ప్లాస్టిక్ రహిత రాష్ట్రాన్ని నిర్మిద్దాం…

ప్లాస్టిక్ రహిత రాష్ట్రాన్ని నిర్మిద్దాం…
- స్వర్ణాంధ్ర–స్వచ్ఛ ఆంధ్ర కార్యక్రమంలో డీఎంహెచ్‌వో పిలుపు
- ప్లాస్టిక్ వినియోగం వల్ల పర్యావరణానికి తీవ్ర నష్టం
- సిబ్బందితో ప్లాస్టిక్ రహిత సమాజ నిర్మాణ ప్రతిజ్ఞ
తిరుపతి హెల్త్, ఆంధ్రప్రభ : తిరుపతిలో స్వర్ణాంధ్ర–స్వచ్ఛ ఆంధ్ర కార్యక్రమాన్ని శనివారం డీఎంహెచ్‌వో కార్యాలయ ఆవరణలో నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా వైద్య, ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ వి. బాలకృష్ణ నాయక్ మాట్లాడుతూ రాష్ట్రాన్ని పూర్తిగా ప్లాస్టిక్ రహిత రాష్ట్రంగా తీర్చిదిద్దాలని పిలుపునిచ్చారు. ఒకసారి వాడి పడేసే ప్లాస్టిక్ కవర్లు, బ్యాగులు పర్యావరణానికి తీవ్ర హానికరమని, వాటి వల్ల మనుషులు, జంతువులకు అనేక ఆరోగ్య సమస్యలు వస్తున్నాయని తెలిపారు. ప్లాస్టిక్ వినియోగం వల్ల కలిగే అనర్థాలపై ప్రజల్లో అవగాహన కల్పించాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందన్నారు.
ప్లాస్టిక్ బ్యాగుల స్థానంలో పేపర్ బ్యాగులు, బట్టతో తయారు చేసిన సంచులను వినియోగించాలని సూచించారు. రహదారులు, తాగునీటి వనరులు, కుంటలు, నదులు, సరస్సులు, బీచ్‌లు, పర్యాటక ప్రాంతాలు, పార్కులు, ఆసుపత్రులు, పాఠశాలలు వంటి ప్రాంతాలను ప్లాస్టిక్ రహితంగా ఉంచేందుకు చర్యలు తీసుకోవాలని కోరారు. గ్రామస్థాయి నుంచి జిల్లా స్థాయి వరకు ప్లాస్టిక్ వినియోగం వల్ల కలిగే నష్టాలపై విస్తృత అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని, అందులో ప్రతి ఒక్కరినీ భాగస్వాములను చేయాలని సూచించారు. అనంతరం ప్లాస్టిక్ రహిత సమాజ నిర్మాణం కోసం సిబ్బందితో ప్రతిజ్ఞ చేయించారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ డీఎంహెచ్‌వో డాక్టర్ శ్రీనివాసులు రెడ్డి, డీపీఎంఓ డాక్టర్ చత్ర ప్రకాష్ రెడ్డి, జిల్లా ప్రోగ్రామ్ అధికారులు, కార్యాలయ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
