ప్రైవేటీకరణ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలి..

  • పోచంపాడ్ జల విద్యుత్ కేంద్రంలో నాలుగో రోజు నిరసన

మెండోరా, ఆంధ్రప్రభ : నిజామాబాద్ జిల్లా బాల్కొండ నియోజకవర్గం మెండోరా మండలంలోని పోచంపాడ్ యాదాద్రి థర్మల్ విద్యుత్ కేంద్రంలోని కోల్, యాష్ ప్లాంట్ల నిర్వహణను ప్రైవేట్ సంస్థలకు అప్పగించేందుకు టెండర్లు పిలవడాన్ని నిరసిస్తూ పోచంపాడ్ జల విద్యుత్ కేంద్రంలో ఉద్యోగుల ఆందోళన నాలుగో రోజుకు చేరుకుంది.

టీజీపీఈజేఏసీ (TGPEJAC) నాయకులు కె. సతీష్, ఎం.డి. రఫీక్, దేవరాజ్, ఎం. ప్రవీణ్, చంద్రశేఖర్, నరేష్, శృతిమ, రాంబాబు, స్వాతి, ఏ.వి. శ్రీనివాస్ తదితరుల నాయకత్వంలో ఉద్యోగులు భోజన విరామ సమయంలో నల్ల బ్యాడ్జీలు ధరించి నిరసన కార్యక్రమం నిర్వహించారు.

ఈ సందర్భంగా జెన్‌కో ఉద్యోగులకు మద్దతుగా ట్రాన్స్‌కో, డిస్కం ఉద్యోగులు కూడా రాష్ట్రవ్యాప్తంగా నిరసన కార్యక్రమాలు చేపట్టినట్లు నాయకులు తెలిపారు. యాజమాన్యం టెండర్ ప్రక్రియను వెంటనే వెనక్కి తీసుకోకపోతే మరింత ఉధృతంగా ఆందోళన కార్యక్రమాలు నిర్వహిస్తామని హెచ్చరించారు.

నాయకులు మాట్లాడుతూ ప్రభుత్వ రంగ విద్యుత్ సంస్థల నిర్వహణను ప్రైవేట్ సంస్థలకు అప్పగించే నిర్ణయాన్ని యాజమాన్యం తక్షణమే ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. ప్రైవేటీకరణ వల్ల ఉద్యోగుల భద్రత, హక్కులు, సంస్థల భవిష్యత్తు దెబ్బతినే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో జల విద్యుత్ కేంద్ర ఉద్యోగులు, టీజీపీఈజేఏసీ నాయకులు, సిబ్బంది పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.