జంగారెడ్డి గూడెం ప్రతినిధి, ఆంధ్రప్రభ :తెలంగాణ, ఏపీ మధ్య అనుసంధానంలో ఓ మార్గం ఇంకా వెనుకబడి ఉంది. ఈ దారిలో ఇప్పటికీ ఇరుకుమలుపులన్నీ మృత్యు మార్గాలుగా మారి ఎందరినో బలి తీసుకున్నాయి. ఎట్టకేలకు కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక దృష్టితో గ్రీన్ ఫీల్డ్ ఎక్స్ ప్రెస్ హైవే 365 బీజీ రోడ్డు నిర్మాణం చేపట్టి మూడేళ్లు గడిచాయి. ఇప్పుడే తాజాగా వాహనాల రాకపోకలకు సర్వ సన్నద్ధం అవుతోంది. కానీ. భూ సేకరణలో జాప్యం, అధిక వర్షాలతో నిర్మాణ పనులకు బ్రేక్ పడుతూనే ఉంది.
తెలంగాణలోని ఖమ్మం నుంచి ఏపీలోని దేవరపల్లి మధ్య 162 కిలోమీటర్ల మేర నిర్మిస్తున్న ఈ రహదారి మిగతా వాటికంటే పూర్తి భిన్నమైనది. పచ్చని పొలాల మధ్యలోంచి, ప్రకృతిని ఆస్వాదిస్తూ ప్రయాణం సాగించవచ్చు. ఈ రహదారి నిర్మాణం పూర్తయితే హైదరాబాద్ – విశాఖ మధ్య విజయవాడ వెళ్లకుండానే రయ్ రయ్ మంటూ దూసుకెళ్లవచ్చు.దూరం తగ్గితే.. జల్దీ జర్నీహైదరాబాద్ నుంచి విశాఖ మధ్య 125 కిలోమీటర్ల దూరం తగ్గించడానికి మూడేళ్ల కిందట ఖమ్మం నుంచి ప్రస్తుత తూర్పు గోదావరి జిల్లా పూర్వపు పశ్చిమ గోదావరి జిల్లా దేవరపల్లి వరకు గ్రీన్ ఫీల్డ్ ఎక్స్ ప్రెస్ జాతీయ రహదారి నిర్మాణం చేపట్టారు.
ఖమ్మం జిల్లా -తల్లాడ జాతీయ రహదారి డైమండ్ జంక్షన్కు రెండు కిలోమీటర్ల దూరంలో గ్రీన్ ఫీల్డ్ హైవే ప్రారంభమవుతుంది. 162 కిలోమీటర్ల దూరంలో నాలుగు లైన్ల గ్రీన్ ఫీల్డ్ హైవే -365 బీజీ పచ్చని పొలాల మధ్య నిర్మిస్తున్నారు. సుమారు రూ. 4,609 కోట్లతో నిర్మించే ఈ రోడ్డుకు 31 గ్రామాల్లో 19 96 ఎకరాల భూమిని కేంద్ర ప్రభుత్వం సేకరించింది.గ్రీన్‌ఫీల్డ్ రోడ్డులో నాలుగు టోల్ ప్లాజాలు..ఖమ్మం-దేవరపల్లి గ్రీన్ ఫీల్డ్ జాతీయ రహదారిని హైదరాబాద్ – విశాఖ మధ్య దూరం తగ్గించేందుకు ప్రధానంగా నిర్మిస్తున్నారు.
హైదరాబాద్ నుంచి విశాఖపట్నం వెళ్లాలంటే 676 కిలోమీటర్లు 12 గంటలపాటు ప్రయాణించాలి. ప్రధానంగా విజయవాడ మీదుగా వెళ్లాలి. ఇక విజయవాడలో జాతీయ రహదారుల్లో మహా రద్దీ తప్పదు. గంటల కొద్దీ ఆలస్యం పీడిస్తుంది. నిజానికి హైదరాబాద్ టూ విశాఖ 12గంటల జర్నీ.. కానీ, విజయవాడలోనే మరో రెండు మూడు గంటల జాప్యం తప్పటం లేదు. ఈ స్థితిలో హైదరాబాద్ నుంచి విజయవాడ వెళ్లకుండానే గ్రీన్ ఫీల్డ్ ఎక్స్ ప్రెస్ వేలో సుమారు 125 కిలోమీటర్ల మేర దూరం తగ్గుతుంది. 8 గంటల్లోనే విశాఖ నుంచి హైదరాబాద్ చేరుకోవచ్చు.
