భోగాపురం ఎయిర్‌పోర్టు వద్ద భద్రతా ఏర్పాట్లపై హోంమంత్రి సమీక్ష

విజయనగరం, ఆంధ్రప్రభ : భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం కమాండ్ కంట్రోల్ రూమ్‌లో హోంమంత్రి వంగలపూడి అనిత శుక్రవారం పోలీసు ఉన్నతాధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ప్రధాని పర్యటన నేపథ్యంలో చేపట్టిన భద్రతా, ట్రాఫిక్, పార్కింగ్ ఏర్పాట్లపై అధికారులతో విస్తృతంగా చర్చించి కీలక సూచనలు చేశారు.

ప్రధాని పర్యటన సందర్భంగా ట్రాఫిక్ సమస్యలు తలెత్తకుండా ముందస్తు చర్యలు చేపట్టాలని, అన్ని శాఖల అధికారులు పరస్పర సమన్వయంతో పనిచేసి కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని ఆమె ఆదేశించారు.

ప్రజలకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా అన్ని ఏర్పాట్లను పకడ్బందీగా పూర్తి చేయాలని అధికారులకు సూచించిన హోంమంత్రి, భద్రతా చర్యల్లో ఎలాంటి లోపాలకు తావులేకుండా అప్రమత్తంగా వ్యవహరించాలని స్పష్టం చేశారు.

అంతకుముందు కమాండ్ కంట్రోల్ రూమ్‌లో ఏర్పాటు చేసిన సీసీ కెమెరాల పనితీరును పరిశీలించి, నిఘా వ్యవస్థను మరింత సమర్థంగా నిర్వహించాలని సంబంధిత అధికారులకు సూచించారు.