నిర్లక్ష్యానికి చెక్.. రెవెన్యూ అధికారులకు సీసీఎల్‌ఏ హెచ్చరిక!

నిర్లక్ష్యానికి చెక్.. రెవెన్యూ అధికారులకు సీసీఎల్‌ఏ హెచ్చరిక!

ప్రజల సంతృప్తి 80 శాతం ఉండాలి..

పనితీరు మెరుగుపరచుకోకపోతే రివర్షన్ తప్పదన్న జయలక్ష్మి

ఏలూరు, ఆంధ్రప్రభ రెవెన్యూ సేవల అందింపులో నిర్లిప్తత ప్రదర్శించే అధికారులపై కఠిన చర్యలు తీసుకుంటామని రాష్ట్ర భూపరిపాలన శాఖ (సీసీఎల్‌ఏ) ముఖ్య కమిషనర్ జి. జయలక్ష్మి హెచ్చరించారు. ప్రజలకు మెరుగైన సేవలు అందించడంలో విఫలమయ్యే తహసీల్దార్లను రివర్షన్‌కు గురిచేసే అవకాశముందని స్పష్టం చేశారు.

మంగళవారం ఏలూరు కలెక్టరేట్‌లోని గోదావరి సమావేశ మందిరంలో జిల్లా కలెక్టర్ కె. వెట్రిసెల్వితో కలిసి రీ సర్వే, పట్టాదార్ పాస్ పుస్తకాల పంపిణీ, పీజీఆర్ఎస్ అర్జీలు, 22ఏ కేసుల పరిష్కారం తదితర రెవెన్యూ అంశాలపై సమీక్ష నిర్వహించారు.

ఈ సందర్భంగా జయలక్ష్మి మాట్లాడుతూ భూ రికార్డుల స్వచ్ఛీకరణే రీ సర్వే ప్రధాన లక్ష్యమని, ప్రభుత్వ నిబంధనలకు అనుగుణంగా ఎలాంటి పొరపాట్లు లేని భూ రికార్డులు రూపొందించాలని ఆదేశించారు. 22ఏ భూ సమస్యల పరిష్కారానికి రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యత ఇస్తోందన్నారు.

రెవెన్యూ శాఖ ప్రజలకు అత్యంత చేరువలో ఉండే శాఖగా ప్రత్యేక స్థానాన్ని కలిగి ఉందని పేర్కొన్న ఆమె, శాఖ పనితీరుపై ప్రజల్లో సానుకూల అభిప్రాయం పెంపొందించాల్సిన బాధ్యత అధికారులపై ఉందన్నారు. ప్రభుత్వ సేవలపై ప్రజల సంతృప్తిని ఐవీఆర్ఎస్ సర్వే ద్వారా అంచనా వేస్తున్నామని, రెవెన్యూ సేవల్లో కనీసం 80 శాతం సంతృప్తి స్థాయి నమోదుకావాలని సూచించారు.

ఏలూరు జిల్లాలో ఏప్రిల్‌తో పోలిస్తే మే నెలలో ప్రజల సంతృప్తి స్థాయి తగ్గిందని పేర్కొన్న జయలక్ష్మి, తహసీల్దార్లు కార్యాలయాల్లో కూర్చోవడం కాకుండా క్షేత్రస్థాయికి వెళ్లి ప్రజల సమస్యలను పరిశీలించాలని ఆదేశించారు. ప్రజలతో మర్యాదగా వ్యవహరిస్తూ, అర్జీలను సానుకూలంగా పరిష్కరించే దిశగా పనిచేయాలన్నారు.

జిల్లాలో ఆకస్మిక తనిఖీలు నిర్వహిస్తానని హెచ్చరించిన ఆమె, ప్రతిభ కనబరిచిన అధికారులను ప్రోత్సహిస్తామని, పనితీరు మెరుగుపరచుకోని వారిపై చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. ప్రతి నెల ఒక మండలంలో రీ సర్వే పూర్తయిన గ్రామాల్లో సవరించిన పట్టాదార్ పాస్ పుస్తకాలను పంపిణీ చేయాలని సూచించారు.

రీ సర్వే ప్రక్రియను రైతుల సమక్షంలో, పూర్తి పారదర్శకతతో నిర్వహించాలని, సంబంధిత రైతులకు ముందుగానే నోటీసులు జారీ చేయాలని ఆదేశించారు. రీ సర్వేకు సంబంధించిన అర్జీలను నిర్ణీత గడువులో పరిష్కరించాలని సూచించారు.

కలెక్టర్ వెట్రిసెల్వి పనితీరుపై ప్రశంసలు

22ఏ నిషేధిత భూముల జాబితా నుంచి అర్హమైన భూములను తొలగించాలన్న ప్రభుత్వ లక్ష్యానికి అనుగుణంగా ఏలూరు జిల్లాలో రెండు మెగా 22ఏ పరిష్కార మేళాలు నిర్వహించి వందల ఎకరాల భూములను విముక్తి చేయడంపై జిల్లా కలెక్టర్ కె. వెట్రిసెల్విని జయలక్ష్మి ప్రత్యేకంగా అభినందించారు.

కైకలూరు నియోజకవర్గంలో 300 మందికిపైగా రైతులకు చెందిన 700 ఎకరాలకు పైగా భూములను నిషేధిత జాబితా నుంచి తొలగించేందుకు కలెక్టర్ చేసిన కృషిని ప్రశంసిస్తూ, ఇదే స్ఫూర్తితో రెవెన్యూ అధికారులు పనిచేయాలని సూచించారు.

వెయ్యి ఎకరాలకు పైగా భూముల విముక్తి

జిల్లా కలెక్టర్ కె. వెట్రిసెల్వి మాట్లాడుతూ, ఇటీవల నిర్వహించిన రెండు మెగా 22ఏ పరిష్కార మేళాల ద్వారా వెయ్యి ఎకరాలకు పైగా భూములను నిషేధిత జాబితా నుంచి తొలగించామని తెలిపారు. జిల్లాలో పట్టాదార్ పాస్ పుస్తకాల పంపిణీని నూరు శాతం పూర్తి చేశామని, రీ సర్వే పనులు కూడా నిర్దేశిత లక్ష్యాల మేరకు కొనసాగుతున్నాయని చెప్పారు.

ఈ సమావేశంలో జాయింట్ కలెక్టర్ ఎం.జె. అభిషేక్ గౌడ, ఇన్‌చార్జి డీఆర్వో దేవకీదేవి, నూజివీడు సబ్ కలెక్టర్ బొల్లిపల్లి వినూత్న, ఆర్డీఓలు లక్ష్మీప్రసన్న, రమణ, సర్వే శాఖ డీడీ అన్సారీ, తహసీల్దార్లు, మండల సర్వేయర్లు పాల్గొన్నారు.

Leave a Reply