న్యాయవాదుల సమస్యలపై విజయవాడలో మహాధర్నా..

  • అఖిల భారత న్యాయవాదుల సంఘం(ఐలు) పశ్చిమ గోదావరి జిల్లా ఉపాధ్యక్షుడు పూరిళ్ళ శ్రీనివాస్

నరసాపురం, (ఆంధ్రప్రభ) : న్యాయవాదులు ఎదుర్కొంటున్న సమస్యలను వెంటనే పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ శనివారం (ఆగస్టు 1) విజయవాడలో మహాధర్నా నిర్వహిస్తున్నట్లు అఖిల భారత న్యాయవాదుల సంఘం (ఐలు) పశ్చిమ గోదావరి జిల్లా ఉపాధ్యక్షుడు పూరిళ్ల శ్రీనివాస్ తెలిపారు.

శుక్రవారం విడుదల చేసిన ప్రకటనలో ఆయన మాట్లాడుతూ, జూనియర్ న్యాయవాదులందరికీ న్యాయమిత్ర పథకం కింద నెలకు రూ.10 వేల స్టైపెండ్ అందించాలని, రాష్ట్రంలోని న్యాయవాదులందరికీ ఆరోగ్య బీమా పథకాన్ని అమలు చేయాలని, న్యాయవాదుల రక్షణ కోసం ప్రత్యేక చట్టాన్ని రూపొందించి అమలు చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.

న్యాయవాదులు ఎదుర్కొంటున్న పలు సమస్యల పరిష్కారాన్ని కోరుతూ అఖిల భారత న్యాయవాదుల సంఘం (ఐలు) ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కమిటీ ఆధ్వర్యంలో విజయవాడలోని ధర్నా చౌక్ వద్ద ఈ మహాధర్నా నిర్వహిస్తున్నట్లు తెలిపారు. రాష్ట్రంలోని న్యాయవాదులందరూ పెద్ద ఎత్తున మహాధర్నాకు హాజరై విజయవంతం చేయాలని పూరిళ్ల శ్రీనివాస్ పిలుపునిచ్చారు.