విలువ ఆధారిత ప్రాసెసింగ్‌కు ప్రోత్సాహం

విలువ ఆధారిత ప్రాసెసింగ్‌కు ప్రోత్సాహం

రైతు సమూహాలకు ఆర్థిక సహాయం అందించేలా చర్యలు : జిల్లా కలెక్టర్ జి. రాజకుమారి

మిల్లెట్ ప్రాసెసింగ్ యూనిట్ పరిశీలించిన కలెక్టర్

నంద్యాల బ్యూరో, ఆంధ్రప్రభ : ప్రకృతి వ్యవసాయ ఉత్పత్తులకు విలువ ఆధారిత ప్రాసెసింగ్‌కు ప్రోత్సాహం అందించడంతో పాటు రైతు సమూహాలకు ఆర్థిక సహాయం అందించేలా చర్యలు తీసుకుంటున్నట్లు జిల్లా కలెక్టర్ జి. రాజకుమారి తెలిపారు.

నంద్యాల జిల్లా దొర్నిపాడు మండలం ఉమాపతి నగరానికి చెందిన రైతు గడ్డిపాటి రాజశేఖర్ ఆధ్వర్యంలో “సృష్టి రైతు సమూహం” ఏర్పాటు చేసిన మిల్లెట్ ప్రాసెసింగ్ యూనిట్‌ను కలెక్టర్ బుధవారం సందర్శించారు. అక్కడ జరుగుతున్న ప్రాసెసింగ్ విధానాన్ని ఆమె పరిశీలించారు.

సంఘం ప్రతినిధి రాజశేఖర్ వివరాలు తెలియజేస్తూ, రైతులకు విత్తనాలు అందించి ప్రకృతి వ్యవసాయ పద్ధతిలో పండించిన మిల్లెట్స్‌ను తిరిగి కొనుగోలు చేసి ప్రాసెసింగ్ చేస్తున్నట్లు తెలిపారు. కొర్రలు, సామలు, ఊదలు, అరికెలు, అండుకొర్రలు, వరిగలు వంటి చిరుధాన్యాలను బియ్యంగా మార్చడంతో పాటు సజ్జలు, రాగులు, జొన్నలను శుభ్రపరిచి ప్యాకింగ్ చేసి వినియోగదారులకు అందిస్తున్నట్లు వివరించారు.

రెండేళ్ల క్రితం ప్రారంభించిన ఈ యూనిట్ ద్వారా రైతులకు మార్కెట్ సౌకర్యం కల్పించడంతో పాటు ఆరోగ్యకరమైన ఆహార ఉత్పత్తులను ప్రజలకు అందిస్తున్నట్లు తెలిపారు.

యూనిట్‌ను పరిశీలించిన కలెక్టర్ స్వయంగా మిషన్‌ను ప్రారంభించి ముడి సరుకుల నుంచి బియ్యం, నూకలు తయారయ్యే విధానాన్ని పరిశీలించారు. అక్కడ తయారైన మిల్లెట్ స్నాక్స్‌ను రుచి చూసి నాణ్యతపై సంతృప్తి వ్యక్తం చేశారు.

సంఘం సభ్యులు రవ్వ తయారీ మిషన్, సార్టెక్స్ మిషన్ కొనుగోలుకు ఆర్థిక సహాయం లేదా సబ్సిడీ మంజూరు చేయాలని కలెక్టర్‌ను కోరారు. దీనిపై స్పందించిన కలెక్టర్, రూ.50 లక్షల వరకు ప్రాజెక్టులకు అవకాశాలు ఉన్నాయని తెలిపారు. సంబంధిత జీఎస్టీ, ఫుడ్ లైసెన్స్, ఉద్యమ్ ఆధార్, యంత్రాల అంచనా వ్యయ వివరాలతో దరఖాస్తు సమర్పించాలని సూచించారు.

మిషనరీ కొనుగోలుకు సుమారు రూ.26 లక్షలు అవసరమవుతాయని, ప్రస్తుతం ముడి సరుకు కొనుగోలుకు వర్కింగ్ క్యాపిటల్ కొరత ప్రధాన సమస్యగా ఉందని సంఘ ప్రతినిధులు కలెక్టర్ దృష్టికి తీసుకువచ్చారు.

ప్రకృతి వ్యవసాయం ద్వారా పండించిన ఉత్పత్తులకు విలువ ఆధారిత ప్రాసెసింగ్ యూనిట్లు గ్రామీణ ఆర్థికాభివృద్ధికి దోహదపడతాయని కలెక్టర్ పేర్కొన్నారు. రైతు సమూహాల అభివృద్ధికి ప్రభుత్వం అందించే అవకాశాలను వినియోగించుకోవాలని సూచించారు.