పౌల్ట్రీ రైతులు అప్రమత్తంగా ఉండాలి

పౌల్ట్రీ రైతులు అప్రమత్తంగా ఉండాలి

భీమవరం, ఆంధ్రప్రభ : వేసవి తీవ్రత రోజురోజుకు పెరుగుతున్న నేపథ్యంలో జిల్లాలోని పౌల్ట్రీ రైతులు అప్రమత్తంగా ఉండి తగిన ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి సూచించారు.

జిల్లా కలెక్టర్ క్యాంపు కార్యాలయం నుంచి సోమవారం పశుసంవర్ధక శాఖ అధికారులు, పౌల్ట్రీ యజమానులు, పౌల్ట్రీ ఫార్మర్స్ అసోసియేషన్ ప్రతినిధులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించి వేసవి తీవ్రత దృష్ట్యా పౌల్ట్రీ రంగంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలపై సమీక్షించారు.

ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, జిల్లాలో ప్రస్తుతం 45 డిగ్రీల నుంచి 48 డిగ్రీల సెంటీగ్రేడ్ వరకు ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయని తెలిపారు. అధిక ఉష్ణోగ్రతల కారణంగా కోళ్లు ఒత్తిడికి గురై మృత్యువాత పడే ప్రమాదం ఉందని హెచ్చరించారు. అందువల్ల రైతులు ప్రత్యేక జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు.

జూన్ మొదటి వారం వరకు అధిక ఉష్ణోగ్రతలు కొనసాగే అవకాశం ఉన్నందున పశుసంవర్ధక శాఖ అధికారులు పౌల్ట్రీ రైతులకు ముందస్తు జాగ్రత్తలపై విస్తృత అవగాహన కల్పించాలని ఆదేశించారు. క్షేత్రస్థాయిలో పర్యటనలు నిర్వహించి పరిస్థితులను నిరంతరం పర్యవేక్షించాలని సూచించారు.

పౌల్ట్రీ ఫార్ముల్లో కోళ్ల మరణాలపై సమగ్ర వివరాలు సేకరించాలని అధికారులను ఆదేశించారు. ఫార్మర్స్ అసోసియేషన్ ప్రతినిధులు కోళ్ల ఫీడ్, మందుల ధరలు పెరగడం వల్ల ఎదురవుతున్న ఆర్థిక ఇబ్బందులను కలెక్టర్ దృష్టికి తీసుకువచ్చారు.

ఈ సమస్యలను రాష్ట్ర ప్రభుత్వ దృష్టికి తీసుకువెళ్తామని కలెక్టర్ హామీ ఇచ్చారు. జిల్లా యంత్రాంగం తరఫున పౌల్ట్రీ రైతులకు పూర్తి సహకారం అందిస్తామని తెలిపారు.

ఈ వీడియో కాన్ఫరెన్స్‌లో పశుసంవర్ధక శాఖ జాయింట్ డైరెక్టర్ డాక్టర్ ఆర్. కోటిలింగరాజు, డివిజనల్ స్థాయి అధికారులు, వెటర్నరీ వైద్యులు, పౌల్ట్రీ యజమానులు పాల్గొన్నారు.