ఈశాన్య అభివృద్ధి దేశ సమగ్ర ప్రగతికి కీలకం..

ఈశాన్య అభివృద్ధి దేశ సమగ్ర ప్రగతికి కీలకం..
భీమవరం బ్యూరో, ఆంధ్రప్రభ : దేశ సమగ్ర అభివృద్ధి ప్రస్థానంలో ఈశాన్య ప్రాంతాల అభివృద్ధి అత్యంత కీలకమని కేంద్ర ఉక్కు, భారీ పరిశ్రమల శాఖ సహాయమంత్రి భూపతిరాజు శ్రీనివాస వర్మ అన్నారు.
ఈశాన్య రాష్ట్రాల అధికారిక పర్యటనలో భాగంగా రెండవ రోజు బుధవారం ఆయన మేఘాలయ రాష్ట్రం సౌత్ వెస్ట్ ఖాసీ హిల్స్ జిల్లాలో విస్తృతంగా పర్యటించారు. అంతకుముందు అస్సాం రాజధాని దిస్పూర్‌లో జరిగిన బీజేపీ మీట్ అండ్ గ్రీట్ కార్యక్రమంలో పాల్గొని, ముఖ్యమంత్రి హిమంత బిశ్వ శర్మతో మర్యాదపూర్వకంగా సమావేశమయ్యారు. రాష్ట్రానికి నూతన ప్రభుత్వానికి శుభాకాంక్షలు తెలియజేస్తూ కేంద్ర–రాష్ట్ర సమన్వయంతో చేపట్టాల్సిన అభివృద్ధి అంశాలపై చర్చించారు.
అస్సాం పర్యటన అనంతరం మేఘాలయ చేరుకున్న కేంద్ర మంత్రి శ్రీనివాస వర్మ, సౌత్ వెస్ట్ ఖాసీ హిల్స్ జిల్లాలో అధికారులతో కలిసి క్షేత్రస్థాయిలో పర్యటించారు. కేంద్ర ప్రభుత్వ పథకాలు లబ్ధిదారులకు ఎలా చేరుతున్నాయో స్వయంగా పరిశీలించారు.
జిల్లా కేంద్ర ఆసుపత్రిని సందర్శించి వైద్య సేవలను సమీక్షించారు. అనంతరం ఆయుష్మాన్ భారత్ హెల్త్ కార్డులను లబ్ధిదారులకు స్వయంగా పంపిణీ చేశారు. నేషనల్ రూరల్ లైవ్లీహుడ్ మిషన్ కింద మహిళా స్వయం సహాయక సంఘాలు సాగు చేస్తున్న ప్రకృతి వ్యవసాయ క్షేత్రాలను సందర్శించి మహిళా రైతులను అభినందించారు.
అంగన్‌వాడీ కేంద్రాన్ని పరిశీలించి చిన్నారులకు అందుతున్న పౌష్టికాహార వివరాలను తెలుసుకున్నారు. చిన్నారులు, తల్లులతో మాట్లాడి వారి యోగక్షేమాలను అడిగి తెలుసుకున్నారు.
ప్రధానమంత్రి ఆవాస్ యోజన-గ్రామీణ్ కింద నిర్మించిన నూతన గృహాలను ప్రారంభించి లబ్ధిదారులతో కలిసి గృహప్రవేశాల్లో పాల్గొన్నారు. ఈ పథకం వారి జీవితాల్లో తీసుకొచ్చిన మార్పులను ఆయన తెలుసుకున్నారు.
మధ్యాహ్నం అనంతరం జిల్లా స్థాయి సమీక్షా సమావేశం నిర్వహించి కేంద్ర పథకాల అమలుపై అధికారులతో చర్చించారు. అర్హులైన ప్రతి లబ్ధిదారునికి సంక్షేమ పథకాలు చేరేలా అధికారులు కృషి చేయాలని సూచించారు.
