తెలుగుజాతి గర్వించదగ్గ మహానేత ఎన్టీఆర్

తెలుగుజాతి గర్వించదగ్గ మహానేత ఎన్టీఆర్

తిరువూరు, ఆంధ్రప్రభ : తెలుగు ప్రజల ఆత్మగౌరవ ప్రతీక, విశ్వవిఖ్యాత నటసార్వభౌముడు, మాజీ ముఖ్యమంత్రి, తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకులు స్వర్గీయ నందమూరి తారక రామారావు 103వ జయంతి వేడుకలు ఎన్టీఆర్ జిల్లా తిరువూరులో ఘనంగా నిర్వహించారు.

తిరువూరు పట్టణంలోని మధిర రోడ్డులో ఏర్పాటు చేసిన ఎన్టీఆర్ విగ్రహానికి శాసనసభ్యుడు కొలికపూడి శ్రీనివాసరావు పూలమాల వేసి ఘన నివాళులర్పించారు. ఈ సందర్భంగా “జోహార్ ఎన్టీఆర్” అంటూ కార్యకర్తలు, అభిమానులు పెద్ద ఎత్తున నినాదాలు చేయడంతో మధిర రోడ్ ప్రాంతం మార్మోగిపోయింది. పార్టీ శ్రేణులు, అభిమానులు, యువత భారీగా హాజరై ఎన్టీఆర్ సేవలను స్మరించుకున్నారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాసరావు మాట్లాడుతూ, “కృషి ఉంటే మనుషులు ఋషులవుతారు” అనే మహోన్నత సందేశాన్ని జీవితాంతం ఆచరణలో చూపించిన మహానుభావుడు ఎన్టీఆర్ అని కొనియాడారు. ప్రతి తెలుగువాడి ఆత్మగౌరవాన్ని ప్రపంచ వేదికపై గర్వంగా నిలబెట్టిన మహానేతగా ఆయన చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోయారని పేర్కొన్నారు.

“సమాజమే దేవాలయం – ప్రజలే దేవుళ్లు” అనే సిద్ధాంతంతో పేద ప్రజల సంక్షేమం కోసం నిరంతరం కృషి చేసిన ప్రజానాయకుడు ఎన్టీఆర్ అని తెలిపారు. వెండితెరపై దేవుడిగా కోట్లాది అభిమానుల మనసులు గెలుచుకున్న ఆయన, రాజకీయాల్లో యుగపురుషుడిగా చరిత్ర సృష్టించారని అన్నారు.

తెలుగుజాతి గర్వకారణమైన ఎన్టీఆర్ ఆశయాలను కొనసాగించడం ప్రతి తెలుగుదేశం పార్టీ కార్యకర్త బాధ్యత అని ఎమ్మెల్యే స్పష్టం చేశారు. ప్రజల సంక్షేమమే రాజకీయాల పరమావధి అన్న ఆయన సిద్ధాంతాలను నేటి తరం ముందుకు తీసుకెళ్లాల్సిన అవసరం ఉందన్నారు.

ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ నాయకులు, ప్రజాప్రతినిధులు, కార్యకర్తలు, అభిమానులు, యువత భారీగా పాల్గొని ఎన్టీఆర్ చిత్రపటాలకు పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు.