విపత్కర వేళ యువత ముందుండాలి…

విపత్కర వేళ యువత ముందుండాలి…
కమిషనర్ చల్లా ఓబులేసు
కర్నూలు బ్యూరో, ఆంధ్రప్రభ : ప్రకృతి వైపరీత్యాలు, అత్యవసర పరిస్థితుల సమయంలో యువత సేవాభావంతో ముందుకు వచ్చి సహాయక చర్యల్లో భాగస్వామ్యం కావాలని నగరపాలక సంస్థ కమిషనర్ చల్లా ఓబులేసు పిలుపునిచ్చారు. శనివారం రాత్రి నగరంలో కురిసిన భారీ వర్షాలు, ఈదురుగాలుల ప్రభావంతో పలుచోట్ల చెట్లు విరిగి రహదారులపై పడిపోవడంతో ఆదివారం ఉదయం స్వయంగా పర్యటించి పరిస్థితులను పరిశీలించారు. వెంకటరమణ కాలనీతో పాటు పలు కాలనీల్లో విరిగిన చెట్ల కొమ్మలను సిబ్బందితో కలిసి తొలగించి ట్రాఫిక్కు అంతరాయం కలగకుండా చర్యలు చేపట్టారు. బళ్లారి చౌరస్తా, కృష్ణనగర్, సి క్యాంపు, బి క్యాంపు ప్రభుత్వ సముదాయాల ప్రాంతం, జోహరాపురం తదితర ప్రాంతాల్లో పర్యటించి పరిస్థితులను సమీక్షించారు.
పలు ప్రాంతాల్లో గ్యాంగ్వర్క్ ఏర్పాటు చేసి పూడికతీత పనులను వెంటనే చేపట్టాలని అధికారులను ఆదేశించారు. ప్రజలకు ఇబ్బందులు కలగకుండా అన్ని శాఖల సమన్వయంతో సహాయక చర్యలు కొనసాగుతున్నాయని తెలిపారు.
విరిగిన చెట్ల తొలగింపు బాధ్యత ప్రధానంగా విద్యుత్ శాఖకు చెందినదైనా, ప్రజల ఇబ్బందులను దృష్టిలో ఉంచుకుని మున్సిపల్ సిబ్బంది కూడా చురుకుగా పనిచేస్తున్నారని పేర్కొన్నారు. ట్రాఫిక్ అంతరాయం లేకుండా చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు.
ఇలాంటి విపత్కర పరిస్థితుల్లో యువత సామాజిక బాధ్యతగా ముందుకు వచ్చి పునరుద్ధరణ చర్యల్లో భాగస్వామ్యం కావాలని కోరారు. సిబ్బంది వచ్చే వరకు ఎదురుచూడకుండా ప్రతి ఒక్కరూ తమ వంతు బాధ్యత నిర్వర్తిస్తే సమస్యలు త్వరగా పరిష్కారమవుతాయని సూచించారు.
ఈ కార్యక్రమంలో ప్రజారోగ్య అధికారి డాక్టర్ ఎం. రఘు, శానిటేషన్ ఇన్స్పెక్టర్లు మునిస్వామి, రవి, రమేష్, హుస్సేన్, నాగేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.
