మెగా డీఎస్సీ కాదు… దగా డీఎస్సీ…

డీఎస్సీ అక్రమాలపై సీబీఐ విచారణ జరపాలి
మంత్రి నారా లోకేష్ రాజీనామా చేయాలి
వైసీపీ ఎన్టీఆర్ జిల్లా అధ్యక్షుడు దేవినేని అవినాష్…
కలెక్టర్ కార్యాలయం వద్ద ధర్నా..
డీఆర్‌వోకు వినతిపత్రం
ఆగస్టు 3 నుంచి దశలవారీ ఉద్యమాలకు కార్యాచరణ


విజయవాడ, జులై 31 (ఆంధ్రప్రభ): “ఇది మెగా డీఎస్సీ కాదు… దగా డీఎస్సీ. డీఎస్సీ నియామకాలలో జరిగిన అక్రమాలపై సమాధానం చెప్పకుండా వ్యక్తిగత విమర్శలకు దిగుతున్నారు. యువతకు న్యాయం చేయాలంటే మంత్రి నారా లోకేష్ నైతిక బాధ్యత వహిస్తూ వెంటనే రాజీనామా చేయాలి” అని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎన్టీఆర్ జిల్లా అధ్యక్షుడు దేవినేని అవినాష్ డిమాండ్ చేశారు. డీఎస్సీ నియామకాలలో అక్రమాలు జరిగాయని ఆరోపిస్తూ శుక్రవారం జిల్లా కలెక్టర్ కార్యాలయం వద్ద వైసీపీ ఆధ్వర్యంలో నిర్వహించిన ఆందోళనలో ఆయన మాట్లాడారు. అనంతరం జిల్లా రెవెన్యూ అధికారి లక్ష్మీనర్సింహకు వినతిపత్రం అందజేశారు.

అవినాష్ మాట్లాడుతూ, డీఎస్సీ అక్రమాలపై ప్రభుత్వం సమగ్ర సమాధానం చెప్పకుండా విమర్శలకు పరిమితమవుతోందని ఆరోపించారు. ఈ వ్యవహారంపై సీబీఐతో విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. ఆగస్టు 3, 4 తేదీల్లో టౌన్‌హాల్ సమావేశాలు, 6 నుంచి 9 వరకు రిలే నిరాహార దీక్షలు, 10వ తేదీన అన్ని నియోజకవర్గ కేంద్రాల్లో ర్యాలీలు నిర్వహిస్తామని ప్రకటించారు. మాజీ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ మాట్లాడుతూ, స్పోర్ట్స్ కోటా నియామకాలలో తీవ్ర అవకతవకలు జరిగాయని ఆరోపించారు. పారదర్శకంగా నియామకాలు జరిగి ఉంటే సీబీఐ విచారణకు ప్రభుత్వం ఎందుకు వెనుకాడుతోందని ప్రశ్నించారు. ఎన్నికల హామీలైన ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలు, నిరుద్యోగ భృతిని వెంటనే అమలు చేయాలని, మంత్రి లోకేష్ రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు.

విద్యార్థి విభాగం రాష్ట్ర అధ్యక్షుడు పానుగంటి చైతన్య మాట్లాడుతూ, డీఎస్సీ ప్రశ్నపత్రం లీకేజీ, స్పోర్ట్స్ కోటా నియామకాలు, మెరిట్ జాబితాలో అక్రమాలపై సీబీఐతో సమగ్ర విచారణ జరిపించాలని కోరారు. మాజీ ఎమ్మెల్యేలు మొండితోక జగన్మోహన్‌రావు, మల్లాది విష్ణు మాట్లాడుతూ, డీఎస్సీ నియామకాల ప్రక్రియ మొత్తం అక్రమాలతో నిండిపోయిందని ఆరోపించారు. యువతకు న్యాయం జరిగే వరకు వైసీపీ పోరాటం కొనసాగిస్తుందని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో మాజీ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్, మాజీ ఎమ్మెల్యేలు మల్లాది విష్ణు, మొండితోక జగన్మోహన్‌రావు, తన్నీరు నాగేశ్వరరావు, ఎమ్మెల్సీ రుహుల్లా, విద్యార్థి విభాగం రాష్ట్ర అధ్యక్షుడు పానుగంటి చైతన్య, మాజీ మేయర్ రాయన భాగ్యలక్ష్మి, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి అసిఫ్, జిల్లా యువజన, విద్యార్థి విభాగం అధ్యక్షులు కొరివి చైతన్య, కోమల్ సాయి తదితరులు పాల్గొన్నారు.