May10th | సీఎంల చేతిలోనే.. పోలీస్ పవర్!
May10th | సీఎంల చేతిలోనే.. పోలీస్ పవర్!
May10th | దేశంలో కొత్తరకం ట్రెండ్
హోం వంటి పవర్ ఫుల్ శాఖల ముఖ్యమంత్రుల దగ్గరే
శాంతి భద్రతల పరిరక్షణకే అంటున్న పలువురు సీఎంలు
విజయ్, రేవంత్, సువేందు, మాన్సింగ్ దగ్గరే ఆ శాఖలు
కేరళం, యూపీ, ఎంపీ, బీహార్ సీఎంలు కూడా అదేదారిలో
May10th | సెంట్రల్ డెస్క్, ఆంధ్రప్రభ : దేశంలో కొత్త ట్రెండ్ పాలన సాగుతోంది. ముఖ్యమంత్రులే హోం వంటి పవర్ ఫుల్ శాఖలను చూస్తున్నారు. నిజానికి రాష్ట్రాల్లో కానీ, కేంద్రంలో కానీ కీలకమైన శాఖగా.. నంబర్ టూగా హోం శాఖ ఉంటుంది. లా అండ్ ఆర్డర్‌తో ముడిపడి ఉన్న ఈ శాఖ ఎంతో ఇంపార్టెంట్‌గా ఉంటుంది. రాజకీయంగా కూడా ఈ శాఖకు ఉన్న గ్లామర్ వేరుగా ఉంటుంది. ఒక విధంగా చెప్పాలంటే హోం మంత్రి అంటే వెయిటింగ్ చీఫ్ మినిస్టర్ అని గతంలో చెప్పుకునే వారు.
సీనియర్ మోస్ట్ లీడర్‌కి ఈ శాఖ కట్టబెట్టేవారు. అయితే.. మారిన ట్రెండ్‌లో చూస్తే ముఖ్యమంత్రులే ఈ శాఖను చూస్తున్నారు. లా అండ్ ఆర్డర్ రాజకీయాలను, ప్రభుత్వాల తలరాతను శాసిస్తోంది. దాంతో పాటు ప్రభుత్వంలో నంబర్ టూగా వేరెవరికో చాన్స్ ఇచ్చి తలనొప్పులు తెచ్చుకోవడం ఎందుకనే ఆలోచనలో పలువురు ముఖ్యమంత్రులు ఉన్నట్టు తెలుస్తోంది. అందుకే దేశంలో చాలా రాష్ట్రాల్లో ముఖ్యమంత్రులే హోంశాఖ బాధ్యతలు చూస్తుండడం గమనార్హం.
విజయ్ చేతిలోనే హోం శాఖ..
దళపతిగా వెండితెరను ఏలిన విజయ్ ముఖ్యమంత్రి అయ్యాక కీలక శాఖలను మంత్రులకు కేటాయించారు. ఆయనతో పాటు తొమ్మిది మంది మాత్రమే ఈ నెల 10వ తేదీన ప్రమాణం చేశారు. వారందరికీ తాజాగా శాఖలు ప్రకటించారు. అందులో కీలకమైన హోం శాఖను మాత్రం విజయ్ తన వద్దనే ఉంచుకోవడం విశేషం. దాంతో హోం, పోలీస్, పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ శాఖల ప్రత్యక్ష బాధ్యతలను నిర్వహించనున్నారు. ఒక విధంగా ముఖ్యమంత్రిగా బాధ్యలతో పాటు హోం శాఖ కూడా కీలకమే.. కానీ విజయ్ మాత్రం ప్రతిష్టగా తీసుకుని తమిళనాడులో లా అండ్ ఆర్డర్‌కి తానే పూర్తి బాధ్యత వహించాలని భావిస్తున్నట్టు తెలుస్తోంది.
రేవంత్ రెడ్డి సైతం..
