ప్రతి గింజను కొనుగోలు చేస్తాం..

ప్రతి గింజను కొనుగోలు చేస్తాం..

  • ప్రభుత్వ భూమిని గుర్తించాలి
  • ఎమ్మెల్యే మక్కాన్ సింగ్ రాజ్ ఠాకూర్

పాలకుర్తి, ఆంధ్రప్రభ : రైతులు ఎలాంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, ప్రభుత్వం రైతులు పండించిన ప్రతి ధాన్యపు గింజను కొనుగోలు చేసి రైతులకు పూర్తి స్థాయిలో అండగా నిలుస్తుందని ఎమ్మెల్యే మక్కాన్ సింగ్ రాజ్ ఠాకూర్ అన్నారు. రైతుల సంక్షేమమే ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని, రైతులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా అన్ని విధాలా చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. మంగళవారం పాలకుర్తి మండలం జీడీ నగర్‌లోని గణపతి రైస్ మిల్లును ఎమ్మెల్యే సందర్శించారు.

ఈ సందర్భంగా రైతులతో మాట్లాడి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ధాన్యం కొనుగోలు ప్రక్రియలో రైతులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అధికారులు, రైస్ మిల్లు యజమానులు సమన్వయంతో పనిచేయాలని సూచించారు. రైతులు తీసుకొచ్చిన ధాన్యాన్ని ఆలస్యం చేయకుండా వెంటనే ఆన్‌లోడ్ చేసుకోవాలని రైస్ మిల్లు యజమానులకు స్పష్టం చేశారు. ధాన్యం నాణ్యత పేరుతో అనవసరమైన కట్టింగ్‌లు చేయవద్దని హెచ్చరించారు.

ధాన్యం తూకం, రవాణా, హమాలీ, చెల్లింపుల విషయంలో అధికారులు ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని ఆదేశించారు. రైతులకు చెల్లింపులు ఆలస్యం కాకుండా వెంటనే వారి ఖాతాల్లో జమయ్యేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. అకాల వర్షాల కారణంగా తడిసిన, మెలక వచ్చిన ధాన్యంపై రైతులు ఆందోళన చెందుతున్నారని, అలాంటి ధాన్యాన్ని కూడా ప్రభుత్వం కొనుగోలు చేస్తుందని ఎమ్మెల్యే హామీ ఇచ్చారు. రైతులు ఎవరూ నష్టపోకుండా ప్రభుత్వం అన్ని విధాలుగా అండగా నిలుస్తుందని తెలిపారు.

గోదాంలు ఏర్పాటు చేస్తాం..
రైతులు పండించిన ధాన్యాన్ని భద్రపరిచేందుకు అవసరమైన గోదాంల ఏర్పాటుకు చర్యలు తీసుకుంటామని ఎమ్మెల్యే తెలిపారు. మండలంలో ప్రభుత్వ భూమిని గుర్తించి గోదాంల నిర్మాణానికి ప్రతిపాదనలు సిద్ధం చేయాలని తహసీల్దార్ సునీతను ఆదేశించారు. ప్రస్తుతం ధాన్యం నిల్వ సమస్యలతో రైతులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, సరైన గోదాంలు లేకపోవడంతో వర్షాలకు ధాన్యం తడిసిపోతుందని పేర్కొన్నారు. రైతుల అవసరాలను దృష్టిలో ఉంచుకొని శాశ్వత పరిష్కారం కోసం ప్రభుత్వం చర్యలు చేపడుతోందన్నారు. ఈ కార్యక్రమంలో సర్పంచులు సూర రమ, పెద్దపల్లి తిరుమల, నాయకులు సూర సమ్మయ్య, ముక్కెర శ్రీనివాస్, గంగాధరి రమేష్, పాత రవీందర్, సూర అంజి, కుడిక్కాల సురేష్, నారా సత్తయ్య పాల్గొన్నారు.