ప్రజా సమస్యల పరిష్కారంలో సత్వర న్యాయమే లక్ష్యం

ప్రజా సమస్యల పరిష్కారంలో సత్వర న్యాయమే లక్ష్యం

తిరుపతి, ఆంధ్రప్రభ : ప్రజా సమస్యల పరిష్కారంలో ఎలాంటి నిర్లక్ష్యానికి తావులేదని, బాధితులకు సత్వర న్యాయం అందించడమే లక్ష్యమని ఎస్పీ సుబ్బరాయుడు స్పష్టం చేశారు.

సోమవారం జిల్లా పోలీస్ కార్యాలయంలో నిర్వహించిన పీజీఆర్ఎస్ (పబ్లిక్ గ్రీవెన్స్ రెడ్రెస్సల్ సిస్టమ్) కార్యక్రమంలో జిల్లా వ్యాప్తంగా వచ్చిన ఫిర్యాదుదారుల నుంచి ఆయన వినతులు స్వీకరించారు. ఈ సందర్భంగా ఎస్పీ స్వయంగా ఫిర్యాదుదారుల వద్దకు వెళ్లి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు.

ప్రతి ఫిర్యాదును ఓర్పుతో విని, సమస్యల పరిష్కారానికి తీసుకోవాల్సిన చర్యలపై సంబంధిత అధికారులకు తక్షణ ఆదేశాలు జారీ చేశారు. ఫిర్యాదుదారులకు పరిష్కార మార్గాలను వివరించి ధైర్యం నింపారు.

ఈ కార్యక్రమంలో సుమారు 85 మంది ఫిర్యాదుదారులు వివిధ అంశాలపై వినతులు సమర్పించారు. అన్ని ఫిర్యాదులను సంబంధిత అధికారులకు పంపించి, ప్రాధాన్యత ఆధారంగా పరిశీలించి త్వరితగతిన పరిష్కరించాలని ఎస్పీ ఆదేశించారు.

ప్రజలకు సత్వర న్యాయం అందించడమే పీజీఆర్ఎస్ ప్రధాన లక్ష్యమని ఆయన పేర్కొన్నారు. అధికారులు బాధ్యతాయుతంగా, పారదర్శకంగా వ్యవహరించాలని సూచించారు.

ఈ కార్యక్రమంలో అదనపు ఎస్పీలు రావిమనోహరచారి, శ్రీనివాసులు, ఇతర పోలీస్ అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.


Leave a Reply