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అయితే మొదటి నుంచి తన వద్దనే హోం శాఖను ఉంచుకున్నారు. తెలంగాణ కాంగ్రెస్‌లో ఎంతో మంది సీనియర్లు ఉన్నారు. కానీ ముఖ్యమంత్రి ప్రత్యేక ఆసక్తితో ఈ శాఖను రెండున్నరేళ్ళుగా చూస్తున్నారు. ఆయన స్వయంగా హోం శాఖను నిర్వహిస్తూ రాష్ట్రంలోని శాంతిభద్రతలు సాధారణ పరిపాలన విభాగాలను పర్యవేక్షిస్తున్నారు. అలా గట్టి హోం మంత్రిగానే పేరు తెచ్చుకున్నారు. మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవిస్ మహారాష్ట్ర హోం శాఖను పర్యవేక్షిస్తున్నారు. ఆయన ముఖ్యమంత్రిగా తన విధులతో పాటు ఈ పదవిని కూడా నిర్వహిస్తున్నారు. ఒక చాలెంజ్‌గా స్టేట్‌లో లా అండ్ ఆర్డర్‌ని నడిపిస్తున్నారని రాజకీయ పరిశీలకులు అంటున్నారు.
సువేందు అధికారి కూడా ..
సీనియర్ లీడర్ మమతా బెనర్జీని దించేసి పశ్చిమ బెంగాల్‌కి తొమ్మిదో ముఖ్యమంత్రిగా ప్రమాణం చేసిన సువేందు అధికారి హోం మంత్రిగా కూడా వ్యవహరిస్తున్నారు. ఆయన రాష్ట్ర హోంశాఖతో పాటు కొండ ప్రాంతాల వ్యవహారాల విభాగ శాఖలను చూస్తున్నారు. బెంగాల్లో లా అండ్ ఆర్డర్ కత్తి మీద సాము లాంటిది. దాంతో పాటు ఢీ అంటే ఢీగా రాజకీయం సాగుతుంది. సువేందు అధికారి ఈ అతి ముఖ్య బాధ్యతలను తానే భుజాల మీద వేసుకున్నారు.
పదేళ్లు సీఎం ప్లస్ హోం..
దక్షిణాన కేరళం రాష్ట్రానికి నిన్నటిదాకా ముఖ్యమంత్రిగా పనిచేసిన పినరయి విజయన్ మొదటి రెండవ ఎల్డిఎఫ్ ప్రభుత్వాలు రెండింటిలోనూ హోం మంత్రిగా తానే పనిచేశారు. ఆయన హోం శాఖతో పాటు సాధారణ పరిపాలన, నిఘా సమాచార సాంకేతిక శాఖలను కూడా తన వద్దే ఉంచుకుని రాష్ట్రాన్ని ముందుకు నడిపారు. ఇదే తీరున చూస్తే మధ్యప్రదేశ్‌కు ప్రత్యేకంగా హోం మంత్రి ఎవరూ లేరు. ముఖ్యమంత్రి డాక్టర్ మోహన్ యాదవ్ స్వయంగా హోం శాఖను నిర్వహిస్తూ వస్తున్నారు. అలాగే ఉత్తర ప్రదేశ్‌కు ప్రత్యేకంగా హోం మంత్రిని తీసుకోలేదు. ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ స్వయంగా హోం శాఖను నిర్వహిస్తున్నారు.
వీరంతా అదే దారిలో..
పంజాబ్ ముఖ్యమంత్రి భగవంత్ మాన్ ప్రస్తుతం హోం వ్యవహారాలు న్యాయ శాఖలను నిర్వహిస్తున్నారు. ఆయన మార్చి 2022 లో మంత్రివర్గాన్నిఏర్పాటు చేసినప్పటి నుంచి హోం మంత్రిత్వ శాఖ తన వద్దనే ఉంచుకున్నారు. బీహార్ కి కొత్త ముఖ్యమంత్రి అయిన సామ్రాట్ చౌదరి హోం, సాధారణ పరిపాలన, క్యాబినెట్ సెక్రటేరియట్, విజిలెన్స్, పౌర విమానయానం, ఎన్నికలు వంటి కీలకమైన, అత్యంత ప్రాధాన్యత గల పోర్ట్‌ఫోలియోలను పర్యవేక్షిస్తున్నారు. బీజేపీ నేతృత్వంలోని ఎన్డీఏ ప్రభుత్వంలో ఇతర క్యాబినెట్ మంత్రులకు ప్రత్యేకంగా కేటాయించని అన్ని శాఖలను ఆయన తన వద్దే ఉంచుకున్నారు. ఇలా అనేక మంది ముఖ్యమంత్రులు హోం శాఖ తమ వద్దనే ఉంచుకుని పవర్ ఫుల్ పరిపాలన అందిస్తున్నారని పొలిటికల్ అనలిస్టులు చెబుతున్నారు.
