్‌టీఐహెచ్ ఓ గేమ్ ఛేంజ‌ర్‌
ఎన్‌టీఆర్ జిల్లా క‌లెక్ట‌ర్ డా. జి.ల‌క్ష్మీశ‌

విజయవాడ, ఆంధ్రప్రభ : యువ‌త‌లో దాగిఉన్న సృజనాత్మకత, ఆవిష్కరణాత్మక ఆలోచనలను ముందుకు న‌డిపించడ‌మే ధ్యేయంగా అంత‌ర్జాతీయ సూక్ష్మ‌, చిన్న‌, మ‌ధ్య‌త‌ర‌హా ప‌రిశ్ర‌మ‌లు (ఎంఎస్ఎంఈ) దినోత్స‌వం సంద‌ర్భంగా ఎంఎస్ఎంఈ ఉత్స‌వ్‌-2026ను నిర్వ‌హించిన‌ట్లు జిల్లా క‌లెక్ట‌ర్ డా. జి.ల‌క్ష్మీశ అన్నారు. శ‌నివారం విజ‌య‌వాడ గ్రామీణం ఎనికేపాడులోని ర‌త‌న్‌టాటా ఇన్నొవేష‌న్ హ‌బ్ (ఆర్టీఐహెచ్‌)లో క‌లెక్ట‌ర్ ల‌క్ష్మీశ.. ఏపీ ఛాంబ‌ర్ ఆఫ్ కామ‌ర్స్ ప్రెసిడెంట్ పి.భాస్క‌ర్‌రావు, ఏపీ ఎంఎస్ఎంఈ ఇండ‌స్ట్రీస్ అసోసియేష‌న్ ప్రెసిడెంట్ డి.దుర్గాప్ర‌సాద్‌, జేఆర్‌డీ టాటా ఐలా ఛైర్మ‌న్ టి.శ్రీనివాస‌రావు, జిల్లా ప‌రిశ్ర‌మ‌ల అధికారి ఎం.మ‌ధు, ఆర్‌టీఐహెచ్‌-విజ‌య‌వాడ సీఈవో ర‌వితేజ త‌దిత‌రుల‌తో క‌లిసి ఎంఎస్ఎంఈ ఉత్స‌వ్‌ను ప్రారంభించారు. ఈ ఉత్స‌వ్‌లో యువ‌త‌, మ‌హిళ‌లు త‌మ ఆవిష్క‌ర‌ణ‌లు, ఉత్ప‌త్తుల‌కు సంబంధించి 80కు పైగా స్టాళ్ల‌ను ఏర్పాటుచేయ‌గా వాటిని క‌లెక్ట‌ర్ ప‌రిశీలించారు. స్త్రీ శ‌క్తి మార్కెట్ హ‌బ్‌, జాబ్ పాప‌ర్‌, ఈజీ స్లేట్‌, గ్లివీ, కూలెక్స్ గ్రీన్ ఇండియా, జెస్ట్ ఈట్‌, ప‌రివ‌ర్త‌న్‌, ఫార్మ్ స్టీల్ ప్రొడ‌క్ట్స్ త‌దిత‌ర స్టార్ట‌ప్‌లు త‌మ ఉత్ప‌త్తుల‌ను ప్ర‌ద‌ర్శించాయి. ఈ సంద‌ర్భంగా క‌లెక్ట‌ర్ ల‌క్ష్మీశ మాట్లాడుతూ ఒక కుటుంబం-ఒక పారిశ్రామిక‌వేత్త దార్శ‌నిక‌త‌కు అనుగుణంగా ర‌త‌న్ టాటా ఇన్నొవేష‌న్ హ‌బ్ ద్వారా స్టార్ట‌ప్‌ల‌కు చేయూత‌నివ్వ‌డం జ‌రుగుతోంద‌న్నారు. యువ మేధ‌స్సుకు అనుభ‌వాన్ని జ‌త‌చేసి ఆ ఆలోచ‌న‌ల‌ను ఆవిష్క‌ర‌ణ‌ల వైపు న‌డిపించేందుకు కృషిచేస్తున్న‌ట్లు తెలిపారు. అవసరమైన మార్గదర్శకత్వం, సాంకేతిక సహాయం, మార్కెటింగ్ అవకాశాలు, ఆర్థిక వనరులపై అవగాహన కల్పించడంలో ఇటువంటి ఉత్సవాలు ఎంతో ఉపయోగపడతాయని, స‌మాజంలోని ఎన్నో స‌మ‌స్య‌ల‌కు ప‌రిష్కారం కూడా ల‌భిస్తుంద‌ని క‌లెక్ట‌ర్ పేర్కొన్నారు.

