అందని ఆధార్ సేవలు.. గ్రామీణ ప్రజలకు తప్పని ఇబ్బందులు

అందని ఆధార్ సేవలు.. గ్రామీణ ప్రజలకు తప్పని ఇబ్బందులు

పాల్వంచ, ఆంధ్రప్రభ: పాల్వంచ మండల వ్యాప్తంగా ప్రస్తుతం కేవలం మూడు ఆధార్ కేంద్రాలు మాత్రమే అందుబాటులో ఉండగా, వాటిలో ఒక కేంద్రం రెండు నెలలుగా మూతపడటంతో గ్రామీణ ప్రాంత ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ముఖ్యంగా బసవతారక కాలనీ పరిధిలో ఉన్న ఆధార్ కేంద్రం గత రెండు నెలలుగా పనిచేయకపోవడంతో మండలంలోని గ్రామాల ప్రజలు ఆధార్ సంబంధిత సేవల కోసం పట్టణంలోని కేంద్రాలపై ఆధారపడాల్సి వస్తోంది.

ఆధార్ కార్డులో పేరు మార్పు, చిరునామా సవరణ, బయోమెట్రిక్ అప్‌డేట్, మొబైల్ నంబర్ నమోదు తదితర సేవల కోసం ప్రజలు టౌన్‌లోని కేంద్రాలకు వెళ్లాల్సిన పరిస్థితి నెలకొంది. దీంతో సమయం, డబ్బు రెండూ వృథా అవుతున్నాయని గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే పాల్వంచ పట్టణంలోని ఆధార్ కేంద్రాల వద్ద భారీ రద్దీ నెలకొంది. తెల్లవారుజామునే ప్రజలు క్యూ లైన్లలో నిలబడాల్సి వస్తోందని, గంటల తరబడి వేచి చూసినా కొందరికి సేవలు అందక నిరాశతో వెనుదిరగాల్సి వస్తోందని చెబుతున్నారు.

ప్రస్తుతం పాఠశాలలు, కళాశాలల అడ్మిషన్ల సీజన్ కొనసాగుతుండటంతో ఆధార్ సేవల అవసరం మరింత పెరిగింది. విద్యార్థుల అడ్మిషన్లు, స్కాలర్‌షిప్‌లు, ఇతర ధ్రువీకరణ ప్రక్రియల కోసం ఆధార్ తప్పనిసరి కావడంతో విద్యార్థులు, తల్లిదండ్రులు ఆధార్ కేంద్రాల వద్ద పడిగాపులు కాస్తున్నారు.

రెండు నెలలుగా మూతపడిన బసవతారక కాలనీ ఆధార్ కేంద్రం ఎప్పుడు తిరిగి ప్రారంభమవుతుందనే విషయంపై స్పష్టత లేక ప్రజల్లో ఆందోళన వ్యక్తమవుతోంది. సంబంధిత అధికారులు వెంటనే స్పందించి రూరల్ ఆధార్ కేంద్రాన్ని తిరిగి ప్రారంభించి, గ్రామీణ ప్రజలకు ఆధార్ సేవలను అందుబాటులోకి తీసుకురావాలని స్థానికులు కోరుతున్నారు.