పకడ్బందీగా ఇంటర్ సప్లిమెంటరీ పరీక్షలు నిర్వహించాలి

పకడ్బందీగా ఇంటర్ సప్లిమెంటరీ పరీక్షలు నిర్వహించాలి
జిల్లాలో 37 పరీక్షా కేంద్రాల్లో అన్ని ఏర్పాట్లు పూర్తి
పరీక్షల నిర్వహణపై ప్రిన్సిపాళ్లు, అధ్యాపకులతో సమీక్ష సమావేశం
పారదర్శకంగా పరీక్షలు నిర్వహించాలని డీఐఈఓ రఘుపతి ఆదేశాలు
చిత్తూరు, ఆంధ్రప్రభ : చిత్తూరు జిల్లాలో నిర్వహించనున్న ఇంటర్మీడియట్ అడ్వాన్స్ సప్లిమెంటరీ పరీక్షలను పకడ్బందీగా, పారదర్శకంగా నిర్వహించాలని జిల్లా ఇంటర్మీడియట్ విద్యాశాఖాధికారి ఎ. రఘుపతి అధికారులకు, కళాశాల ప్రిన్సిపాళ్లకు సూచించారు. సోమవారం చిత్తూరులోని విజయం జూనియర్ కళాశాలలో ఇంటర్ సప్లిమెంటరీ పరీక్షల ఏర్పాట్లపై కళాశాల ప్రిన్సిపాళ్లు, అధ్యాపకులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా పరీక్షల నిర్వహణకు సంబంధించిన అన్ని అంశాలపై సమగ్రంగా సమీక్షించారు.
ఈ సందర్భంగా డీఐఈఓ రఘుపతి మాట్లాడుతూ జిల్లాలో ఇంటర్ అడ్వాన్స్ సప్లిమెంటరీ పరీక్షల కోసం మొత్తం 37 పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ప్రతి పరీక్షా కేంద్రంలో విద్యార్థులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అన్ని మౌలిక సదుపాయాలు సిద్ధం చేసినట్లు చెప్పారు. పరీక్షలు ప్రశాంత వాతావరణంలో, ఎలాంటి అవాంఛనీయ ఘటనలకు తావులేకుండా నిర్వహించేందుకు కట్టుదిట్టమైన చర్యలు తీసుకున్నట్లు వెల్లడించారు. పరీక్షలు ఉదయం, మధ్యాహ్నం రెండు విడతలుగా నిర్వహించనున్నట్లు తెలిపారు. ఫస్ట్ ఇయర్ పరీక్షలు ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు జరుగుతాయని, సెకండ్ ఇయర్ పరీక్షలు మధ్యాహ్నం 2.30 గంటల నుంచి సాయంత్రం 5.30 గంటల వరకు నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు. పరీక్షల నిర్వహణకు సంబంధించి ఈ నెల 13వ తేదీన జిల్లా కలెక్టర్ ఆధ్వర్యంలో సమన్వయ సమావేశం నిర్వహించినట్లు రఘుపతి తెలిపారు. ఆ సమావేశంలో పరీక్షల నిర్వహణ, భద్రతా చర్యలు, విద్యార్థుల సౌకర్యాలు, రవాణా, వైద్య సేవలు, విద్యుత్ సరఫరా వంటి అంశాలపై విపులంగా చర్చించినట్లు చెప్పారు. రాష్ట్ర ప్రభుత్వ మార్గదర్శకాల ప్రకారం అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు వెల్లడించారు.
జిల్లా వ్యాప్తంగా ఉన్న అన్ని పరీక్షా కేంద్రాల పరిసర ప్రాంతాల్లో సెక్షన్ 144 అమలు చేయనున్నట్లు అధికారులు తెలిపారు. పరీక్షల సమయంలో కేంద్రాల వద్ద గుంపులు గుంపులుగా చేరకుండా పోలీసులు చర్యలు తీసుకుంటారని పేర్కొన్నారు. పరీక్షల ప్రశాంత నిర్వహణ కోసం పోలీసు శాఖతో సమన్వయం కొనసాగుతున్నట్లు తెలిపారు. పరీక్షల పర్యవేక్షణ కోసం ప్రత్యేక బృందాలను నియమించినట్లు వెల్లడించారు. జిల్లా పరీక్షల కమిటీ సభ్యులు ముగ్గురు, చీఫ్ సూపరింటెండెంట్లు 37 మంది, డిపార్ట్మెంటల్ అధికారులు 37 మంది విధుల్లో ఉంటారని తెలిపారు. అదనంగా రెండు ఫ్లయింగ్ స్క్వాడ్లు, నాలుగు కస్టోడియన్లు, నాలుగు సిట్టింగ్ స్క్వాడ్లను నియమించినట్లు చెప్పారు. ఎలాంటి అక్రమాలకు అవకాశం లేకుండా కఠిన నిఘా ఏర్పాటు చేస్తున్నట్లు వెల్లడించారు. పరీక్షా కేంద్రాల్లో తాగునీరు, వైద్య సిబ్బంది, విద్యుత్ సరఫరా, ఫర్నిచర్, సీసీ కెమెరాలు తదితర మౌలిక వసతులు సిద్ధంగా ఉంచినట్లు తెలిపారు. విద్యార్థులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నామని పేర్కొన్నారు. విద్యార్థులు పరీక్ష ప్రారంభానికి కనీసం అరగంట ముందుగానే కేంద్రాలకు చేరుకోవాలని డీఐఈఓ సూచించారు. హాల్ టికెట్ తప్పనిసరిగా వెంట తీసుకురావాలని, ఆలస్యంగా వచ్చే వారికి పరీక్షా కేంద్రాల్లో ప్రవేశం ఉండదని హెచ్చరించారు. అలాగే పరీక్షా నియమ నిబంధనలు తప్పనిసరిగా పాటించాలని సూచించారు.
రాష్ట్ర కమిషనర్ ఆధ్వర్యంలో జూమ్ సమావేశం కూడా నిర్వహించినట్లు రఘుపతి తెలిపారు. రాష్ట్ర స్థాయి మార్గదర్శకాలకు అనుగుణంగా అన్ని ఏర్పాట్లు పూర్తిచేసినట్లు వెల్లడించారు. పరీక్షల నిర్వహణలో నిర్లక్ష్యానికి తావులేకుండా ప్రతి అధికారి బాధ్యతాయుతంగా వ్యవహరించాలని సూచించారు. ఈ సమావేశంలో సయెద్ మౌల, ఎన్. దయానందరాజు, డి. మురళీకృష్ణతో పాటు జిల్లాలోని వివిధ కళాశాలల ప్రిన్సిపాళ్లు, అధ్యాపకులు పాల్గొన్నారు. పరీక్షలను విజయవంతంగా నిర్వహించేందుకు అందరూ సమన్వయంతో పనిచేయాలని అధికారులు పిలుపునిచ్చారు.
