యువత మాదక ద్రవ్యాలకు దూరంగా ఉండాలి…
యువత మాదక ద్రవ్యాలకు దూరంగా ఉండాలి…
నంద్యాల బ్యూ, ఆంధ్రప్రభ : యువతలో మాదక ద్రవ్యాల దుష్పరిణామాల కలుగుతాయని వాటికి దూరంగా ఉండాలని సెట్కూరు సీఈవో డాక్టర్ వేణుగోపాల్, ఉద్యోగ కల్పనాధికారి సోమశివారెడ్డి అభివృద్ధి అధికారి శ్రీకాంత్ రెడ్డి లు పేర్కొన్నారు. బుధవారం కళాశాల విద్యార్థులకు చైతన్య కార్యక్రమం చేపట్టారు.విద్యార్థుల్లో సామాజిక బాధ్యత, క్రమశిక్షణ, ఆరోగ్యకరమైన జీవన విధానంపై చైతన్యం పెంపొందించే ఉద్దేశ్యంతో నిర్వహించరు. ప్రస్తుత కాలంలో యువత మాదక ద్రవ్యాల మాయాజాలానికి లోనవుతూ తమ భవిష్యత్తును ప్రమాదంలో పడేస్తున్నారని ఆందోళన వ్యక్తం చేశారు.
డ్రగ్స్ అలవాటు ప్రారంభంలో సరదాగా కనిపించినప్పటికీ, తర్వాత అది వ్యక్తి ఆరోగ్యం, మానసిక స్థితి, కుటుంబ జీవితం, సమాజంపై తీవ్రమైన ప్రభావాన్ని చూపుతుందన్నారు. యువత తమ లక్ష్యాలను గుర్తించి కష్టపడి చదువుకొని ఉన్నత స్థానాలను అధిరోహించాలన్నారు.అలాగే విద్యార్థులు సమయపాలన, క్రమశిక్షణ, సానుకూల ఆలోచనలతో ముందుకు సాగితే జీవితంలో ఎలాంటి లక్ష్యాన్నైనా సాధించగలరని పేర్కొన్నారు. సోషల్ మీడియా, చెడు స్నేహాల ప్రభావానికి లోనుకాకుండా తల్లిదండ్రులు, ఉపాధ్యాయుల సూచనలను పాటించాలని సూచించారు.
మాదక ద్రవ్యాల వినియోగం వల్ల నేరాల సంఖ్య పెరగడం, కుటుంబ సంబంధాలు దెబ్బతినడం, సమాజంలో అస్థిరత ఏర్పడుతుందన్నారు.కార్యక్రమంలో పాల్గొన్న విద్యార్థులకు మాదక ద్రవ్యాల వినియోగం వల్ల కలిగే శారీరక, మానసిక, సామాజిక నష్టాలపై వివరంగా అవగాహన కల్పించారు. విద్యార్థులు డ్రగ్స్‌కు దూరంగా ఉండి ఆరోగ్యకరమైన జీవన విధానాన్ని అలవరచుకోవాలని, కుటుంబ సభ్యులు, సమాజంలో కూడా ఈ విషయంపై అవగాహన కల్పించాలని పిలుపునిచ్చారు.
యువత తమ శక్తి సామర్థ్యాలను సరైన దిశలో వినియోగించుకోవాలన్నారు. విద్యార్థులు నైపుణ్యాభివృద్ధిపై దృష్టి పెట్టి ఉపాధి అవకాశాలను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. చెడు అలవాట్లు, మాదక ద్రవ్యాలు జీవితాన్ని నాశనం చేస్తాయని, కష్టపడి పనిచేసే వారికే విజయాలు సాధ్యమవుతాయని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో కళాశాల అధ్యాపకులు, సిబ్బంది, విద్యార్థులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
