తాగునీటి సమస్యలు లేకుండా ముందస్తు చర్యలు చేపట్టాలి

తాగునీటి సమస్యలు లేకుండా ముందస్తు చర్యలు చేపట్టాలి

భీమవరం, ఆంధ్రప్రభ : జిల్లాలో ఎక్కడా తాగునీటి సమస్య తలెత్తకుండా అధికారులు ముందస్తు చర్యలు చేపట్టాలని జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి ఆదేశించారు.

వేసవిలో తాగునీటి సమస్యల నివారణపై సోమవారం జిల్లా కలెక్టర్ క్యాంపు కార్యాలయం నుంచి ఎంపీడీవోలు, డిప్యూటీ ఎంపీడీవోలు, ఆర్‌డబ్ల్యూఎస్ అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించి సమీక్షించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, జిల్లాలోని ప్రతి గ్రామంలో తాగునీటి కొరత రాకుండా ప్రణాళికాబద్ధంగా చర్యలు చేపట్టాలని సూచించారు.

పెనుమంట్ర మండలం నేలమూరు గ్రామంలో తాగునీటి సమస్య నివారణకు తక్షణ చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. అవసరమైతే ట్యాంకర్ల ద్వారా మంచినీరు సరఫరా చేయాలని, చెరువుల నీటిని శుద్ధి చేసి పైప్‌లైన్ ద్వారా ప్రజలకు అందించే విధంగా చర్యలు తీసుకోవాలని సూచించారు.

గ్రామాల్లో మంచినీటి కొళాయిలు ఏర్పాటు చేసి నిరంతర సరఫరా జరిగేలా చూడాలని తెలిపారు. రాత్రి వేళల్లో కొళాయిల వద్ద అనవసర వినియోగం జరగకుండా నియంత్రణ చర్యలు చేపట్టాలని ఆదేశించారు. ప్రతి గ్రామంలోని చెరువుల నీటి నిల్వ స్థాయి, లోతు తదితర వివరాలపై సమగ్ర నివేదికలు సిద్ధం చేయాలని పేర్కొన్నారు.

ఓవర్ హెడ్ ట్యాంకులు ఎల్లప్పుడూ నీటితో నిండుగా ఉండేలా పర్యవేక్షించాలని, అవసరమైతే మున్సిపాలిటీల్లో వార్డు వార్డుకు ట్యాంకర్ల ద్వారా నీటి సరఫరా చేయాలని సూచించారు. తాగునీటి సమస్యలపై ప్రజల నుండి ఫిర్యాదులు రాకుండా అధికారులు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించారు.

ప్రతి సోమవారం నిర్వహించే పీజీఆర్‌ఎస్ కార్యక్రమంలో వచ్చే తాగునీటి ఫిర్యాదులను నిరంతరం పరిశీలిస్తున్నామని తెలిపారు. ఫిర్యాదులపై నిర్లక్ష్యం చూపితే సంబంధిత అధికారులపై చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. పైప్‌లైన్ లీకేజీలు లేకుండా తరచూ తనిఖీలు నిర్వహించాలని ఆదేశించారు.


ఎస్‌టీపీల స్థల సేకరణపై సమీక్ష

అనంతరం మున్సిపల్ ఇంజనీర్లతో నిర్వహించిన సమీక్షలో కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో ఎస్‌టీపీల (సేవేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్లు) ఏర్పాటుకు అవసరమైన స్థలాలను వెంటనే సేకరించాలని ఆదేశించారు. సెప్టిక్ ట్యాంకుల వ్యర్థాలు పర్యావరణ కాలుష్యానికి కారణమవుతున్నాయని, ప్రజల ఆరోగ్యంపై ప్రతికూల ప్రభావం చూపుతున్నాయని పేర్కొన్నారు.

జిల్లాలో సెప్టిక్ ట్యాంకుల సంఖ్య, వ్యర్థాల విడుదల మార్గాలపై పూర్తి వివరాలు వెంటనే సమర్పించాలని ఆదేశించారు. తణుకు, పాలకొల్లు మండలాల్లో ఎస్‌టీపీలకు అనువైన స్థలాలు ఉన్నందున వెంటనే పనులు ప్రారంభించాలని సూచించారు. ఆకివీడు, తాడేపల్లిగూడెం ప్రాంతాల్లోనూ స్థల సేకరణ వేగవంతం చేయాలని తెలిపారు.

ట్యాంకర్ యజమానులతో సమావేశాలు నిర్వహించి పర్యావరణ కాలుష్యంపై అవగాహన కల్పించాలని సూచించారు. బహిరంగ ప్రదేశాల్లో సెప్టిక్ వ్యర్థాలు పారబోసే పరిస్థితులు లేకుండా నిరంతర పర్యవేక్షణ చేయాలని కలెక్టర్ ఆదేశించారు.

Leave a Reply