పంట వ్యర్థాలను కాల్చవద్దు..
పంట వ్యర్థాలను కాల్చవద్దు..
- భూపాలపల్లి సీఐ నరేష్ కుమార్ హెచ్చరిక
- మొరంచపల్లి శివారులో మంటలు అదుపులోకి తెచ్చిన పోలీసులు
భూపాలపల్లి, ఆంధ్రప్రభ : భూపాలపల్లి పట్టణ పోలీస్ స్టేషన్ పరిధిలోని మొరంచపల్లి గ్రామ శివారులో బుధవారం సాయంత్రం పంట వ్యర్థాలకు నిప్పంటించిన ఘటన చోటుచేసుకుంది. పహారా నిర్వహిస్తున్న సమయంలో ఈ విషయాన్ని గమనించిన పోలీస్ సిబ్బంది వెంటనే అప్రమత్తమై మంటలను అదుపులోకి తీసుకువచ్చి పెద్ద ప్రమాదం సంభవించకుండా నివారించారు.
ఈ ఘటనపై భూపాలపల్లి సీఐ డి. నరేష్ కుమార్ మాట్లాడుతూ, మొరంచ వాగు సమీపంలో కొందరు గుర్తు తెలియని వ్యక్తులు పంట వ్యర్థాలకు నిప్పంటించినట్లు గుర్తించామని తెలిపారు. వెంటనే స్పందించి మంటలను ఆర్పివేయడంతో పెద్ద ప్రమాదం తప్పిందని పేర్కొన్నారు.
ఈ ఘటనపై భూపాలపల్లి పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదు చేసినట్లు తెలిపారు. బాధ్యులైన వ్యక్తులను గుర్తించి చట్టపరమైన చర్యలు తీసుకుంటామని ఆయన హెచ్చరించారు.
పంట కోతల అనంతరం మిగిలిన వ్యర్థాలను ఎట్టి పరిస్థితుల్లోనూ కాల్చవద్దని రైతులు, ప్రజలకు ఆయన విజ్ఞప్తి చేశారు. ఇటువంటి చర్యల వల్ల అగ్నిప్రమాదాలు సంభవించి ప్రాణ, ఆస్తి నష్టం జరిగే ప్రమాదం ఉందని తెలిపారు.
ఇటీవల రేగొండ మండలంలో పంట వ్యర్థాలను కాల్చే క్రమంలో జరిగిన అగ్నిప్రమాదంలో వృద్ధ దంపతులు ప్రాణాలు కోల్పోయిన ఘటనను ప్రతి ఒక్కరూ గుర్తుంచుకోవాలని సూచించారు.
వ్యవసాయ వ్యర్థాలను కాల్చడం వల్ల పర్యావరణానికి హాని కలగడమే కాకుండా సమీప పంటలు, చెట్లు, విద్యుత్ స్తంభాలు, నివాస ప్రాంతాలు మరియు అటవీ ప్రాంతాలకు ప్రమాదం ఏర్పడే అవకాశం ఉందని ఆయన హెచ్చరించారు. అగ్నిప్రమాదాలు లేదా అనుమానాస్పద ఘటనలు గమనించిన వెంటనే పోలీస్ లేదా ఫైర్ స్టేషన్‌కు సమాచారం ఇవ్వాలని ఆయన సూచించారు.
