మండుటెండల్లో మున్సిపల్ కార్మికుల నరకయాతన
మండుటెండల్లో మున్సిపల్ కార్మికుల నరకయాతన
- రికార్డు స్థాయి ఎండల్లోనూ మున్సిపల్ కార్మికుల కష్టం
- రెడ్ అలర్ట్‌లో నిజామాబాద్…
- అధికారుల ఆదేశాలు మాత్రం అమలు శూన్యం..!
- యూనిఫామ్‌లు లేవు.. చెప్పులు లేవు..
- రైన్‌కోట్లు కూడా బకాయే..!
నిజామాబాద్ అర్బన్, ఆంధ్రప్రభ : నిజామాబాద్ నగరం ప్రస్తుతం భానుడి భగభగలతో ఉక్కిరిబిక్కిరి అవుతోంది. రోజురోజుకూ పెరుగుతున్న ఉష్ణోగ్రతలతో జిల్లా రెడ్ అలర్ట్ పరిధిలోకి వెళ్లినట్లు అధికారులు గుర్తించారు. ప్రజలు అత్యవసర పనులు తప్ప బయటకు రావడానికి భయపడుతున్న పరిస్థితి నెలకొనగా… మున్సిపల్ కార్మికుల పరిస్థితి మాత్రం మరింత దయనీయంగా మారింది. ఎండల తీవ్రత దృష్ట్యా ఉదయం 10 లేదా 11 గంటల లోపే పనులు పూర్తి చేసి,మిగతా విధులను సాయంత్రం నిర్వహించాలని అధికారులు ఇటీవల ప్రకటించినా… ఫీల్డ్ స్థాయిలో మాత్రం ఆ ఆదేశాలు ఎక్కడా అమలవుతున్నట్లు కనిపించడం లేదు.

నగరంలోని పలు ప్రాంతాల్లో మధ్యాహ్నం 12 గంటలు దాటినా కార్మికులు చెత్త సేకరణ,కాలువల శుభ్రపరిచే పనులు,పారిశుద్ధ్య పనుల్లోనే నిమగ్నమై కనిపిస్తున్నారు.ఇది ఒక్కరోజు సమస్య కాదని కార్మికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రతి సంవత్సరం రెండుసార్లు యూనిఫామ్‌లు,ఎండాకాలానికి ప్రత్యేక చెప్పులు,తాగునీటి సదుపాయాలు,భద్రతా సామగ్రి ఇవ్వాల్సి ఉండగా… గత రెండేళ్లుగా అవి కూడా అందడం లేదని ఆరోపిస్తున్నారు.వర్షాకాలంలో ఇవ్వాల్సిన రైన్‌కోట్లు,గ్లౌజులు, ఇతర రక్షణ సామగ్రి కూడా చాలా మంది కార్మికులకు అందలేదని చెబుతున్నారు.
మండే రోడ్లపై పనిచేస్తున్న కార్మికుల దృశ్యాలు నగర ప్రజలను కలచివేస్తున్నాయి. ఒకవైపు రికార్డు స్థాయి ఎండలు… మరోవైపు కనీస రక్షణ లేకపోవడం వల్ల వడదెబ్బలు,డీహైడ్రేషన్, చర్మ సంబంధిత వ్యాధులు వచ్చే ప్రమాదం ఉందని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. “కార్మికుల సంక్షేమం కోసం ప్రభుత్వం నిధులు కేటాయిస్తున్నా… అవి ఎక్కడికి వెళ్తున్నాయి? అధికారులు ప్రకటించే ఆదేశాలు కేవలం మీడియా ప్రకటనలకే పరిమితమా?” అంటూ ప్రజలు ప్రశ్నిస్తున్నారు.
నగరాన్ని శుభ్రంగా ఉంచే మున్సిపల్ కార్మికుల పట్ల ఇంత నిర్లక్ష్యం తగదని, వెంటనే పని వేళల్లో మార్పులు అమలు చేసి… యూనిఫామ్‌లు,చెప్పులు, రైన్‌కోట్లు,తాగునీరు వంటి కనీస సదుపాయాలు కల్పించాలని కార్మిక సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. ప్రాణాలకు ముప్పుగా మారుతున్న ఎండల్లో కార్మికులతో పనులు చేయించడం ఎంతవరకు సమంజసం అనే ప్రశ్న ఇప్పుడు నగర ప్రజల్లో చర్చనీయాంశంగా మారింది. అధికారులు వెంటనే స్పందించి మున్సిపల్ కార్మికుల ఆరోగ్య భద్రతకు ప్రాధాన్యం ఇవ్వాలని ప్రజలు కోరుతున్నారు. “నగరాన్ని కాపాడే చేతులకు కనీస రక్షణ లేకపోతే… బాధ్యత ఎవరిది..?”