నాలుగు లైన్ల యాక్సెస్ కంట్రోల్డ్ జాతీయ రహదారి 162 కిలోమీటర్ల దూరంలో కేవలం 8 చోట్ల మాత్రమే ఈ రోడ్డులో ప్రవేశించడానికి వీలుంది. తెలంగాణాలోని ఖమ్మం, వైరా, కల్లూరు, సత్తుపల్లి, ఏపీలో తిరువూరు, జంగారెడ్డిగూడెం, గురవాయిగూడెం, దేవరపల్లి వద్ద మాత్రమే ఈ రహదారిపైకి రావడానికి అనుసంధాన రహదారులు ఏర్పాటు చేశారు. ఆంధ్రప్రదేశ్ పరిధిలో నాలుగు చోట్ల టోల్ ప్లాజాలు, విశ్రాంతి కేంద్రాలు ఏర్పాటు చేస్తున్నారు.
ఇక్కడే తిరకాసు తూర్పుగోదావరి జిల్లా పరిధిలో 56.7 కిలోమీటర్ల మేర ఈ రహదారి విస్తరించింది. దీన్ని రెండు ప్రాజెక్టులుగా చేపట్టారు. గత ఏడాది డిసెంబర్ నాటికి నిర్మాణం పూర్తి కావాలి. మొదటి ప్రాజెక్టులో 90శాతం పనులు పూర్తి కాగా, రెండో ప్రాజెక్టులో 70శాతం మాత్రమే జరిగింది. ఇంకా మూడు కిలోమీటర్ల మేర అసలు రహదారి పనులు ప్రారంభమే కాలేదు. భూ సేకరణ అంశం కొలిక్కి రాకపోవడంతో మూడు కిలోమీటర్లు పనులు నిలిచిపోయాయి. ఏలూరు జిల్లా కొయ్యలగూడెం మండలం రాజవరం వద్ద సుమారు మూడు కిలోమీటర్ల మేర భూ సమస్య కోర్టు పెండింగ్‌లో ఉంది. కోర్టులోనే రాజీ యత్నాలు జరుగుతున్నట్టు సమాచారం.
ఇదే రూట్‌లో రైల్వే వచ్చేస్తోంది..ఏడు దశాబ్దాలుగా పోలవరం ప్రాజెక్టు సహా.. ప్రతిపాదనలోని భద్రాచలం రోడ్డు.. కొవ్వూరు రైల్వే లైన్ ప్రస్తుతం తెరమీదకు వచ్చింది. గ్రీన్ ఫీల్డ్ హైవే రూట్ వెంబడే భూ సేకరణకు కేంద్రం సిద్ధపడినట్టు సమాచారం. ఇప్పటికే భద్రాచలం నుంచి సత్తుపల్లి వరకు కోల్ రవాణా కోసం రైల్వే లైన్ వేశారు. ఇక సత్తుపల్లి నుంచి గ్రీన్ ఫీల్డ్ హైవే పక్క నుంచి రూట్ మ్యాప్ సిద్ధం అయ్యిందని విశ్వాసనీయ సమాచారం.
చింతలపూడి సమీపంలోని ఎర్ర గుంటపల్లి వద్ద కోల్ మైన్స్ గుర్తించి సర్వే చేశారు. జంగారెడ్డిగూడెం సమీపం మర్లగూడెం ఫారెస్ట్ భూముల్లో బొగ్గు నిల్వలు పుష్కలంగా ఉన్నాయి. ఈ మార్గంలో రైల్వే రూట్ వేస్తే గిరిజన ప్రాంతం అభివృద్ధితో పాటు బొగ్గు రవాణాకు మార్గం సుగమం అవుతుంది.
ఫంద్రాగస్టుకు అంతా సిద్ధం?
కాగా, ఈ రూట్‌లో ఇప్పటికే మూడు సార్లు సర్వే చేసి రైలు లైన్‌తో లాభదాయకం అని గుర్తించారు. సరకు రవాణా సులభం.. హైదరాబాద్ నుంచి వైజాగ్ వైపు ప్రయాణ దూరం తగ్గుతుంది. త్వరలో గ్రీన్ ఫీల్డ్ హైవేపై జర్నీకి గ్రీన్ సిగ్నల్ వస్తుంది. ఇక.. భూ సేకరణ విషయంలో రెండు రాష్ట్రాల్లో తలెత్తిన వివాదాలు కొలిక్కి రావడానికి సమయం పట్టింది. ఇందువల్ల గత డిసెంబర్ నాటికే వినియోగంలోకి రావాల్సిన రోడ్డు దాదాపు ఏడాది ఆలస్యంగా అగస్ట్ 15 నాటికీ సిద్ధం అవుతుందని భావిస్తున్నారు.