విజయవాడ మీదుగా ఈశాన్య భారతానికి కొత్త రైలు సర్వీసు..
విజయవాడ మీదుగా ఈశాన్య భారతానికి కొత్త రైలు సర్వీసు..
జూలై నుంచి రెగ్యులర్ ఆపరేషన్
విజయవాడ, ఆంధ్రప్రభ : చర్లపల్లి–అగర్తల మధ్య నడుస్తున్న వారాంత ఎక్స్‌ప్రెస్ రైలును రెగ్యులర్ సర్వీసుగా మార్చేందుకు రైల్వే శాఖ ఆమోదం తెలిపింది. జూలై నుంచి ఈ సర్వీసు శాశ్వత వీక్లీ ఎక్స్‌ప్రెస్‌గా అందుబాటులోకి రానుంది.
దక్షిణ మధ్య రైల్వే పరిధిలోని విజయవాడ డివిజన్ విడుదల చేసిన ప్రకటనలో ఈ వివరాలు వెల్లడించారు. ప్రస్తుతం ప్రత్యేక రైలుగా నడుస్తున్న సర్వీసును ఇకపై వారానికి ఒకసారి రెగ్యులర్ ఎక్స్‌ప్రెస్‌గా కొనసాగించనున్నట్లు తెలిపారు.
రైలు నెం.17031 చర్లపల్లి–అగర్తల వీక్లీ ఎక్స్‌ప్రెస్ ప్రతి సోమవారం మధ్యాహ్నం 4.20 గంటలకు చర్లపల్లి నుంచి బయలుదేరి గురువారం ఉదయం 6.55 గంటలకు అగర్తల చేరుకుంటుంది. ఈ సర్వీసు జూలై 27, 2026 నుంచి ప్రారంభం కానుంది.
తిరుగు ప్రయాణంలో రైలు నెం.17032 అగర్తల–చర్లపల్లి వీక్లీ ఎక్స్‌ప్రెస్ ప్రతి శుక్రవారం ఉదయం 5.30 గంటలకు అగర్తల నుంచి బయలుదేరి ఆదివారం రాత్రి 8.40 గంటలకు చర్లపల్లి చేరుకుంటుంది. ఈ సర్వీసు జూలై 31, 2026 నుంచి ప్రారంభమవుతుంది.
ఈ రైలు విజయవాడ జంక్షన్, రాజమండ్రి, దువ్వాడ, విజయనగరం, శ్రీకాకుళం రోడ్, భువనేశ్వర్, కటక్, ఖరగ్‌పూర్, న్యూ జల్పాయిగురి, గువాహటి తదితర ప్రధాన స్టేషన్ల మీదుగా ప్రయాణిస్తుంది.
ఆంధ్రప్రదేశ్, ఒడిశా, పశ్చిమ బెంగాల్, అసోం, త్రిపుర రాష్ట్రాల మధ్య ప్రయాణికులకు ఈ రైలు కీలక అనుసంధానంగా మారనుందని రైల్వే అధికారులు పేర్కొన్నారు. ముఖ్యంగా ఈశాన్య రాష్ట్రాల్లో పనిచేస్తున్న తెలుగు ప్రయాణికులకు ఇది ఉపయోగకరంగా ఉండనుంది.
రైలులో ఏసీ టూ టైర్, ఏసీ త్రీ టైర్, త్రీ ఏసీ ఎకానమీ, జనరల్ సెకండ్ క్లాస్ బోగీలు అందుబాటులో ఉంటాయని అధికారులు తెలిపారు. భవిష్యత్తులో ప్రయాణికుల అవసరాల ఆధారంగా అదనపు కోచ్‌లను కూడా పెంచే అవకాశం ఉందని సమాచారం.
