పొదుపు..ఇంధన సంరక్షణలో చంద్రబాబు నిర్ణయం ఆదర్శం
పొదుపు..ఇంధన సంరక్షణలో చంద్రబాబు నిర్ణయం ఆదర్శం
ప్రధాని మోదీ పిలుపుకు వెంటనే స్పందించిన ఏపీ సీఎం
మహానాడు ఆన్‌లైన్ నిర్వహణతో లక్షల లీటర్ల ఇంధన ఆదా
సీఎం నిర్ణయంపై ఎన్టీఆర్ జిల్లా టీడీపీ వాణిజ్య విభాగం అధ్యక్షుడు సోలంకి రాజేంద్ర కుమార్ జైన్ హర్షం
విజయవాడ, ఆంధ్రప్రభ : దేశ అభివృద్ధికి ఇంధన పొదుపు, ఖర్చుల నియంత్రణ, వనరుల సమర్థ వినియోగం అత్యవసరమని ప్రధాని నరేంద్ర మోదీ ఇచ్చిన పిలుపుకు స్పందిస్తూ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తీసుకున్న నిర్ణయం స్ఫూర్తిదాయకమని ఎన్టీఆర్ జిల్లా టీడీపీ వాణిజ్య విభాగం అధ్యక్షుడు సాలంకి రాజేంద్రకుమార్ జైన్ పేర్కొన్నారు. తెలుగుదేశం పార్టీ అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహించే తెలుగు దేశం మహానాడును ఈసారి నెల్లూరులో ప్రత్యక్షంగా నిర్వహించకుండా, ఆన్‌లైన్ విధానంలో నిర్వహించాలని తీసుకున్న నిర్ణయం దూరదృష్టికి నిదర్శనమని ఆయన అభిప్రాయపడ్డారు. ఈ నిర్ణయం ద్వారా పార్టీ కార్యకర్తలు, నాయకులకు సౌలభ్యం కలగడంతో పాటు ఖర్చు నియంత్రణ, ఇంధన సంరక్షణకు కూడా విశేషంగా దోహదపడిందన్నారు.
మహానాడుకు రాష్ట్రవ్యాప్తంగా సుమారు పది వేలకుపైగా కార్లు, ఇతర వాహనాలు హాజరయ్యే అవకాశముండేదని, దీనివల్ల భారీ స్థాయిలో డీజిల్, పెట్రోల్ వినియోగం జరిగేదని సాలంకి తెలిపారు. సీఎం చంద్రబాబు ముందుచూపుతో తీసుకున్న ఈ నిర్ణయం కారణంగా సుమారు పది లక్షల లీటర్ల వరకు డీజిల్ వినియోగం తగ్గిందని పేర్కొన్నారు. డీజిల్ తో పాటు లక్షల లీటర్ల పెట్రోల్ కూడా ఆదా అయినట్లు తెలిపారు. ప్రజా ధనం, సమయం, ఇంధనం—మూడింటినీ ఆదా చేసేలా తీసుకున్న ఈ నిర్ణయం పరిపాలనా దక్షతకు నిదర్శనమని అన్నారు.
దేశ ప్రయోజనాలు, పర్యావరణ పరిరక్షణ, వనరుల సంరక్షణపై ప్రధాని మోదీ ఇచ్చిన సందేశాన్ని ఆచరణలో చూపిస్తూ సీఎం చంద్రబాబు మరోసారి ఆదర్శ నాయకత్వాన్ని చాటారని కొనియాడారు. ఇలాంటి నిర్ణయాలు ప్రజల్లో పొదుపు భావనను పెంపొందిస్తాయని, ప్రతి ఒక్కరూ వ్యక్తిగత జీవితంలోనూ ఖర్చు నియంత్రణ, ఇంధన పొదుపు అలవాటు చేసుకోవాలని సాలంకి రాజేంద్రకుమార్ జైన్ పిలుపునిచ్చారు. ప్రధాని మోదీ, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తీసుకుంటున్న దూరదృష్టి నిర్ణయాలు దేశ, రాష్ట్రాభివృద్ధికి బాటలు వేస్తున్నాయని ఆయన అభినందించారు.
