బంగారు భవిష్యత్తు కోసం ప్రభుత్వ బడులు

బంగారు భవిష్యత్తు కోసం ప్రభుత్వ బడులు

  • ప్రభుత్వ బడుల్లో చదివి ఎంతోమంది ఉన్నత స్థితికి చేరారు
  • జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి

భీమవరం బ్యూరో, ఆంధ్రప్రభ: ప్రభుత్వ బడుల్లో పిల్లలను చేర్పించి వారి భవిష్యత్తుకు బలమైన పునాది వేయాలని” జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి తల్లిదండ్రులకు పిలుపునిచ్చారు. ప్రభుత్వం అందిస్తున్న నాణ్యమైన విద్య, సదుపాయాలు, సంక్షేమ పథకాలతో ప్రభుత్వ పాఠశాలలు విద్యార్థుల సమగ్రాభివృద్ధికి ఉత్తమ వేదికలుగా నిలుస్తున్నాయని ఆమె పేర్కొన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న బడి పిలుస్తోంది కార్యక్రమంలో భాగంగా ఆదివారం భీమవరం పట్టణంలోని దుర్గాపురం ప్రాంతంలో జిల్లా కలెక్టర్ స్వయంగా ఇంటింటికి వెళ్లి తల్లిదండ్రులను కలుసుకుని ప్రభుత్వ పాఠశాలల ప్రాముఖ్యతను వివరించారు.

విద్యార్థుల చేరికలను నూరు శాతం విజయవంతం చేయాలనే లక్ష్యంతో చేపట్టిన ఈ కార్యక్రమంలో భాగంగా ప్రజలకు అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి మాట్లాడుతూ జిల్లాలో సుమారు 1200 ప్రభుత్వ పాఠశాలలు పనిచేస్తుండగా, వాటిలో 6000 మంది సుశిక్షితులైన ఉపాధ్యాయులు విద్యాబోధన చేస్తున్నారని తెలిపారు. ప్రభుత్వ పాఠశాలల్లో నాణ్యమైన విద్యతో పాటు విద్యార్థుల వ్యక్తిత్వ వికాసం, క్రమశిక్షణ, సామాజిక అవగాహన, లోకజ్ఞానం వంటి అంశాలకు ప్రాధాన్యత ఇస్తున్నామని చెప్పారు. ప్రభుత్వ పాఠశాలల్లో చదివి నేడు అనేక మంది ఉన్నత స్థానాల్లో ఉన్నారని గుర్తుచేసిన కలెక్టర్, ఇటీవల పదో తరగతి ఫలితాల్లో ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులు అత్యుత్తమ ఫలితాలు సాధించడం ప్రభుత్వ విద్యా ప్రమాణాలకు నిదర్శనమని పేర్కొన్నారు. ప్రాథమిక దశలో బలమైన పునాది ఏర్పడితే విద్యార్థులు ఉన్నత విద్యలో సులభంగా రాణించగలరని, అలాంటి బలమైన పునాది ప్రభుత్వ పాఠశాలల్లోనే లభిస్తుందని అన్నారు.

ప్రభుత్వం పాఠశాలల అభివృద్ధికి కోట్లాది రూపాయలు ఖర్చు చేస్తూ విశాలమైన తరగతి గదులు, ఆధునిక మౌలిక వసతులు, ఆట మైదానాలు కల్పించిందని తెలిపారు. అదనంగా యూనిఫాంలు, పాఠ్యపుస్తకాలు, మధ్యాహ్న భోజనం, ఉచిత విద్య వంటి సంక్షేమ పథకాలు విద్యార్థులకు అందిస్తున్నట్లు చెప్పారు. విద్యార్థుల శారీరక దృఢత్వం కోసం క్రీడలకు కూడా ప్రాధాన్యత ఇస్తున్నామని పేర్కొన్నారు. ప్రైవేట్ పాఠశాలల్లో అధిక ఫీజులు, ఇరుకైన తరగతి గదులు, అనుభవం లేని ఉపాధ్యాయులతో పోలిస్తే ప్రభుత్వ పాఠశాలల్లో అనుభవజ్ఞులైన ఉపాధ్యాయులు, మెరుగైన వాతావరణం అందుబాటులో ఉంటుందని తల్లిదండ్రులు గుర్తించాలని సూచించారు.

ప్రభుత్వ పాఠశాలలో పిల్లలను చేర్పించి ఇంటి వద్ద కూడా కొంత సమయం కేటాయించి చదివిస్తే వారు మరింత ప్రతిభ కనబరుస్తారని తెలిపారు. ప్రైవేట్ పాఠశాలల్లో అధిక ఫీజులు చెల్లించలేక తల్లిదండ్రులు ఆర్థిక భారాన్ని మోస్తున్నారని, అటువంటి వారికి ప్రభుత్వ పాఠశాలల్లో లభించే సౌకర్యాలపై అవగాహన కల్పించాలని అధికారులకు సూచించారు. ప్రైవేట్ పాఠశాలల నుండి ప్రభుత్వ పాఠశాలలకు మారదలచిన విద్యార్థులకు సర్టిఫికెట్లు ఇవ్వకుండా ఇబ్బందులు కలిగిస్తే సంబంధిత యాజమాన్యాలపై చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. విద్యాశాఖ అభివృద్ధికి ప్రభుత్వం ప్రణాళికాబద్ధంగా చర్యలు చేపడుతోందని, విద్యార్థులకు మరింత మెరుగైన విద్యాబోధన అందించే దిశగా కృషి కొనసాగుతోందని కలెక్టర్ తెలిపారు. జిల్లాలోని అన్ని మండలాలు, గ్రామాలలో ప్రభుత్వ పాఠశాలల ప్రయోజనాలపై విస్తృత ప్రచార కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు చెప్పారు.
ఈ కార్యక్రమంలో డిఆర్ఓ బి.శివన్నారాయణ రెడ్డి, డీఈవో ఇ.నారాయణ, తహసిల్దార్ రావి రాంబాబు, విద్యాశాఖ అధికారులు, ఉపాధ్యాయులు, స్థానికులు పాల్గొన్నారు.

Leave a Reply