సిద్దిపేట సభను విజయవంతం చేయాలి: జేఏసీ నాయకులు
రాయపోల్, ఆంధ్రప్రభ : బీసీ, ఎస్సీ, ఎస్టీ వర్గాలకు జనాభా ప్రాతిపదికన అన్ని రంగాల్లో న్యాయం జరగాలనే లక్ష్యంతో జూన్ 5న సిద్దిపేటలో నిర్వహించే భారీ బహిరంగ సభకు ప్రజలు పెద్ద సంఖ్యలో హాజరుకావాలని జేఏసీ మండల నాయకుడు గూని నందు పిలుపునిచ్చారు.
రాయపోల్ మండల కేంద్రంలోని అంబేద్కర్ విగ్రహం వద్ద ఆదివారం సభ కరపత్రాలను జేఏసీ నాయకులు ఆవిష్కరించారు. ఈ సందర్భంగా గూని నందు మాట్లాడుతూ, “ఎవరి జనాభా ఎంత ఉంటే వారికి అంత హక్కు, అంత వాటా దక్కాలి” అనే డిమాండ్‌తో ఈ సభను నిర్వహిస్తున్నట్లు తెలిపారు.
ఉద్యోగాలు, రాజకీయాలు, విద్య, భూములు, ప్రభుత్వ పథకాలు సహా అన్ని రంగాల్లో బీసీ, ఎస్సీ, ఎస్టీ వర్గాలకు సమాన అవకాశాలు కల్పించాలని డిమాండ్ చేశారు.
జూన్ 5న సాయంత్రం 4 గంటలకు సిద్దిపేట ప్రభుత్వ బాలుర హైస్కూల్ మైదానంలో జరిగే సభకు బహుజనులు భారీగా హాజరై విజయవంతం చేయాలని కోరారు.
ఈ కార్యక్రమంలో జేఏసీ నాయకులు, ఉప సర్పంచులు హనుమంతు రాజు, కొనింటు రాజు, ప్రభాకర్, యాదగిరి, శ్రీకాంత్, నరేష్ తదితరులు పాల్గొన్నారు.