స్వ‌ర్ణాంధ్ర‌, విక‌సిత్ భార‌త్ లక్ష్యాల సాధ‌న దిశ‌గా…

స్వ‌ర్ణాంధ్ర‌, విక‌సిత్ భార‌త్ ల‌క్ష్యాల సాధ‌న దిశ‌గా ప‌టిష్ట కార్యాచ‌ర‌ణ‌తో ముందుకెళ్తున్నామ‌ని.. ఇందులో భాగంగా స్వ‌యం స‌హాయ‌క సంఘాల మ‌హిళ‌లు కూడా ఎంఎస్ఎంఈలు ఏర్పాటు చేసుకొని త‌మ కాళ్ల‌పై తాము నిల‌బ‌డుతూ మ‌రో ప‌దిమందికి ఉపాధి క‌ల్పించే స్థాయికి ఎదిగేలా రైజ్‌, ఆర్‌టీఐహెచ్ ద్వారా ప్ర‌త్యేక శిక్ష‌ణ కార్య‌క్ర‌మాల‌తో పాటు వ‌ర్క్‌షాప్‌లు నిర్వ‌హిస్తున్న‌ట్లుకలెక్టర్ లక్ష్మీ శ వివ‌రించారు. యువ పారిశ్రామిక‌వేత్త‌ల‌కు ఆవిష్క‌ర‌ణ‌లు దిశ‌గా వేసే అడుగుల్లో ఎదుర‌య్యే స‌మ‌స్య‌ల ప‌రిష్కారానికి ఈ కేంద్రాలు ఆర్ అండ్ డీ (ప‌రిశోధ‌న‌, అభివృద్ధి) కేంద్రాలుగా ఉప‌యోగ‌ప‌డుతున్నాయ‌ని పేర్కొన్నారు. ఓ చిన్న ఆలోచ‌న‌కు చేయూత‌నిస్తే అది ఓ మంచి ప‌రిశ్ర‌మ‌గా ఎదుగుతుంద‌ని.. ఆర్థికాభివృద్ధికి అండ‌గా నిలుస్తుంద‌ని పేర్కొన్నారు. ఎంఎస్ఎంఈ ఉత్స‌వ్‌లో భాగ‌స్వాములైన ఛాంబ‌ర్ ఆఫ్ కామ‌ర్స్‌, ఆర్‌టీఐహెచ్‌, వివిధ పారిశ్రామిక సంస్థ‌లు, అసోసియేష‌న్లు ప్ర‌తిఒక్క‌రికీ ధ‌న్య‌వాదాలు తెలియ‌జేస్తున్న‌ట్లు క‌లెక్ట‌ర్ ల‌క్ష్మీశ తెలిపారు.

స్వ‌ర్ణాంధ్ర సాకారం.. ఎంఎస్ఎంఈలతో సుల‌భ‌త‌రం..

ఏపీ ఛాంబ‌ర్ ఆఫ్ కామ‌ర్స్ ప్రెసిడెంట్ పి.భాస్క‌ర్‌రావు మాట్లాడుతూ మ‌న రాష్ట్రం పారిశ్రామిక మ్యాపులో అద్భుత‌మైన స్థానం సంపాదించుకుంటోంద‌ని, స్టార్ట‌ప్ ఎకో సిస్ట‌మ్ కూడా అభివృద్ధి చెందుతోంద‌ని పేర్కొన్నారు. దాదాపు ఏడెనిమిదివేల స్టార్ట‌ప్‌లు ఆర్‌టీఐహెచ్ ప్రోత్స‌హంతో నేడు ముందుకెళ్తున్నాయ‌న్నారు. రాష్ట్రంలోని ప‌రిశ్ర‌మ‌ల్లో దాదాపు 90 శాతం ఎంఎస్ఎంఈ కేట‌గిరీ కిందే ఉన్నాయ‌ని.. ఇవి మ‌రింత అభివృద్ధి సాధించాల్సిన అవ‌స‌ర‌ముంద‌న్నారు. వోక‌ల్ ఫ‌ర్ లోకల్ నినాదంతో ఆంధ్ర‌ప్ర‌దేశ్ స్థానిక ఉత్ప‌త్తుల‌కు మ‌రింత ఆద‌ర‌ణ ల‌భించేలా ప్ర‌త్యేక కార్యాచ‌ర‌ణ‌కు ఏపీ ఛాంబ‌ర్స్ పిలుపునిస్తోంద‌ని భాస్క‌ర్‌రావు తెలిపారు. కార్య‌క్ర‌మంలో భాగంగా ఇండ‌స్ట్రీ 4.0 టెక్నిక‌ల్ సెష‌న్ నిర్వ‌హించారు. ఎంఎస్ఎంఈ ఉత్స‌వ్‌లో 500 మందికిపైగా ప‌రిశ్రామిక ప్ర‌తినిధులు, సంద‌ర్శ‌కులు పాల్గొన్నారు.

కార్య‌క్ర‌మంలో ఏపీ ఎంఎస్ఎంఈ ఇండ‌స్ట్రీస్ అసోసియేష‌న్ జ‌న‌ర‌ల్ సెక్ర‌ట‌రీ రామ‌చంద్ర‌న్‌, బీఎన్ఐ ఈడీ జై దేశాయ్‌, ఏపీ ఛాంబ‌ర్ ఆఫ్ కామ‌ర్స్ వైస్ ప్రెసిడెంట్ బి.రాజ‌శేఖ‌ర్‌, ప్ర‌కాశ స్పెక్ట్రో కాస్ట్ ప్రైవేట్ లిమిటెడ్ ఎండీ టి.పార్థ‌సార‌థి, ఏపీ ఎంఎస్ఎంఈ బోర్డు కార్పొరేష‌న్ డైరెక్ట‌ర్ చిన్న‌రాజు గుడిపూడి, పారిశ్రామిక‌వేత్త ఆర్‌వీ స్వామి, డీఆర్‌డీఏ పీడీ ఏఎన్‌వీ నాంచారరావు, వివిధ శాఖ‌ల అధికారులు త‌దిత‌రులు పాల్గొన్నారు.