ధరల పెంపును నిరసిస్తూ సీపీఐ రాస్తారోకో..

చౌటుప్పల్, ఆంధ్రప్రభ ; కేంద్రంలోని నరేంద్ర మోడీ ప్రభుత్వం పెట్రోల్, డీజిల్ నిత్యావసర వస్తువుల ధరలను విపరీతంగా పెంచుతూ దేశ ప్రజలపై పెనుభారం మోపుతోందని సీపీఐ పట్టణ కార్యదర్శి పగిళ్ళ మోహన్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. కేంద్ర ప్రభుత్వ ప్రజావ్యతిరేక విధానాలను నిరసిస్తూ చౌటుప్పల్ పట్టణంలో సీపీఐ ఆధ్వర్యంలో జాతీయ రహదారిపై భారీ నిరసన కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్భంగా పగిల్ల మోహన్ రెడ్డి మాట్లాడుతూ.. పెట్రోల్, డీజిల్ ధరలు నానాటికీ పెరిగిపోతుండటంతో రవాణా ఖర్చులు పెరిగి, నిత్యావసర వస్తువుల ధరలు ఆకాశాన్ని తాకుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు.
ఫలితంగా సామాన్య, మధ్యతరగతి ప్రజలు రోజువారీ ఖర్చులు భరించలేక తీవ్ర ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని పేర్కొన్నారు. ఐదు రాష్ట్రాల ఎన్నికల ముందు ఓట్ల కోసం ఎలాంటి ధరలు పెంచకుండా ఎన్నికలు ముగిసిన వెంటనే ‘పొదుపు మంత్రం’ చెప్తూ ధరల బాదుడు ప్రారంభించింది. దేశంలో చమురు నిల్వలకు ఎలాంటి కొరత లేదని అధికారికంగా ప్రకటనలు చేస్తూనే, మరోపక్క యావత్ రంగాన్ని కార్పొరేట్ శక్తుల చేతికి అప్పజెప్పి మాటిమాటికి ధరలు పెంచడం ప్రజలను దారుణంగా మోసం చేయడమేనన్నారు.
ఈ కార్యక్రమంలో సీపీఐ మున్సిపల్ కార్యదర్శి పగిళ్ల మోహన్ రెడ్డి, సహాయ కార్యదర్శి ఉడుత రామలింగం, పిల్లి శంకర్, ఏఐవైఎఫ్ జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ కొండూరి వెంకటేష్, బద్దుల సుధాకర్, టంగుటూరు రాములు, బేధరకోట యాదయ్య, దాసరి మనోహర్, ఏఐటీయూసీ ఆటో యూనియన్ నాయకులు ముప్పిడి నర్సింహా, దామ లింగస్వామి, దేశగాని శ్రీను, గోసుకొండ మహేష్, బేడిద రమేష్ తదితరులు పాల్గొని కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా పెద్ద ఎత్తున నినాదాలు చేశారు.
